ఆరోగ్య సిబ్బందికి రక్షణేదీ?

ABN , First Publish Date - 2021-05-22T04:00:06+05:30 IST

ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తున్నట్లు ఉంది ప్రస్తుతం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పరిస్థితి. కరోనా పరీక్షలు చేయడం నుంచి వ్యాధి నిర్థారణ, బాధితుల తరలింపు, వారికి చికిత్స అందించడం వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం రక్షణ కరువవుతోంది. వీరికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కులు

ఆరోగ్య సిబ్బందికి రక్షణేదీ?
పీపీఈ కిట్‌ వేసుకోకుండా స్వాబ్‌ సేకరిస్తున్న వైద్య సిబ్బంది...




పీపీఈ కిట్లు లేకుండానే కరోనా పరీక్షలు

 సరఫరాకాని మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు  

 సొంత నగదుతో కొనుగోలు

 ప్రశ్నించలేని స్థితిలో వైద్య సంఘ నాయకులు

 (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి) 

ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తున్నట్లు ఉంది ప్రస్తుతం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పరిస్థితి. కరోనా పరీక్షలు చేయడం నుంచి వ్యాధి నిర్థారణ, బాధితుల తరలింపు, వారికి చికిత్స అందించడం వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం రక్షణ కరువవుతోంది. వీరికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు తగినన్ని సరఫరా కావడం లేదు. దీంతో చాలామంది సిబ్బంది సొంత డబ్బులతో వాటిని కొనుగోలు చేసుకొని వినియోగిస్తున్నారు. అధికారిక లెక్కల్లో మాత్రం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఈ విషయంలో వైద్య సిబ్బంది అసంతృప్తితో ఉన్నా, ఎవరూ బయటకు చెప్పడం లేదు. కనీసం సంఘ నాయకులు కూడా ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. 


అరకొర సరఫరా..

జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులు, హెచ్‌వీలు, ఎంపీహెచ్‌వోలు, ల్యాబ్‌టెక్నీషియన్లు, వైద్యాధికారులు, ఆశవర్కర్లు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. వీరి అవసరాల మేరకు తగినన్ని రక్షణ కవచాలు సరఫరా కావడం లేదు. ఒక ఆరోగ్య కేంద్రం పరిధిలో 50 మంది సిబ్బంది ఉంటే సగం మందికే మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, గ్లౌజులు అందుతున్నాయి. మిగతా వారంతా సొంతడబ్బుతో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. కొందరు సిబ్బంది పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు ధరించకుండా శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఇది ప్రమాదమని తెలిసినా తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


శిక్షణ పొందని వారితో...

మరికొన్నిచోట్ల వైద్యసిబ్బంది కరోనా పరీక్షలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కాకుండా బయటి వ్యక్తులు, ఎటువంటి శిక్షణ లేనివారితోను, కింది స్థాయి సిబ్బందితోనూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. వారే శ్వాబ్‌ సేకరిస్తున్నారు. దీంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


తప్పని అవస్థలు

గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, ఇతరత్రా సామగ్రిని లోకల్‌ పర్చేజ్‌ పేరుతో తహసీల్దారులు కొనుగోలు చేసి డీఆర్వోకు బిల్లులు సమర్పించారు. అప్పట్లో వీటి కొనుగోలులో పెద్దఎత్తున అక్రమాలు సాగాయని ఆరోపణలు వచ్చాయి. అయినా వైద్య సిబ్బందికి మాత్రం సరిపడా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వమే అమరావతిలో వీటిని కొనుగోలు చేసి వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. అయితే, కలెక్టర్ల ఇండెంట్‌ ప్రకారం మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు కేటాయించక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. వచ్చిన అరకొర నిల్వలనే పీహెచ్‌సీలకు సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు అవసరమైన రక్షణ కవచాలు అందుబాటులో ఉంచాలని  వైద్యసిబ్బంది కోరుతున్నారు.


 పీపీఈ కిట్లు అందిస్తున్నాం

 క్షేత్రస్థాయిలో కొవిడ్‌ నమూనాలు సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. ‘నమూనాలు అధికంగా సేకరించి తక్షణం ల్యాబ్‌లకు పంపించాలి. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులతో మాట్లాడి ఆ వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కోటబొమ్మాళి, రెంటికోట, తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులను సందర్శించినట్లు తప్పుడు నివేదికలు ఉన్నాయి. దీనిపై వైద్యాధికారులు చర్యలు చేపట్టాలి. గ్రామస్థాయిలో ఏర్పాటైన కొవిడ్‌ యాజమాన్య కమిటీలు సమావేశాలు కావాలి. శాంపిల్స్‌ సేకరణ, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను ఉపాధి హామీ పనులకు రాకుండా చూడడం,  పారిశుధ్య పనులు చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామాలను కొవిడ్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి’ అని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జేసీ కె.శ్రీనివాసులు, ఆర్డీవోలు పాల్గొన్నారు. 




Updated Date - 2021-05-22T04:00:06+05:30 IST