ఇదేం వివక్ష?

ABN , First Publish Date - 2021-11-28T07:08:35+05:30 IST

వ్యవసాయ శాఖ నిర్ణయాలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. రబీ సీజన్‌లో పంట సాగు చేపట్టి నాలుగు రాళ్లు కళ్లజూద్దామనుకున్నా, అధికారుల నిర్ణయాలు అన్నదాతల గొంతులో వెలక్కాయలా మారుతున్నాయి. ఇందుకు రాయలసీమ పరిధిలోని మూడు జిల్లాలకు వందల టన్నుల సబ్సిడీ వరి విత్తనాలు కేటాయించి, చిత్తూరుకు మాత్రమే అరకొరగా కేటాయించడం విమర్శలు దారితీస్తోంది.

ఇదేం వివక్ష?
ఏపీసీడ్స్‌లో నిల్వ ఉన్న వరి విత్తన బస్తాలు

పక్క జిల్లాలతో పోలిస్తే అరకొర వరి విత్తనాల సరఫరా 


శ్రీకాళహస్తి, నవంబరు 27: వ్యవసాయ శాఖ నిర్ణయాలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. రబీ సీజన్‌లో పంట సాగు చేపట్టి నాలుగు రాళ్లు కళ్లజూద్దామనుకున్నా, అధికారుల నిర్ణయాలు అన్నదాతల గొంతులో వెలక్కాయలా మారుతున్నాయి. ఇందుకు రాయలసీమ పరిధిలోని మూడు జిల్లాలకు వందల టన్నుల సబ్సిడీ వరి విత్తనాలు కేటాయించి, చిత్తూరుకు మాత్రమే అరకొరగా కేటాయించడం విమర్శలు దారితీస్తోంది.  రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో పెద్దఎత్తున వరి పంట దెబ్బతింది. దీంతో అన్నదాతలను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో వరి విత్తనాలు అందజేయాలని నిర్ణయించింది.అలాగే ఉలవలు,పచ్చి పెసలు,నల్ల పెసలు,ముడి శనగ,కొర్రల విత్తనాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా మూడురోజుల కిందట కడప జిల్లాకు 55420 క్వింటాళ్ల వరి విత్తనాలు, నెల్లూరుకు 10770 క్వింటాళ్లు, అనంతపురానికి 17.091క్వింటాళ్లు,ప్రకాశం జిల్లాకు 5574 క్వింటాళ్లు,కర్నూలుకు 25637క్వింటాళ్లు కేటాయించారు. అయితే తొలుత చిత్తూరు జిల్లాకు 20 క్వింటాళ్ల వరి విత్తనాలు కేటాయించిన అధికారులు, శుక్రవారం సాయంత్రానికి ఆ పరిమితిని 148క్వింటాళ్లకు పెంచారు.ప్రభుత్వ నిర్ణయంతో అన్ని జిల్లాల రైతులకు ఏపీసీడ్స్‌ ఆధ్వర్యంలో వరి విత్తనాల పంపిణీ జరుగుతోంది. కాగా, శ్రీకాళహస్తిలోని ఏపీసీడ్స్‌ గోడౌన్లలో 30వేల టన్నుల విత్తన నిల్వలున్నాయి. దీంతో పొరుగు జిల్లాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తుండగా,ఈ నాలుగు రోజుల్లో నెల్లూరు జిల్లాకు 33లారీల్లో తరలించారు.అయితే జిల్లాకు 14.8టన్నులు మాత్రమే కేటాయింపు జరగడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏళ్లుగా సబ్సిడీకి దూరమైన జిల్లా రైతులు, విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అరకొర సబ్సిడీ ఇవ్వడాన్ని విమర్శిస్తున్నారు. 

Updated Date - 2021-11-28T07:08:35+05:30 IST