మత ఘర్షణలకు బుల్డోజర్ న్యాయానికి లంకె!

ABN , First Publish Date - 2022-04-21T21:51:14+05:30 IST

మత ఘర్షణలు జరిగిన తర్వాత నిందితుల ‘అక్రమ’

మత ఘర్షణలకు బుల్డోజర్ న్యాయానికి లంకె!

న్యూఢిల్లీ : మత ఘర్షణలు జరిగిన తర్వాత నిందితుల ‘అక్రమ’ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్న సంఘటనలు ఇటీవల కనిపిస్తున్నాయి. ఇది ఓ వర్గాన్ని అణచివేయడానికే జరుగుతోందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే తాము మామూలుగా విధి నిర్వహణలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తున్నారు. 


గుజరాత్‌లో...

ఇటీవల గుజరాత్, మధ్య ప్రదేశ్, ఢిల్లీలలో మత ఘర్షణలు చెలరేగినపుడు నిందితుల ‘అక్రమ’ నిర్మాణాలపైకి బుల్డోజర్లు దూసుకెళ్ళాయి. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంబట్ పట్టణంలో శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న మత ఘర్షణలు జరిగాయి. ఐదు రోజుల తర్వాత అధికారులు స్పందించారు.  ప్రభుత్వ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ, ఆ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపించారు. ఆస్‌బెస్టాస్ రేకులను, కొన్ని మొక్కలను కూల్చేశారు. ఈ కూల్చివేతలను సవాల్ చేస్తూ ఈ నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తామని, ప్రభుత్వ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించుకోవడాన్ని అంగీకరించబోమని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి చెప్పారు. 


మధ్య ప్రదేశ్‌లో...

మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో కూడా ఇటువంటి చర్యలను ప్రభుత్వ అధికారులు అమలు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రపై కొందరు హింసాత్మకంగా దాడి చేశారు. ఆ మర్నాడు ప్రభుత్వ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. 20 దుకాణాలు, నాలుగు ఇళ్లను బుల్డోజర్లతో తొలగించారు. ఖర్గోన్ జిల్లా కలెక్టర్ అనుగ్రహ్ మాట్లాడుతూ, చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించామని, రూ.7 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులకు విముక్తి కల్పించామని చెప్పారు. కూలిన నిర్మాణాల్లో ఎక్కువ నిర్మాణాలు శోభాయాత్రపై దాడి కేసులో నిందితులకు చెందినవేనన్నారు. మైనారిటీలు, మెజారిటీలు చట్టవిరుద్ధంగా ఆక్రమించినవాటిని కూల్చినట్లు తెలిపారు. 


సెంధ్వాలో శ్రీరామ నవమినాడు జరిగిన హింసాకాండ అనంతరం 12 ఇళ్ళను కూల్చేశారు, వీటిలో 11 ఇళ్ళు ఈ హింసాకాండ కేసులో నిందితులకు చెందినవి. రాయ్‌సెన్ జిల్లాలో మత ఘర్షణల కేసులో ముగ్గురు నిందితులకు చెందిన ఇళ్ళను మార్చి 20న పాక్షికంగా కూల్చేశారు. 


ఈ కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు మధ్య ప్రదేశ్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. చట్టబద్ధమైన విచారణ లేకుండా ఇండోర్, భోపాల్, ఉజ్జయిని, ఖర్గోన్‌లలో నిందితుల ఇళ్లను కూల్చేశారని పిటిషనర్ ఆరోపించారు. 


ఆద్యుడు కమల్‌నాథ్..

నేరగాళ్ళ ఇళ్ళను కూల్చేయడం నాలుగేళ్ళ క్రితమే ప్రారంభమైంది. అప్పట్లో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. జీతు సోనీకి చెందిన నాలుగు అంతస్థుల హోటల్‌ను కూల్చేశారు. ఇది మొదటి, పెద్ద కూల్చివేత చర్య. ఆ తర్వాత బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా బుల్డోజర్ న్యాయాన్ని కొనసాగిస్తున్నారు. 


మధ్య ప్రదేశ్‌లో 2020 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 3 వరకు 12,640 చట్టవిరుద్ధ నిర్మాణాలను తొలగించారు. 188 మంది ఆక్రమణదారులపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. దాదాపు 500 మందిని వారి జిల్లాల నుంచి బహిష్కరించారు.  


ఉత్తర ప్రదేశ్‌లో...

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ముక్తార్ అన్సారీ, అతిక్ అహ్మద్, సుందర్ భాటీ, ఖాన్ ముబారక్ వంటి నేరగాళ్ల అక్రమ ఆస్తులను కూలగొట్టేందుకు బుల్డోజర్‌ను ప్రయోగించింది. అయితే అల్లర్లకు పాల్పడినవారి ఆస్తులపై ఆయన ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించలేదు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆయనను ‘బుల్డోజర్ బాబా’ అని చాలా మంది పిలిచారు. 


న్యూఢిల్లీలో...

న్యూఢిల్లీలోని జహంగీర్‌పురిలో బుధవారం చట్టవిరుద్ధ ఆక్రమణల్లో కొన్నిటిని తొలగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రపై దుండగులు దాడి చేసిన అనంతరం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ ఈ చర్యను చేపట్టింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ, కూల్చివేతలను ఆపాలని బుధవారం ఆదేశించింది. రెండు వారాలపాటు కూల్చివేతలను ఆపాలని గురువారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. 


Updated Date - 2022-04-21T21:51:14+05:30 IST