రుణం అందేనా..?

ABN , First Publish Date - 2021-06-03T04:14:14+05:30 IST

ఖరీఫ్‌, రబీ అనే తేడా లేకుండా ఏ పంటకైనా బ్యాంకుల ద్వారా రైతులకు కావాల్సింది రుణసాయమే. కరోనా నేపథ్యంలో బ్యాంకులు ఏ మేరకు రుణసాయం అందిస్తాయోనన్న భయం రైతుల్లో నెలకొంది. నేటికీ రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడంతో వారిలో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

రుణం అందేనా..?

ఖరారు కాని ‘ఖరీఫ్‌’ ప్రణాళికలు

 రైతుకు సాయంపై అనుమానాలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఖరీఫ్‌, రబీ అనే తేడా లేకుండా ఏ పంటకైనా బ్యాంకుల ద్వారా రైతులకు కావాల్సింది రుణసాయమే. కరోనా నేపథ్యంలో బ్యాంకులు ఏ మేరకు రుణసాయం అందిస్తాయోనన్న భయం రైతుల్లో నెలకొంది. నేటికీ రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడంతో వారిలో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌లో 8,30,495 హెక్టార్లలో సాగు విస్తీర్ణం ఉంటుందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా 72,500 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి(2021-22) జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా జిల్లాలో అర్హులైన రైతులకు రూ.3 వేల కోట్లు రుణాలు అందించేందుకు లక్ష్యం పెట్టుకుంది. సహకార మిత్ర పథకం ద్వారా ఎస్టీయేతరులకు(భూమి తనఖాపై) రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖరీప్‌ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇంకా పాలకవర్గం ఆమోద ముద్ర పడలేదు.  


ఆమోదం ఇలా.. 

సాగు రుణసాయంపై ఏటా డిసెంబరులోనే నాబార్డు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటీ ఖరారు చేస్తుంది. పంటలకు నిర్దేశించిన రుణం ఆధారంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికను లీడ్‌బ్యాంకు రూపొందించాలి. ముందుగా నాబార్డు సూచించిన ప్రణాళికను జిల్లాస్థాయిలో ఖరారు చేసి బ్యాంకర్ల కమిటీ సమావేశం(డీసీసీ)లో ఆమోదిస్తారు. అనంతరం లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందిస్తారు. వాటిలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రాధాన్య, ప్రాధాన్యేతర రంగాలకు అవకాశం కల్పిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 5,89,852 మంది రైతులకు రూ. 1,850 కోట్లు అందించారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నాబార్డు ప్రణాళిక రూపుదిద్దుకున్నా, వార్షిక ప్రణాళిక ఖరారు కాలేదు. దీంతో రుణాల మంజూరుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.


 ప్రక్రియ ప్రారంభిస్తాం : 

డీసీసీ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఆమోదం మేరకు వార్షిక ప్రణాళికను ఖరారు చేస్తాం. జిల్లాలో అర్హులైన రైతులందరికీ ఖరీఫ్‌ రుణాలు మంజూరు చేస్తాం. ఈ ఏడాది లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.

- జి.వి.బి.డి. హరిప్రసాద్‌, లీడ్‌బ్యాంకు మేనేజర్‌, శ్రీకాకుళం.

Updated Date - 2021-06-03T04:14:14+05:30 IST