ఓఅండ్‌ఎంకు మోక్షమేదీ?

ABN , First Publish Date - 2022-06-25T05:56:01+05:30 IST

వానాకాలం సాగు సీజన ముంచుకొస్తున్నా మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వల ప్రధాన గేట్లు, డిసి్ట్రబ్యూటరీల తూముల నిర్వహణ

ఓఅండ్‌ఎంకు మోక్షమేదీ?

అధ్వానంగా వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువల నిర్వహణ

ఈ సారైనా మరమతులకు టెండర్లు జరిగేనా

వైరా, జూన 24: వానాకాలం సాగు సీజన ముంచుకొస్తున్నా మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వల ప్రధాన గేట్లు, డిసి్ట్రబ్యూటరీల తూముల నిర్వహణ ప్రహసనంగా మారింది. మరమ్మతు పనులు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అనే రీతిలో ఉంది. మరో 20రోజుల్లో వీటి మరమ్మతులు చేయకపోతే ఆయకట్టులో వానాకాలం పంటలకు సక్రమంగా నీటి సరఫరా అగమ్యగోచరంగా మారే ప్రమాదముంది. కాల్వల నిర్వహణ, నీటి సరఫరాకు సంబంధించి నిర్వహణ-మరమ్మతుల(ఓఅండ్‌ఎం) కింద మరమ్మతుల కోసం రూ.80లక్షలతో గత నెలలో పిలిచిన టెండర్లకు ఏఒక్క కాంట్రాక్టర్‌ నుంచి స్పందన రాలేదని సమాచారం. ఫలితంగా మొదటిసారి టెండర్ల నోటిఫికేషనను రద్దుచేసిన నీటిపారుదలశాఖ అధికారులు కొత్తగా రెండోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకొచ్చి టెండర్లు వేస్తారా లేదా అనేది మిలియనడాలర్ల ప్రశ్నగా ఉంది. ఓఅండ్‌ఎం కింద నిధులు లేకపోయినా మళ్లీ అధికారులు నిధులు మంజూరు చేసి టెండర్లు ఆహ్వానించి పనులు చేయించినా సకాలంలో నిధులు వస్తాయోలేవోనని ఆందోళన, అనుమానాలు కాంట్రాక్టర్లలో ఉన్నాయి. అందుకు ఏ ఒక్కరూ టెండర్ల దాఖలుకు ముందుకు రావడం లేదని సమాచారం. వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వల ప్రధాన గేట్లు శిథిలావస్థలో ఉన్నాయనే విషయాన్ని కొంతకాలం కిందట ‘ఆంధ్రజ్యోతి’ కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు ఓఅండ్‌ఎం కింద ప్రధాన గేట్లకు మరమ్మతులు చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. కుడికాల్వ ప్రధాన హెడ్‌స్లూయిక్‌కు సంబంధించిన మూడు గేట్ల మరమ్మతులకు రూ.31లక్షలు, ఎడమకాల్వ ప్రధాన రెండు గేట్ల మరమ్మతులకు రూ.21లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. అయితే ఈ టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇకపోతే కుడికాల్వ పరిధిలోని పలు డిసి్ట్రబ్యూటరీలకు చెందిన తూముల మరమ్మతుల కోసం రూ.15లక్షలు, ఎడమకాల్వ పరిధిలో శిథిలావస్థలో ఉన్న పలు డిసి్ట్రబ్యూటరీల తూముల మరమ్మతులకు రూ.13లక్షలతో టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదని సమాచారం. ఈనెలాఖరుకు రెండోసారైనా కాంట్రాక్టర్లు ముందుకొచ్చి టెండర్లు వేస్తారా లేదా అన్నది అనుమానంగా ఉంది. ఒకవేళ టెండర్ల ప్రక్రియ పూర్తయినా వెంటనే ఒప్పదం చేసుకొని సకాలంలో పనులు చేపట్టాల్సి ఉంది. 

కీలకంగా మారిన ప్రధాన హెడ్‌స్లూయిస్‌ల మరమ్మతులు

పూర్తిస్థాయిలో వానలు పడకముందే కుడి, ఎడమకాల్వల ప్రధాన గేట్ల మరమ్మతులు పూర్తిచేయాల్సి ఉంది. రిజర్వాయర్‌ లోతట్టులో భారీస్థాయిలో రింగ్‌బండ్‌ నిర్మించి ప్రధాన గేట్లకు నీళ్లు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రధాన గేట్ల మెటీరియల్‌ను హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 15అడుగుల నీటిమట్టం ఉండగా.. వర్షాలు సమృద్ధిగాపడి పూర్తిస్థాయి నీటిమట్టం 18.3అడుగులకు చేరితే ఈ ప్రధాన గేట్ల మరమ్మతులు చేసే అవకాశం లేకుండాపోయింది. అదే జరిగితే ఈ సీజనలో కాల్వలకు నీటి సరఫరా నిలిపివేత సమయంలో గేట్లు మొరాయించి సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అందువలన అధికారులు టెండర్లు ఆహ్వానించటం, కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ప్రత్యేక దృష్టిసారించి సకాలంలో మరమ్మతులు పూర్తిచేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

డీఈ శ్రీనివాస్‌ ఏమన్నారంటే..

ఈ విషయమై నీటిపారుదలశాఖ వైరా డీఈ పి.శ్రీనివాస్‌ను సంప్రదించగా ప్రధాన గేట్లు, డిసి్ట్రబ్యూటరీల తూముల మరమ్మతుల కోసం రూ.80లక్షలతో టెండర్లు ఆహ్వానించామని, టెండర్ల ప్రక్రియ పూర్తవగానే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-06-25T05:56:01+05:30 IST