ఆఫీస్‌కు వెళ్తే బిడ్డకు పాలివ్వలేను.. బ్రెస్ట్‌ ఫీడింగ్‌కు ప్రత్యామ్నాయం ఉందా?

ABN , First Publish Date - 2022-03-10T18:39:54+05:30 IST

నా పేరు స్వర్ణ. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం. నాకు ఎనిమిది నెలల పాప. ఇప్పటి వరకు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నాను. అయితే వచ్చే నెల నుంచి ఆఫీస్‌కు వెళ్లాలి. నేను ఆఫీస్‌కు వెళితే నా బిడ్డకు పాలు ఇవ్వడం కష్టమవుతుంది. మరి బ్రెస్ట్‌ ఫీడింగ్‌కు ప్రత్యామ్నాయం ఉందా?

ఆఫీస్‌కు వెళ్తే బిడ్డకు పాలివ్వలేను.. బ్రెస్ట్‌ ఫీడింగ్‌కు ప్రత్యామ్నాయం ఉందా?

ఆంధ్రజ్యోతి(10-03-2022)

ప్రశ్న: నా పేరు స్వర్ణ. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం. నాకు ఎనిమిది నెలల పాప. ఇప్పటి వరకు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నాను. అయితే వచ్చే నెల నుంచి ఆఫీస్‌కు వెళ్లాలి. నేను ఆఫీస్‌కు వెళితే నా బిడ్డకు పాలు ఇవ్వడం కష్టమవుతుంది. మరి బ్రెస్ట్‌ ఫీడింగ్‌కు ప్రత్యామ్నాయం ఉందా? 


డాక్టర్ సమాధాన: ఉద్యోగం చేసే చాలామంది చంటిబిడ్డల తల్లులకు ఎదురయ్యే సమస్య ఇది. పిల్లలకు ఏడాది వరకు తల్లి పాలు పట్టాలి. ఒకవేళ తల్లి ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తే చనుబాలు నిల్వ చేసి ఇవ్వవచ్చు. అలా చేయాలనుకొంటే ముందు రోజే పాలను ఓ బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. గాజు సీసా అయితే మంచిది. మార్కెట్‌లో లభించే ప్రత్యేక ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌లో కూడా స్టోర్‌ చేసుకోవచ్చు. పాపాయికి పట్టడానికి ముందు ఫ్రిజ్‌లో నుంచి తీసి రెండు మూడు గంటలు బయట పెట్టాలి. పాలు రూమ్‌ టెంపరేచర్‌లోకి వచ్చిన తరువాతనే తాగించాలి. ఒకవేళ వెంటనే ఇవ్వాల్సి వస్తే... వేడి నీటిలో కంటైనర్‌ ఉంచి నార్మల్‌ టెంపరేచర్‌కు వచ్చాక పట్టవచ్చు. ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరువాత ఐదారు గంటలు బయట ఉంచినా ఇబ్బంది లేదు.


తల్లి పాలు ఇవ్వడం కుదరకపోతే ఫార్ములా మిల్క్‌ పట్టవచ్చు. ఏడాది లోపు పిల్లలకు ఆవు, గేదె పాలు ఇవ్వకూడదు. ఇంకో విషయం ఏమిటంటే... ఎనిమిది నెలల బేబీకి క్రమంగా సాలిడ్‌ ఫుడ్‌ అలవాటు చేయవచ్చు. మొదట్లో అర కటోరీ తీసుకోగలుగుతారు. తరువాత నిదానంగా రోజుకు మూడు పూటలా తినిపించవచ్చు. 


జాగ్రత్తలివే...  

చనుబాలు తీయడానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  

పాలు పోయడానికి ముందు కంటైనర్‌ను బాగా శుభ్రం చేయాలి. లేదంటే పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.  

ఏ రోజున పాలు తీశారో ఆ తేదీని కంటైనర్‌పై రాయాలి. ఒకవేళ ఏదైనా డే కేర్‌ సెంటర్‌లో నిల్వ ఉంచేట్టయితే తప్పనిసరిగా తేదీతో పాటు మీ పాప పేరు కూడా రాసిన లేబుల్‌ అతికించాలి.  

ఒక కంటైనర్‌లో ఒకసారి పట్టడానికి సరిపోయే పాలను మాత్రమే నిల్వ చేసుకోవడం ఉత్తమం.  

చనుబాలను నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. అయితే కంటైనర్‌తో పాటు ఫ్రిజ్‌ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఫ్రిజ్‌లో నుంచి వేరే ఆహార పదార్థాలు తీసేటప్పుడు కంటైనర్‌కు మన చేతులు తగలకుండా చూసుకోవాలి. 


- డాక్టర్‌ అనుపమా యర్ర

కన్స్‌ల్టెంట్‌ పిడియాట్రిక్‌ అండ్‌ ఇంటెన్స్‌విస్ట్‌

రెయిన్‌బో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


Updated Date - 2022-03-10T18:39:54+05:30 IST