Elon Musk ట్విటర్ అకౌంట్ సస్పెండ్ అయ్యిందా ? అసలు వాస్తవం ఇదీ

ABN , First Publish Date - 2022-07-10T23:15:34+05:30 IST

‘ట్విటర్ కొనుగోలు’ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించడం ట్విటర్ యాజమాన్యానికి కోపం తెప్పించిందా ?..

Elon Musk ట్విటర్ అకౌంట్ సస్పెండ్ అయ్యిందా ? అసలు వాస్తవం ఇదీ

టెక్సాస్ : ‘ట్విటర్ కొనుగోలు’(Twitter Deal) ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon musk) ప్రకటించడం ట్విటర్(Twitter) యాజమాన్యానికి కోపం తెప్పించిందా ?.. మస్క్ ట్విటర్ ఖాతాని సస్పెండ్ చేసిందా?.. అంటూ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎలాన్ మస్క్ ట్విటర్ ఖాతా సప్పెండ్ అయ్యిందా?’ అంటూ ఓ యూజర్ ట్విటర్‌లో సందేహం వెలిబుచ్చడం ఇందుకు కారణమైంది. ఆ వ్యక్తి తన ట్విట్‌లో ప్రస్తావించిన అకౌంట్‌ ‘@elonmusk’ను క్లిక్ చేసి చూడగా ‘అకౌంట్ సస్పెండెడ్’ అని సందేశం డిస్‌ప్లే అవుతోంది. దీంతో నిజంగానే ఎలాన్ మస్క్ ట్విటర్ అకౌంట్ సస్పెండ్ అయ్యిందా అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. 44 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించడంతో ట్విటర్ ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకుందేమోనని చాలా మంది భ్రమపడ్డారు. కానీ ఎలాన్ మస్క్ ట్విటర్ అకౌంట్ రద్దు కాలేదు. యాక్టివ్‌గా ఉంది. అయినా నెటిజన్లు పొరబడడానికి ఒక కారణం ఉంది. 


ఎలాన్ మస్క్ ట్విటర్ ఖాతా ‘@eIonmusk’ గా ఉంటుంది. నెటిజన్లు సందేహ పడుతున్న ట్విటర్ ఖాతా కూడా సేమ్ టు సేమ్ ‘@eIonmusk’ను పోలివుంది. దీంతో నిజంగానే ఎలాన్ మస్క్ ఖాతా సస్పెండ్ అయ్యిందేమోనని పలువురు భావించారు. లేదా ఒకే పేరుతో రెండు ఖాతాలు ఉన్నాయా అని అనుమానించారు. కానీ ఒకే పేరుతో రెండు ట్విటర్ ఖాతాలు వీలుకాదు. అయినా రెండు పేర్లూ ఒకేలా కనిపించడానికి ఒక కారణం ఉంది. @eionmusk(ఇయాన్ మస్క్) పేరులో స్మాల్ ‘ i ’(ఐ) స్థానంలో క్యాపిటల్ ‘ I ’(ఎల్)ని చేర్చడంతో ఇయాన్ మస్క్ కాస్తా ఎలాన్ మస్క్‌గా కనిపించది. వాస్తవమేంటో తెలుసుకుని ట్విటర్ యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. రెండు అకౌంట్లు ఒకే మాదిరిగా ఉన్నాయని షాక్ అవుతున్నారు.


యూ-టర్న్ తీసుకున్న ఎలాన్ మస్క్..

దిగ్గజ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విటర్‌ కొనుగోలు విషయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ, స్పేస్‌ఎక్స్‌ ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ట్విటర్‌ కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. స్పామ్‌/ఫేక్‌ ఖాతాల గురించి తాను అడిగిన సమాచారాన్ని ట్విటర్‌ బోర్డు అందజేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించారు. ట్విటర్‌ కొనుగోలుకు సంబంధించి చేసుకున్న విలీన ఒప్పందానికి ఇది విరుద్ధమని ఆయన గుర్తుచేశారు. తన లక్ష్యాల్లో అత్యంత కీలకమైన ఫేక్‌/స్పామ్‌ ఖాతాల వివరాలను ఇచ్చేందుకు ట్విటర్‌ బోర్డు విముఖత వ్యక్తం చేస్తోందని మస్క్‌ శుక్రవారం నాటి తన ట్వీట్లలో పేర్కొన్నారు. కంపెనీ తమ నివేదికలో పేర్కొన్నట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని చెబుతూ వచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. ట్విటర్‌ చెబుతున్నదానికంటే నాలుగింతలు అధికంగా స్పామ్‌ ఖాతాలున్నాయన్నారు. స్టాక్‌ ఎక్స్చేంజీలకు ట్విటర్‌ ఇచ్చిన సమాచారం సరైందని భావించి, తాను ఆ సంస్థ కొనుగోలుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఆ విషయం తేలేదాకా ఈ ఒప్పందం ముందుకు వెళ్లదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-10T23:15:34+05:30 IST