కథ ముగిసినట్టేనా?

ABN , First Publish Date - 2022-08-03T06:33:25+05:30 IST

అల్‌ఖైదా నాయకుడు అయ్‌మాన్‌ అల్ జవహిరిని హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సగర్వంగా ప్రకటించారు. రెండుదశాబ్దాలక్రితం తమదేశంపై జరిగిన...

కథ ముగిసినట్టేనా?

అల్‌ఖైదా నాయకుడు అయ్‌మాన్‌ అల్ జవహిరిని హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సగర్వంగా ప్రకటించారు. రెండుదశాబ్దాలక్రితం తమదేశంపై జరిగిన ఓ భయానక దాడికి మూలకారకుడైన ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టడం కచ్చితంగా దానికి గర్వకారణమే. అమెరికాలో ఒక తరానికి అంతగా తెలియని, తెలిసినవారు కూడా క్రమంగా ఆ దారుణాన్ని మరిచిపోతున్న తరుణంలో, అమెరికా తన మాజీ దుష్టశక్తిమీద పగతీర్చుకుంది. డెబ్బయ్యేళ్ళునిండిన ఈ ఉగ్రవాదిని చంపి, సెప్టెంబరు 11 దాడిలో కన్నుమూసిన మూడువేలమంది సామాన్యులకు న్యాయం చేశామనీ, కథ కంచికి చేరినట్టేనని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు.


చంపేయండి అని బైడెన్ నుంచి ఆదేశాలు అందిన ఐదురోజుల్లో, మంచి సమయం, సందర్భం చూసుకొని, కాబూల్‌లో తన ఇంటి బాల్కనీలో ఉన్న జవహిరిని అమెరికా దళాలు రెండు హెల్‌ఫైర్ మిసైళ్ళతో హతమార్చాయి. మిగతావారికి ఏ మాత్రం నష్టం చేయకుండా, చివరకు ఇంట్లోని మిగతాప్రాంతాలు కూడా దెబ్బతినకుండా శత్రువుని మాత్రమే సంహరించే రీతిలో అమెరికా ఎంత సునిశితంగా ఈ పని ముగించిందో దాడికి సంబంధించిన చిత్రాలు చెబుతున్నాయి. జవహిరి ఆనుపానులు అమెరికాకు తెలిసి అనేక నెలలైందని, అతడు వేసే ప్రతీ అడుగు అమెరికా ఇన్ని రోజులుగా గమనిస్తూ వచ్చిందని అంటున్నారు. సర్వసాధారణంగా ఉగ్రవాదులతో పాటు సామాన్యులనూ నాశనం చేసే అలవాటున్న అమెరికా, జవహిరిని విషయంలో ఇంత జాగ్రత్తపడటం వెనుక తాలిబాన్‌కు ఆగ్రహం కలిగించకూడదన్న ఉద్దేశం కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆరంభంలో జవహిరి కుటుంబం ఈ ఇంట్లోకి మారడం, క్రమంగా స్వేచ్ఛగా సంచరించడం అధికారులు గమనించారు. తాలిబాన్ అండదండలు లేకుండా ఈ అల్‌ఖైదా అధినాయకుడికి ఇదంతా సాధ్యపడేదికాదు కనుక, అతడికి ఆశ్రయం ఇచ్చి దోహా ఒప్పందాన్ని తాలిబాన్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తున్నది. అమెరికా శత్రువులకు తన దేశాన్ని స్థావరం కానివ్వబోమన్న హామీని తాలిబాన్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తున్నది. అన్ని అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘించి సర్వసత్తాక అఫ్ఘానిస్థాన్ మీద అమెరికా ఈ దాడిచేసిందని తాలిబాన్ వ్యాఖ్యానించింది.


పాకిస్థాన్ నుంచి, ఈ ఏడాది ఆరంభంలో అఫ్ఘానిస్థాన్ తరలిపోయిన జవహిరినీ పాక్ ఇంటలిజెన్స్ సహాయం లేకుండా అమెరికా మట్టుబెట్టగలిగే అవకాశాలు లేవనీ, అమెరికా ఆర్థికసహకారాన్నీ, మరీముఖ్యంగా ఐఎంఎఫ్ సాయంకోసం పాక్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికాకు అది రహస్యసహకారం అందించివుంటుందని ఓ విశ్లేషణ. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ అంటే గిట్టని నాయకులు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. నిజానిజాలు అటుంచితే, జవహిరిని మట్టుబెట్టడం భారతదేశానికి కూడా ఉపశమనం ఇచ్చే విషయమే. కశ్మీర్ విషయంలో అల్‌ఖైదా ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోతున్నప్పటికీ, దానిని పాలస్తీనాతో పోల్చుతూ, భారత్ పక్షం వహిస్తున్నందుకు సౌదీ వంటి దేశాలను విమర్శిస్తూ జవాహిరీ తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో హిజాబ్ వివాదం రేగినప్పుడు భారతదేశ పాలకులను హెచ్చరిస్తూ, మొన్న జూన్‌లో ప్రధాన నగరాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరికలు చేశాడాయన. ఆయన నేరుగా ఓ వీడియోలో కనిపిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం, భారతదేశాన్ని ప్రత్యేకంగా హెచ్చరించడం తన సంస్థను విస్తరించే ఆలోచన తెలియచెప్పడమే కాక, భారతదేశంలోని మైనారిటీలను రెచ్చగొట్టే ఆలోచనగా కూడా ఇంటలిజెన్స్ వర్గాలు భయపడ్డాయి.


అఫ్ఘానిస్థాన్ తాలిబాన్ చేతుల్లోనే ఉన్నప్పటికీ, పూర్తిగా దాని నియంత్రణలోనే లేదు. సంఖ్యాబలం లేని రీత్యా అది మొత్తంగా పెత్తనం చేయలేకపోతుండటంతో అల్‌ఖైదావంటి సంస్థలు చాలా ప్రావిన్సుల్లో స్థావరాలు కొనసాగిస్తూ, నియామకాలు జరుపుకుంటూ, నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటూ బలపడుతున్నాయి. తాలిబాన్ అధీనంలోని ప్రాంతాల్లో కూడా భారత వ్యతిరేక లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని భారత్ వాదన. అఫ్ఘానిస్థాన్ నుంచి నిష్క్రమించాలన్న అమెరికా నిర్ణయాన్ని భారత్ వ్యతిరేకించింది అందువల్లనే. కానీ, అమెరికా పూర్తిగా తన స్వప్రయోజనాలు చూసుకొని, అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకుండానే తప్పుకుంది. ఇప్పుడు జవహిరీ వంటి ఒక అత్యు న్నతస్థాయి ఉగ్రవాద నాయకుడు అక్కడ ఇంతకాలమూ స్వేచ్ఛగా సంచరించిన వాస్తవం భారత్ భయాలను నిజం చేస్తున్నాయి. అతడిని మట్టుబెట్టడం అమెరికాకు విజయం కావచ్చును కానీ, భారత్‌కు మరింత జాగ్రత్తగా ఉండాలన్న ఓ హెచ్చరిక కూడా.

Updated Date - 2022-08-03T06:33:25+05:30 IST