‘ఐకాన్‌’ కథ ముగిసినట్టేనా!

ABN , First Publish Date - 2022-08-13T05:15:13+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు తాగునీరందించే పథకాల శిలాఫలకాలతో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన ‘ఐకాన్‌’ పార్కు కళ తప్పింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఐకాన్‌ పార్కు పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నది.

‘ఐకాన్‌’ కథ ముగిసినట్టేనా!

పట్టించుకోని నీటి సరఫరా విభాగం

పిచ్చి మొక్కలతో నిండిపోయిన పార్కు


తూప్రాన్‌, ఆగస్టు 12: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు తాగునీరందించే పథకాల శిలాఫలకాలతో  మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన ‘ఐకాన్‌’ పార్కు కళ తప్పింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఐకాన్‌ పార్కు పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నది. ఊరూరా ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఐకాన్‌ పార్కును పట్టించుకోవడం లేదు.ఏర్పాటు చేసిన ఐకాన్‌ సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గం తాగునీటి అవసరాలు తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే డాక్టర్‌ గీతారెడ్డి పలు పథకాలను మంజూరు చేయించారు. తూప్రాన్‌ పట్టణానికి మంజీరా నీటిని అందించేందుకు నీధులు మంజూరు చేయించగా.. ఈ పథకానికి అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు తూప్రాన్‌లో రూ. 6లక్షలతో నీటి సరఫరా విభాగం ఐకాన్‌ను నిర్మించారు. అలాగే, 2009లో నియోజకవర్గంలో మంజీరా తాగునీటి సరఫరాకు హడ్కో నిధులు రూ. 115 కోట్లు మంజూరు చేయగా 2 ఎంఎల్‌డీ మైక్రోఫిల్టర్‌ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 17న గీతారెడ్డి ప్రారంభించారు. 2010 ఏప్రిల్‌ 20న తూప్రాన్‌ పట్టణానికి ఏర్పాటు చేసిన మంజీరా తాగునీటి పథకం కూడా ఆమె ప్రారంభించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని 144 గ్రామాలకు సమగ్ర మంజీరా తాగునీరు సరఫరా పథకం చేపట్టడానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యుపీ నిధులు రూ. 40 కోట్లు మంజూరు చేయగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దుబ్బాక, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు సైతం మంజీరా తాగునీరు అందించే పథకాలకు శిలాఫకాలు వేశారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో సమగ్ర తాగునీటి పథకం అందించేందుకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యుపీ నిధులు రూ. 732.28 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో 2.30 ఎంఎల్‌డీ రాపిడ్‌ సాండ్‌ ఫిల్టర్లు, పైపులైన్‌, పంపుసెట్స్‌, వాచ్‌మెన్‌ క్వార్టర్‌, కాంఫౌండ్‌ వాల్‌ ఏర్పాటుకు నిశ్చయించారు. 2014 ఫిబ్రవరి 20న గజ్వేల్‌ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫకాలను ఐకాన్‌ చుట్టూ అతికించారు. అందమైన మొక్కలతో పార్కును రూపొందించారు. ముందు నుంచి ఏర్పాటు చేసిన గేటు, మార్గం ద్వారా పశువులు వస్తున్నాయంటు మూసేశారు. చుట్టూరా ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ తొలగించి, ప్రహరీగోడను నిర్మించారు. ప్రస్తుతం కనిపించకుండా చాటుగా మారిపోవడంతో గార్డెన్‌, ఐకాన్‌ చుట్టూరా పిచ్చి మొక్కలు పెరిగాయి. నీటి సరఫరా విభాగానికి సంబంధించిన పైపులు, పాత సామగ్రితో నిండిపోయింది. పచ్చదనం పెంచడం కోసం ప్రభుత్వం అర్బన్‌ పార్కులు, పల్లె, పట్టణ ప్రకృతివనాలు రూపొందిస్తున్న ప్రభుత్వం నీటి సరఫరా విభాగం ఐకాన్‌ పార్కును పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నారు. 


పార్కును ఉపయోగంలోకి తీసుకురావాలి 

-ప్రభాకర్‌, తూప్రాన్‌

తూప్రాన్‌ పట్టణంలోని మండల కార్యాలయం వద్ద నీటిపారుదలశాఖ ఏర్పాటు చేసిన పార్కును ఉపయోగంలోకి తీసుకురావాలి. గతంలో కార్యాలయాలకు వచ్చే ప్రజలు సేదతీరేందుకు ఈ పార్కు ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం పిచ్చిమొక్కలతో నిరుపయో గంగా మారింది. అధికారులు స్పందించి పార్కును ఉపయోగంలోకి తీసుకురావాలి.

Updated Date - 2022-08-13T05:15:13+05:30 IST