కారిడార్‌ కలేనా?

ABN , First Publish Date - 2022-09-20T06:16:16+05:30 IST

విభజన అనంతరం రాష్ట్రంలో అధిక ప్రభుత్వ భూములున్న ప్రాంతంగా దొనకొండను అప్పటి టీడీపీ ప్రభుత్వం గుర్తించించింది.

కారిడార్‌ కలేనా?
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రదేశం

పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం 

ఊరిస్తున్న దొనకొండ పరిశ్రమల కేంద్రం 

పరిశీలనలతో సరిపెట్టిన విదేశీ కంపెనీల ప్రతినిధులు 

 భూముల సర్వేకు పరిమితమైన అధికారులు

డిఫెన్స్‌ అకాడమీ కోసం భూసామర్థ్య పరీక్షలు, సర్వే 

అసలు ఆ వైపు దృష్టిపెట్టని ప్రజాప్రతినిధులు

దొనకొండ పారిశ్రామిక కారిడార్‌పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.  అవిగో పరిశ్రమలు.. ఇవిగో పేదలకు ఉపాధి అవకాశాలు అంటూ ఎప్పటికప్పుడు ఊరిస్తూ ఉసూరుమనిపిస్తోంది. అనేక సార్లు కంపెనీల ప్రతినిధులు, అధికారులు రావడం.. పరిశీలించి వెళ్లడం, తర్వాత పట్టించుకోకపోవడం షరామామూలుగా మారింది. సర్వేలు, భూసామర్థ్య పరీక్షలు చేసినా నేవీ డిఫెన్స్‌ అకాడమీ అడుగు ముందుకు పడలేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటినా  పరిశ్రమల ఏర్పాటులో పురోగతి కరువైంది. ఈ ప్రాంతంలోని యువత ఉద్యోగాలు, పేదలు ఉపాధి అవకాశాలపై పెంచుకున్న  ఆశలు అడియాశలయ్యాయి. వలసలు తప్పని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటవుతుందా? కలగా మిగులుతుందా? అన్నది చర్చనీయాంశమైంది.  

దొనకొండ, సెప్టెంబరు 19 : విభజన అనంతరం రాష్ట్రంలో అధిక ప్రభుత్వ భూములున్న ప్రాంతంగా దొనకొండను అప్పటి టీడీపీ ప్రభుత్వం గుర్తించించింది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. భూములకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని ఉత్త ర్వులు జారీచేసింది. దీంతో సంబంధిత అధికారులు రెండు విడతలుగా ఈ ప్రాంతంలోని భూములను పూర్తి స్థాయిలో సర్వే చేసి అందులో పట్టాభూమి 4,407.62 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12,367.95 ఎకరాలు, అసైన్‌మెంట్‌ భూమి 8,287.28 ఎకరాలు, మొత్తం 25,061-85 ఎకరాల భూమిని సర్వే ద్వారా నిర్ధారించారు.                                                                                             

పరిశీలనలతో సరిపెట్టిన విదేశీ ప్రతినిధులు

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇతర దేశాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు దొనకొండ ప్రాంతానికి వచ్చారు. అధికారులు వారికి  ఈ ప్రాంతంలో రహదారులు, నీటి సౌకర్యం, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మ్యాపుల ద్వారా వివరించారు. కొంత మేరకు మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది. కానీ  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సకాలంలో చొరవ చూపకపోవటంతో విదేశీ కంపెనీల ప్రతినిధులు ఈ ప్రాంత పరిశీలనకే పరిమితమయ్యారు. 


నిరుపయోగంగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల పార్క్‌ 

తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు చొరవతో 2018లో దొనకొండలోని రాగమక్కపల్లె రెవెన్యూ పరిధిలో 43.79 ఎకరాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కారిడార్‌ మంజూరైంది. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో అందులో చిన్నతరహా పరిశ్రమల నిమిత్తం మొత్తం 268 ప్లాట్లు ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాల ఏర్పాటులో భాగంగా కాలువలు, చప్టాలు, రహదారుల నిర్మాణాలకు రూ.6.60 కోట్లు మంజూరు చేశారు. పనులు పొందిన కాంట్రాక్టర్‌ ఎట్టకేలకు ఇటీవల కాలంలో అన్ని పనులు పూర్తిచేసినప్పటికీ చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు సైతం ప్రాథమికంగా ఎటువంటి అడుగులు పడలేదు. దీంతో ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని నెలలుగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.  


సోలార్‌ ప్రాజెక్టు పేరుతో వైసీపీ ప్రభుత్వం హడావుడి

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దొనకొండలోని రుద్రసముద్రం ప్రాంతంలో గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ నేతృత్వంలో 2,500ఎకరాల్లో సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు కొన్నినెలల క్రితం హడావుడి చేసింది. ఇందులో భాగంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ రుద్రసముద్రంలో గ్రామసభ నిర్వహించగా అనేకమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అధికారులు  కొన్నినెలల క్రితం వడివడిగా అడుగులు మందుకు వేశారు. ఒక వీఆర్వో, సర్వేయర్‌తో దాదాపు 30 బృందాలు పొలాల్లోకి వెళ్లి సాగులో ఉన్న రైతులకు చెందిన పూర్తి వివరాలతో భూముల సర్వే చేపట్టారు. అది జరిగి నెలలు గడిచినప్పటికీ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు నేటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవటంతో ఈ ప్రాజెక్టు హుళక్కేనంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. 


భూసామర్థ్య పరీక్షలు చేసి వదిలేశారు..

కొచ్చెర్లకోట రెవెన్యూ పరిధిలోని 2,710ఎకరాల భూమిలో డిఫెన్స్‌ అకాడమీ ఏర్పాటు నిమిత్తం నేవీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో లోఫ్రీక్వెన్సీ శాటిలైట్‌ ద్వారా కమ్యూనికేషన్‌ జరుపుకోవడం, ఇతర విడిభాగాల తయారు నిమిత్తం పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రెవెన్యూ సిబ్బంది సర్వే సైతం నిర్వహించారు. అనంతరం ఎల్‌అండ్‌టీ సంస్థ ఆధ్వర్యంలో కొన్నినెలల క్రితం ఆ ప్రాంతంలో భూసామర్థ్య పరీక్షలు చేశారు. వారి నివేదిక ఆధారంగా ఈ ప్రాంతంలో డిఫెన్స్‌ అకాడమీ ఏర్పాటు  ఖాయమని అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కారిడార్‌ అభివృద్ధిలో ఎలాంటి అడుగులు పడకపోవడంతో ప్రజలు విమర్శిస్తున్నారు.   


Updated Date - 2022-09-20T06:16:16+05:30 IST