మూడు ముక్కలాట ముగియలేదా?

Published: Thu, 31 Mar 2022 02:35:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మూడు ముక్కలాట ముగియలేదా?

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధ ఒప్పందం ప్రకారం వారికి కేటాయించిన ప్లాట్లను అభివృద్ధిపరిచి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మార్చి 3న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. దీంతో రాజధాని విషయంలో నెలకొన్న సంక్షోభం సమసిపోయినట్టే అని ప్రజలందరూ సంతోషించారు. మూడో నెల, మూడో తేదీ నాడు రాజధాని విషయంలో జరుగుతున్న మూడు ముక్కలాటకు కోర్టు ముగింపు పలికిందని అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెడుతుందని ఆశించారు. అయితే మార్చి 24న అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి రాజధాని విషయంపై చర్చించారు. ఆ చర్చలో భాగంగా శాసన వ్యవస్థకు నిర్దిష్టమైన విధానం ఉంటుందని, అటువంటి వ్యవస్థను చట్టం చేయకూడదంటూ కోర్టులు ఆదేశించజాలవని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి అసెంబ్లీయే సుప్రీం అని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు వ్యాఖ్యలు శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు, హక్కులను కట్టడి చేసేవిగా ఉన్నాయని శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. దీంతో రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాటకు మరోసారి తెరలేపినట్టయింది. రాజధాని ప్రాంత రైతులతో పాటు ప్రజా సంఘాలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యవహారశైలిపై దుమ్మెత్తి పోశారు. రాజధాని రైతుల సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయస్థానం ఇచ్చిన తుది తీర్పుపై ఇప్పుడు మళ్ళీ చర్చించడం, కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రాజ్యాంగ వ్యతిరేకం, కోర్టు ధిక్కారం, ప్రజాధనం దుర్వినియోగమే అని అనేకమంది విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతో అన్ని వ్యవస్థలకు పరిధులు స్పష్టంగా ఏర్పాటు చేశారు. మెజారిటీ ఉంది కదా అని ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే రాజ్యాంగం చూస్తూ ఊరుకోదు. అధికారం చేతిలో ఉంది కదా అని సలహాదారులను నియమించుకున్నట్టు ఎవరిని పడితే వారిని కలెక్టర్లుగా నియమించుకోగలరా? ఇష్టారీతిన ప్రజాధనాన్ని ఖర్చుపెట్టగలరా? ఏకపక్షాన ఎవరికి వారు ఎన్నికలు నిర్వహించుకోగలరా? సొంతగా తీర్పులు ఇచ్చుకోగలరా? సాధ్యం కాదు.


రాజధాని విషయానికి వస్తే, రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడం రాజ్యాంగ వ్యతిరేకం. ఆ విషయం ఈ ప్రభుత్వానికి తెలియంది కాదు. కాకపోతే వ్యక్తిగత కక్షలు, ఓ వర్గంపై పెంచుకున్న కక్ష, తనదంటూ మార్కు ఉండాలనే కాంక్షతో మూడు రాజధానులు అంటూ మొండి పట్టుదలతో ఒక మూర్ఖపు నిర్ణయానికి శ్రీకారం చుట్టింది జగన్‌రెడ్డి ప్రభుత్వం. దానితో పాటు భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టింది. ఆ ప్రాంతాన్ని స్మశానంతోను, ఎడారితోను పోల్చి అవమానించింది. ఓ కులానికి అంటగట్టి నిందలు చేసింది. ముంపు ప్రాంతం అంటూ ఒకసారి, మూడు పంటలు పండే ప్రాంతం అంటూ మరోసారి ఆరోపణలు చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేసిన రైతులను శారీరకంగానూ, మానసికంగానూ నానా ఇబ్బందులకు గురిచేసింది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లా ఆ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం ఫలించి న్యాయవ్యవస్థ సుదీర్ఘ చర్చ జరిపి ఇచ్చిన తుది తీర్పుపై ఇప్పుడు ప్రభుత్వం విమర్శలు గుప్పించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే. ఈ ప్రాంతంపై ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నానని చెపుతున్న ముఖ్యమంత్రి తన నివాసానికి కొద్దిపాటి దూరంలో దాదాపు ఎనిమిది వందల రోజులకు పైగా దీక్షలు చేసిన రైతులను ఎందుకు కనీసం పలకరించలేకపోయారో, ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారో అసెంబ్లీలో చెపితే బాగుండేది. దానితో పాటు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పడు అమరావతే రాజధానిగా అంగీకరిస్తున్నాం అని చెప్పి ఇప్పడు మాట మార్చడం ఎంతవరకు సబబో చెప్పి ఉండాల్సింది. గత ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఖర్చుపెట్టిన వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాల్సివచ్చిందో చెప్పాల్సింది. అంతే కాకుండా ఉత్తరాంధ్రలో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం లాంటి ప్రాంతాల్లో కాకుండా అభివృద్ధి చెందిన వైజాగ్ నగరాన్ని, అదేవిధంగా రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపురంలో కాకుండా కర్నూలును రాజధానులుగా ఎందుకు నిర్ణయించుకున్నారో వివరించాల్సింది. ఇవేమీ మాట్లాడకుండా తమ అహం దెబ్బతిందనే అక్కసుతో మరోసారి రాజధాని విషయంలో మూడుముక్కలాటకు తెరలేపడం ఎంతవరకు సబబో జగన్‌రెడ్డి ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఆర్టికల్ 258 (3) ప్రకారం ఒక రాజధాని నగరాన్ని నెలకొల్పేందుకు శాసనసభకు పార్లమెంటు ఇచ్చిన అధికారాన్ని ఏపీ శాసనసభ వినియోగించుకుంది. అలా అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా ఎంచుకున్న తరువాత, మళ్ళీ మరోసారి చట్టం చేయడానికి, మార్చడానికి, విభజించడానికి అసెంబ్లీకి అధికారం లేదు. ఆర్టికల్ 4 కింద ఈ విషయంలో సర్వహక్కులూ పార్లమెంటువే. చట్టం చేసుకునే హక్కు ఒక్కసారి మాత్రమే శాసనసభకు ఉంటుంది. అది ఒకసారి ఏపీ శాసనసభ వినియోగించుకున్నది. రాజ్యాంగం ప్రకారం ఇది ఒక్కసారి మాత్రమే ఉండే అధికారం. హైకోర్టు తన తుది తీర్పులో చెప్పిందీ ఇదే. ఈ విషయం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరం.


ఏ ప్రభుత్వమైనా కొత్తగా అధికారం చేపట్టినప్పుడు అంతకుముందు నెలకొన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలే తప్ప, కొత్తగా సమస్యలు సృష్టించకూడదు. దానికి పూర్తి విరుద్ధంగా ఉన్న జగన్ పాలనలో అన్ని రంగాల ప్రజలూ రోడ్డున పడ్డారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది, సమస్యను సృష్టించిన ప్రభుత్వమే. ఇన్నాళ్ళూ కాలవశాన రాచరికాలు, రాజకీయ కారణాలతో పన్నెండు రాజధానులు వదులుకొన్న ఆంధ్రులు, నాయకుల అనాలోచిత నిర్ణయాలతో మరోసారి రాజధానిని వదులుకోవడానికి సిద్ధంగా లేరనే విషయం జగన్ ప్రభుత్వం గ్రహించాలి. మొండి పట్టుదలకు పోకుండా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి, రాజధాని రైతులకు చేయాల్సిన న్యాయంపై దృష్టి పెట్టాలి.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.