అభాగ్య ఖైదీలకు న్యాయమందేనా?

ABN , First Publish Date - 2022-04-20T06:23:55+05:30 IST

భారతదేశంలో ఒక నేరస్థుడికి బెయిల్ వచ్చేందుకు అతడి నేరాల తీవ్రతతో నిమిత్తం ఉండదు. ఎంతఘోరమైన నేరానికి పాల్పడ్డా ఎవరికి బెయిల్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి రాదో చెప్పడం కష్టం...

అభాగ్య ఖైదీలకు న్యాయమందేనా?

భారతదేశంలో ఒక నేరస్థుడికి బెయిల్ వచ్చేందుకు అతడి నేరాల తీవ్రతతో నిమిత్తం ఉండదు. ఎంతఘోరమైన నేరానికి పాల్పడ్డా ఎవరికి బెయిల్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి రాదో చెప్పడం కష్టం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కుమారుడైన ఆశిష్ మిశ్రా లఖీంపూర్ ఖేరీలో రైతులపై వాహనం నడిపించి 8 మంది మరణానికి కారకుడైతే, అతడికి బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు ఉత్సుకత ప్రదర్శించిన తీరును సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బెయిల్‌ను వ్యతిరేకించనంత మాత్రాన కేవలం ప్రభుత్వ స్వరాన్నే పట్టించుకుని బాధితుల స్వరాన్ని విస్మరించడం దారుణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘ఈ దేశంలో నేరాల బాధితులకు స్వరాన్ని పార్లమెంట్, న్యాయవ్యవస్థ ఇచ్చాయి. ఆ స్వరాన్ని వినాల్సిన అవసరం ఉన్నది. వినకపోతే స్పష్టంగా వినిపించేలా గొంతెత్తి అరవాలి. ప్రతి దశలోనూ న్యాయస్థానం బాధితుడి స్వరం వినాలి’ అని పేర్కొంది. ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.


భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ ఎటువంటి దుస్థితిలో ఉన్నదో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. పలుకుబడిగలవారికి, సంపన్నులకు, అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా మాత్రమే న్యాయవ్యవస్థ పనిచేస్తుందని, అభాగ్యుల స్వరాలను పెద్దగా పట్టించుకోదనే అభిప్రాయం ఇవాళ సర్వత్రా నెలకొన్నది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారమే జైళ్లలో ఉన్న ప్రతీ నలుగురు ఖైదీలలో ముగ్గురి కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. చిన్న చిన్న నేరాలకు పాల్పడినవారు న్యాయవాదులను నియమించుకోలేక, బెయిల్ కోసం పూచీకత్తులు కట్టుకునే పరిస్థితి లేక జైళ్లలోనే కునారిల్లుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సగటున ఒక జిల్లా జైలు 136 శాతం ఖైదీలతో నిండిపోయిందని ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో 90 శాతానికి పైగా ఖైదీలు కేసులు విచారణ దశలో ఉన్నవారే. విచారణ దశలో కేసులు కొనసాగుతున్న ఖైదీల్లో అత్యధికులు ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాల వారు, రెక్కాడితే కాని డొక్కాడని వారే. సగం మంది ఖైదీలు 18–30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే. ‘నా కుమారుడిని మొబైల్ చోరీ కేసులో ఇరికించి నాలుగు కేసులు మోపారు. ఏడాది నుంచీ కోర్టు చుట్టూ, తీహార్ జైలు చుట్టూ తిరుగుతున్నాను. పూచీకత్తుకోసం డబ్బులు పోగు చేస్తున్నాను’ అని ఒక స్వీపర్ తెలిపింది. భారతదేశపు జైళ్లలో ఉన్న అభాగ్య ఖైదీలు ఈ దేశ ఆర్థిక, ప్రజాస్వామ్య వ్యవస్థకు చిహ్నాలు అనడంలో సందేహం లేదు. అందరికీ పనిచేసేందుకు అవకాశాలు లభించి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా లభిస్తే, న్యాయవ్యవస్థ పేదలకు అనుకూలంగా ఉంటే జైళ్లు అభాగ్యులతో ఎందుకు నిండిపోతాయి?


దేశంలో ఎన్ని దౌర్భాగ్యాలున్నప్పటికీ అప్పుడప్పుడూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ లాంటి వారు ఇచ్చే తీర్పులు న్యాయవ్యవస్థ మన దేశంలో ఇంకా సజీవంగా ఉన్నదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఆయన రూపొందించిన ఫాస్టర్ వ్యవస్థ కూడా కోర్టులు ఇచ్చే తీర్పులు వేగంగా జైళ్లకు చేరి నిందితులు బెయిల్‌పై శీఘ్రంగా విడుదలయ్యేందుకు వీలు కలిగించింది. అభాగ్యులకు న్యాయసహాయం అందించేందుకు నల్సార్ వంటి సంస్థలు కొంతమేరకు తోడ్పడుతున్నాయి. గత ఏడాది ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులైన విద్యార్థి కార్యకర్తలు నటాషా నర్వాల్ , దేవంగనా కలితా ఏడాదికి పైగా జైలులో మ్రగ్గుతుంటే ఢిల్లీ హైకోర్టు జస్టిస్ అనూప్ బంభాని, జస్టిస్ సిద్దార్థ మృదుల్ వారిని విడుదల చేసేందుకు చరిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. ‘నిరసనను అణిచివేసే ఆతురతలో, పరిస్థితి చేయి దాటిపోతుందన్న భయంతో ప్రభుత్వం రాజ్యాంగం ప్రసాదించిన నిరసన తెలిపే హక్కుకూ, ఉగ్రవాద చర్యకూ మధ్య తేడా చూడలేకపోతోంది. దాని వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’ అని ఢిల్లీ హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం యూఏపిఏ క్రింద జైలులో ఉంచడం అతడి ప్రాథమిక హక్కుకు భంగకరమని, దీనివల్ల న్యాయ పరిపాలనా వ్యవస్థపై ప్రజల విశ్వాసం పోతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా గత ఏడాది ఇచ్చిన మరో తీర్పులో అభిప్రాయపడ్డారు. ‘విచారణ దశలో నిందితులను సుదీర్ఘకాలం నిర్బంధించరాదు. వేగంగా విచారణ జరగకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకుపోతుంది, ఇది రాజ్యాంగంలోని అధికరణ 21 క్రింద జీవించే హక్కుకు భంగకరం’ అని వారు స్పష్టం చేశారు. ఈ తీర్పులు దేశంలో ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం’ (యుఏపిఏ) దేశంలో దుర్వినియోగమవుతున్న తీరుకు నిదర్శనం. ఈ చట్టం కూడా వేలాది మంది బెయిల్ లేకుండా జైళ్లలో మగ్గేందుకు కారణమవుతోంది. కేంద్ర హోంశాఖ పార్లమెంట్‌కు ఇచ్చిన జవాబు ప్రకారమే 2018–20 మధ్య 4390 మంది యుఏపిఏ క్రింద అరెస్టు కాగా వారిలో 2500 మంది 30 ఏళ్ల లోపు వయసున్నవారే. అమెరికాలో 9/11 తర్వాత మానవ హక్కుల విషయంలో ఉగ్రవాదులకూ, సామాన్యులకూ మధ్య తేడా చూడాల్సిన అవసరం ఉన్నదని అనేక దేశాలు ప్రపంచ వ్యాప్తంగా భావించాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ ఆలోచనను జీర్ణించుకుంది. అయితే ప్రతీ ప్రజాస్వామిక నిరసననూ ఉగ్రవాదంగా భావించే పరిస్థితి లేకుండా ఉండాలంటే, రచయితలను, మేధావులను, జర్నలిస్టులను కూడా ఉగ్రవాదులుగా భావించకుండా ఉండాలంటే ప్రభుత్వ ఆలోచనా విధానానికి అతీతంగా, ప్రాసిక్యూషన్ వాదనలకు భిన్నంగా న్యాయవ్యవస్థ వ్యవహరించవలిసి ఉంటుంది.


ఈ నేపథ్యంలో ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెయర్‌ల మధ్య ఒక తొలి అంతర్జాతీయ అంతర్జాల చర్చా గోష్టికి ప్రాధాన్యత ఉన్నది. జీవించే హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించే విషయంలో మన కంటే అమెరికా న్యాయవ్యవస్థ ఎంతో ముందంజలో ఉన్నదనడంలో సందేహం లేదు. జాతి వివక్షా పరిస్థితులను అమెరికా న్యాయవ్యవస్థ ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నది. క్రిమినల్ జస్టిస్ విషయంలో మన న్యాయవ్యవస్థ ఏ మాత్రం అమెరికా న్యాయవ్యవస్థతో సరితూగదు. నిజానికి రాజ్యాంగ ముసాయిదా రూపొందించేటప్పుడు మనం అమెరికా రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, అక్కడ న్యాయవ్యవస్థకు ఉన్న రాజ్యాంగపరమైన ఆధిక్యతను పరిగణనలోకి తీసుకున్నాం. మానవ హక్కుల విషయంలో అమెరికా రాజ్యాంగ ప్రభావం మన దేశంపై ఎంతో ఎక్కువ. అక్కడి న్యాయవ్యవస్థ తీరుతెన్నులను కూడా మనం అనుసరించాము. చట్టం ముందు అందరూ సమానులేనన్న మన దృక్పథం కూడా అమెరికా, బ్రిటన్‌ల నుంచి వచ్చిందే. అమెరికా రాజ్యాంగాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, అయితే దాన్ని మన సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనానికి అనుగుణంగా అవసరమైన మార్పులతో అనుసరించడం మంచిదని రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రధానంగా మన ప్రాథమిక హక్కుల్లోని అధికరణలు 14, 19, 21లను చేర్చడంపై ఇతర దేశాలపై ఆధారపడ్డాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19లను విశ్లేషించేటప్పుడు మన న్యాయమూర్తులు అమెరికా న్యాయమూర్తుల తీర్పులను ఉటంకించిన సందర్భాలున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం నుంచి వేతనాల చెల్లింపు వరకు మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను అమెరికా తీర్పులు ప్రభావితం చేశాయనడంలో సందేహం లేదు.


అయినప్పటికీ అమెరికా న్యాయవ్యవస్థలో లోపాలు లేవనలేము. 1967లో తొలి ఆఫ్రికన్ –అమెరికన్ జస్టిస్ మార్షల్ అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినప్పటికీ న్యాయవ్యవస్థలో అందరికీ సమాన అవకాశాలు ఇంకా రావల్సి ఉన్నదని జస్టిస్ బ్రెయర్ అభిప్రాయపడ్డారు. జీవించినంతకాలం న్యాయమూర్తిగా కొనసాగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో 83 ఏళ్ల జస్టిస్ బ్రెయర్ తనంతట తాను స్వచ్ఛందంగా పదవీవిరమణ చేసేందుకు అంగీకరించడంతో అమెరికా సుప్రీంకోర్టులో తొలి నల్లజాతి మహిళను న్యాయమూర్తిగా నియమించేందుకు ఇటీవలే అవకాశం కలిగింది. అదే సమయంలో భారతదేశంలో కూడా సుప్రీంకోర్టులో నలుగురు మహిళా మహిళా న్యాయమూర్తులకు అవకాశం లభించడమనే చరిత్రాత్మక పరిణామం జస్టిస్ రమణ హయాంలో జరగడం గమనార్హం. మన దేశంలోని భౌగోళిక, సామాజిక వైవిధ్యం మన న్యాయవ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉన్నదని కూడా జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు.


స్వల్పకాలంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉంటానని తెలిసినప్పటికీ కీలకమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు పోస్టు కార్డుపై వచ్చినా స్వీకరించడం, మానవ హక్కుల విషయంలో స్పందించడం, శిథిలాలయాలుగా ఉన్న కోర్టులను ఆధునికీకరించడం, ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కళ్లెం వేయడం, రాజకీయాల్లో నేరచరితులను ఏరివేయడం, మహిళలతో సహా వివిధ సామాజిక వర్గాల వారికి న్యాయవ్యవస్థలో భాగస్వామ్యం కల్పించడం మొదలైన కీలక ప్రయత్నాలను జస్టిస్ రమణ చేశారనడంలో సందేహం లేదు. అయితే అమెరికన్ న్యాయవ్యవస్థ ప్రమాణాలను అందుకోవడానికి ఆయన లాంటి అనేక మంది ప్రధాన న్యాయమూర్తులు మన న్యాయవ్యవస్థకు తప్పక అవసరం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-04-20T06:23:55+05:30 IST