డ్రిప్‌ రిజిస్ర్టేషనలో రైతులకు స్వేచ్ఛ ఏదీ ?

ABN , First Publish Date - 2022-08-20T05:19:03+05:30 IST

డ్రిప్‌ పరికరాల రిజిస్ర్టేషన ప్రక్రియలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. రైతులకు ఇష్టమైన కంపెనీలను ఎంచుకునే సౌలభ్యం కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారు.

డ్రిప్‌ రిజిస్ర్టేషనలో రైతులకు స్వేచ్ఛ ఏదీ ?

నచ్చిన కంపెనీ ఎంచుకునే సౌలభ్యం కరువు 

పరిమితమైన లక్ష్యంతో ఇబ్బందులు 

తప్పనిపరిస్థితుల్లో ఇతర కంపెనీలు ఎంచుకుంటున్న అన్నదాతలు 


అనంతపురం అర్బన, ఆగస్టు 19: డ్రిప్‌ పరికరాల రిజిస్ర్టేషన ప్రక్రియలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. రైతులకు ఇష్టమైన కంపెనీలను ఎంచుకునే సౌలభ్యం కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారు. నాణ్యమైన డ్రిప్‌ పరికరాలు సరఫరా చేస్తాయనే నమ్మకమున్న పలు కంపెనీలను ఎంచుకునేందుకు రైతులు మొగ్గుచూపుతు న్నారు. ఆయా కంపెనీల పేర్లు ఆనలైనలో కనిపించక పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని అయోమయంలో రైతులు నిట్టూరుస్తున్నారు. జిల్లాలోని  రైతు భరోసా కేంద్రాల్లో రెండున్నర మాసాలుగా డ్రిప్‌ పరికరాల కోసం రిజిస్ర్టేషన ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటి దాకా జిల్లా వ్యాప్తంగా 27వేల మంది రైతులు 39వేల హెక్టార్లకు డ్రిప్‌ పరికరాల కోసం రిజిస్ర్టేషన చేసుకున్నారు. తాజాగా రిజిస్ర్టేషన చేసుకున్న రైతుల పొలాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి డ్రిప్‌ మంజూరు చేసేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఆ దిశగా ఏపీఎంఐపీ అధికారులు అడుగులు వేస్తున్నారు. తమకు నచ్చిన కంపెనీని ఎంచుకునే సౌలభ్యం పూర్తిగా ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.  


ఆనలైనలో నాలుగు ప్రధాన కంపెనీలు తొలగింపు  

జిల్లాకు ఏడాదికి 16వేల హెక్టార్లకు డ్రిప్‌ పరికరాలు మంజూరు చేయాలన్న లక్ష్యాన్ని విధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రిప్‌ సరఫరాను అటకెక్కించింది. దీంతో మూడేళ్లుగా రైతులు నిరీక్షిస్తూనే ఉన్నా రు. ఎట్టకేలకు ఈ ఏడాది డ్రిప్‌ మంజూరు చేసేందుకు పూనుకున్నా పరిమితంగా లక్ష్యాన్ని విధించడం, అందులోను కంపెనీల వారిగా టార్గెట్లు విధించి, ఆయా కంపెనీలకు సంబంధించి టార్గెట్‌ పూర్తైతే ఆయా కంపెనీలను ఎంచుకునేందుకు ఆప్షన లేకుండా ఆనలైనలో నుంచి తొలగిస్తున్నారు. జిల్లాలో డ్రిప్‌  సరఫరా చేసేందుకు 36 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గత నెల రోజులుగా నాలుగు ప్రధాన కంపెనీల పేర్లను ఆనలైన నుంచి తొలగించారు. ఆయా కంపెనీల టార్గెట్లకు లోబడి ముందుగా రిజిస్ర్టేషన చేసుకున్న రైతులకే డ్రిప్‌ పరికరాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. జిల్లాకు పరిమితంగా టార్గెట్‌ విధించడంతోనే ఈ దుస్థితి తలెత్తిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  


రిజిసే్ట్రషన చేసుకోలేని దుస్థితిలో అన్నదాతలు 

సబ్సిడీని కుదించడంతోపాటు తమకు నచ్చిన కంపెనీని ఎంచుకునే సదుపాయం లేకపోవడంతో వేలాది మంది రైతులు రిజిస్ర్టేషన చేసుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నా రు. గతంలో కంపెనీలు క్షేత్ర స్థాయిలో రైతులతో రిజిస్ర్టేషన చేసుకునేవి. తమ కంపెనీ సరఫరా చేసే డ్రిప్‌పరికరాలపై అవగాహన కల్పించి ఆ మేరకు రైతులను ఒప్పించేవారు. రైతులు ఏ కంపెనీని ఎంచుకుంటే ఆయా కంపెనీల నుంచి డ్రిప్‌ పరికరాలు సరఫరా అయ్యేలా ఏపీఎంఐపీ అధికారులు చర్యలు తీసుకునేవారు. ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆర్బీకేల్లో ఆనలైనలో పొందుపర్చిన కంపెనీల్లో ఏదో ఒక కంపెనీని ఎంచుకొని రిజిస్ర్టేషన చేసుకోవాల్సి వస్తోంది. తమకు నచ్చిన కంపెనీలకు ఆప్షన ఇచ్చే సదుపాయం లేకపోవడంతో అనేక మంది రైతులు రిజిస్ర్టేషన చేసుకో వడం లేదు. మరికొందరు తప్పని పరిస్థితుల్లో ఇతర కంపెనీలను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత కొత్త కంపెనీలు సరఫరా చేసే పరికరాలు నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నారు.


ఇదేం మెలిక..?

ప్రభుత్వం డ్రిప్‌ సబ్సిడీని కుదించింది. ఐదెకరాల్లోపు 90 శాతం సబ్సిడీ, ఐదు నుంచి పదెకరాల దాకా 70 శాతం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీని కుదించడంతోపాటు రైతుకు నచ్చిన కంపెనీని ఎంచుకునే సదుపాయం ఇవ్వకపోవడంపై బాధిత రైతులు నిట్టూరుస్తున్నారు. మూడేళ్లుగా డ్రిప్‌ మంజూరు లేకపోవడంతో టార్గెట్‌కు రెండింతలు అధికంగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు సగం మందికే ఈ సారి డ్రిప్‌ పరిక రాలు సరఫరా చేసే అవకాశం ఉంది. మిగతా రైతులకు ఇప్పట్లో పరికరాలు అందేలా కనిపిండంలేదన్న విమర్శలు న్నాయి. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది  జిల్లాకు డ్రిప్‌ లక్ష్యాన్ని పెంచి, రైతులు కోరినంతగా డ్రిప్‌ పరికరాలు సరఫరా అయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాల్సిఉంది. 


రైతులకు ఇష్టమైన కంపెనీని ఎంచుకోవచ్చు -   ఫిరోజ్‌ ఖాన, జిల్లా మైక్రో ఇరిగేషన అధికారి

రైతులకు ఇష్టమైన డ్రిప్‌ కంపెనీని ఎంచుకునే అవకాశం ఉంది. ఆర్బీకేల్లో రిజిస్ర్టేషన చేసుకునే సదుపాయం  కల్పించారు. జిల్లాలో నాలుగు కంపెనీలకు నిర్దేశించిన టార్గెట్‌ పూర్తి కావడంతో ఆనలైనలో నుంచి తీసేశారు. మిగతా కంపెనీల్లో రైతులకు నచ్చిన కంపెనీని ఎంచుకోవచ్చు. ముందుగా  రిజిస్ర్టేషన చేసుకున్న రైతులకు ప్రాధాన్యతను బట్టి ఆయా కంపెనీల ద్వారా డ్రిప్‌పరికరాలు మంజూరు అయ్యేలా  చర్యలు తీసుకుంటాం. జిల్లాకు  టార్గెట్‌ పెంచాలన్న విషయంపై అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. 



Updated Date - 2022-08-20T05:19:03+05:30 IST