ఆసరా అందేనా?

Published: Sun, 27 Mar 2022 23:58:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆసరా అందేనా? మెదక్‌లో పెన్షన్‌ తీసుకుంటున్న వృద్ధులు

పింఛన్ల కోసం వృద్ధుల ఎదురుచూపు

మెదక్‌ జిల్లాలో కొత్తగా 24,941 దరఖాస్తులు 

57 ఏళ్లు నిండిన వారు 16,850 మంది 


 ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, మార్చి 27 : మెదక్‌ జిల్లాలో ఆసరా కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా ఎదురుచూపులే తప్ప పింఛన్లు రావడం లేదు. 57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే జిల్లాలో కొత్తగా 24,941 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 57 ఏళ్లు నిండినవారు 16,850 మంది, దివ్యాంగులు, ఒంటరి మహిళలు 8,091 మంది దరఖాస్తుచేసుకున్నారు. 2018 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్ల వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని సీఎం కేసీఆర్‌ హామీఇచ్చారు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరనున్నది. 

జిల్లాలో 1.1లక్షల మందికి ఆసరా పింఛన్లు

వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.2,016లను పింఛన్‌ కింద అందిస్తున్నది. ఎలాంటి ఆదరణ లేని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఈ పింఛన్‌ ఆసరాగా నిలుస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,65,423 మంది ఉన్నారు. ఇందులో 1,01,565 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా మరో 24,941 దరఖాస్తులు రావడంతో వచ్చేనెల నుంచి కొత్త పింఛన్లు మంజూరుచేస్తే జిల్లాలో పింఛన్ల సంఖ్య 1,26,514కు చేరనున్నది. ప్రస్తుతం ప్రతినెల రూ.22.44 కోట్లను పింఛన్ల కింద లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తున్నది. కొత్త పింఛన్లకు మరో రూ.6 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. 

అందిస్తున్న పింఛన్ల వివరాలు

వృద్ధాప్య పింఛన్లు 29,432 మందికి, వితంతు 43,345 మందికి, దివ్యాంగులకు 8,622 మందికి అందిస్తున్నారు. అలాగే గీత కార్మికులు 855 మందికి, చేనేత కార్మికులు 495 మందికి, బీడీ కార్మికులు 14,159 మందికి అందించగా వీటితో పాటు బోధకాలు బాధితులు 478 మందికి, ఒంటరి మహిళలు 4,179 మందికి అందించడంతో జిల్లాలో మొత్తం పింఛన్లు పొందుతున్నవారి సంఖ్య 1,01,565గా ఉన్నది. 

ఈ సారైనా?

ఏప్రిల్‌ సమీపిస్తుండడంతో కొత్త పింఛన్లు కచ్చితంగా వస్తాయన్న ఆనందం కొత్త దరఖాస్తుదారుల్లో కనిపిస్తున్నది. మరికొందరిలో వచ్చేనెల నుంచి పింఛన్లు ఇస్తారో.. లేదో అన్న ఆందోళన కూడా కనిపిస్తున్నది. వచ్చేనెల నుంచి పింఛన్లు అందితే తమకు కొండంత ఆసరా అవుతుందని వృద్ధులు, వికలాంగులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు వేస్తూ ఆలస్యం చేస్తే అర్హులైన వేలాదిమందికి ఆసరా లేకుండాపోతుందని వాపోతున్నారు. 

ప్రభుత్వ ఆమోదమే ఆలస్యం 

- శ్రీనివాస్‌, డీఆర్డీవో, మెదక్‌

ఆసరా పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల వెరిఫికేషన్‌ పూర్తిచేశాం. పింఛన్లకు అర్హుల జాబితా అంతా సిద్ధం చేశాం. రాష్ట్రస్థాయిలో ఆమోదం తెలుపడమే ఆలస్యం. ఆసరా పోర్టల్‌లో వివరాలను నమోదు చేశాం. ప్రభుత్వం బడ్జెట్‌కు ఆమోదం తెలిపితే పింఛన్లు వస్తాయి. 

నెలలు గడుస్తున్నా పింఛన్‌ రాలేదు  

-మాచారం మాణయ్య, అల్లాదుర్గం 

57 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నాను. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పింఛన్‌ రాలేదు. గతంలో కూడా ఆసరా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కాని మంజూరు కాలేదు. ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కనీసం ఈ సారైనా మంజూరు చేయాలని కోరుతున్నాను. 

60 ఏళ్లు దాటినా పింఛన్‌ మంజూరు కాలేదు

- బసన్నగారి నర్సింహులు, అల్లాదుర్గం 

నాకు 60 ఏళ్లు దాటాయి. కానీ పింఛన్‌ మాత్రం మంజూరు కాలేదు. ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని చెబుతున్నది. నేను చాలాసార్లు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నాకైతే ఇప్పటివరకు రాలేదు. పింఛన్‌ తీసుకోవడానికి నాకు అన్నిరకాల అర్హతలు ఉన్నాయి. నిజాయితీగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆసరా పింఛన్లు రావడం లేదు. పైరవీకారులకు మాత్రం ఇస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.