ఇదేం ‘వృద్ధి’? ఎవరి ‘వృద్ధి’?

ABN , First Publish Date - 2021-02-15T05:58:31+05:30 IST

కొలకలూరి ఇనాక్‌ కథ ‘వృద్ధి’ మీద జాన్‌సన్‌ చోరగుడి వ్యాసం ‘వినవలసిన పాట, చదివేది కాదు!’ చదివాం. వినవలసిన పాట కూడా విన్నాం. అది ఏమీ ఇంపుగా, సొంపుగా, సొగసుగా లేదు...

ఇదేం ‘వృద్ధి’? ఎవరి ‘వృద్ధి’?

కొలకలూరి ఇనాక్‌ కథ ‘వృద్ధి’ మీద జాన్‌సన్‌ చోరగుడి వ్యాసం ‘వినవలసిన పాట, చదివేది కాదు!’ చదివాం. వినవలసిన పాట కూడా విన్నాం. అది ఏమీ ఇంపుగా, సొంపుగా, సొగసుగా లేదు. తిరుగుబోతులైన ఇద్దరు తల్లీకూతుళ్ళ గురించి దళిత రచయిత రాసిన కథ. బొత్తిగా అవాస్తవికమైన కథ. 


ఇద్దరు దళిత స్త్రీలు. లింగి, ఆమె కూతురు సౌందర్య. లింగికి పదమూడో ఏట పెళ్ళయింది. పద్నాలుగో ఏటికే భర్త పోయాడు. అప్పటికి సౌందర్య కడుపులోపడింది. భర్తపోయిన మూణ్ణెల్లకు కూతురు పుట్టింది. ఇది లింగి జీవితం. కూతురు సౌందర్య జమాల్సుగాడ్ని ఇష్టపడి పెళ్ళి చేసు కుంది. వాడు పెళ్ళయిన రెండో రోజే పోతున్న రైలులో అందరూ చూస్తుండగా ఎక్కబోతూ చక్రాల కిందపడి మరణించాడు. ఇది సౌందర్య జీవితం. తల్లికి 30, కూతురికి 15ఏళ్ళు. ఇద్దరూ విధవరాండ్రు. 


‘‘ఏమీ పని చేయకుండా పల్లెలో, పాకల్లో ఒంటి నిట్టాడి ఇళ్ళలో నిద్రపోయే జనంలో ముసలీ ముతకను తీసేయగా కొద్దిమంది ఆడవాళ్ళు కనిపిస్తారు’’ అన్నది ఒక వర్ణన. పల్లెలో పాకల్లో, ఒంటినిట్టాడి పూరిళ్ళలో వుండే పేదలు ఏమీ పని చేయకుండా నిద్రపోతుంటారట! వాళ్ళే కాదు, ఈ తల్లీకూతురు కూడా! ‘‘ఇద్దరూ ఏం పనీ చేయరు. కడుపునిండా తింటారు. కంటినిండా నిద్రపోతారు. నిద్రపట్టకపోతే గుంటూరు పోతారు. సినిమాలు చూసి వస్తారు.’’ ఇదీ వాళ్ళ జీవితం. 


పల్లెలో పాకల్లో వుండే స్త్రీలు ఏ పనీ చేయ కుండా తినడం, నిద్రపోవడం వంటి వాటితోనే కాలం జరుపుతారా? నిజానికి ఇవ్వాళ పల్లెల్లో పాకలు లేవూ, పూరిళ్ళు లేవు. సర్కారు వారు దయతో ఓట్లకోసమో, సీట్లకోసమో, నోట్లకోసమో ఒంటిగదితోనో, రెండుగదులతోనో కట్టిన పక్కా ఇళ్ళు, లేకుంటే కాయకష్టంతో కట్టుకున్న పిచికంత డాబాలో, రేకుల షెడ్లో మాత్రమే కనపడతాయి. పూరిళ్ళూ, పాకలూ అంటే తాటాకో, జమ్ములాంటివో కావాలి. అవి దొరకవు, దొరికినా కప్పేవాళ్ళు లేరు. వాళ్ళు వున్నా కూలి అందుబాటులో ఉండదు. 


పైగా తల్లీ, కూతురు ఎందుకు పని చేయ రంటే... రచయిత మాటల్లో: ‘‘విధవరాండ్రకు వచ్చే పెన్షన్‌ తల్లికీ కూతురికీ వస్తూ ఉంది. వెయ్యి రెండువేలు అయ్యేసరికి లింగి కూరగాయలమ్మే గంప మూలన పారేసింది. నెలకి నాలుగువేలు ఏం పనీ చేయకుండా వస్తుంటే ఇద్దరికీ ఆనం దమే! కేజీ రెండు రూపాయల బియ్యం పది కేజీలు వస్తే వాళ్ళకు నెలకు సరిపడా బియ్యం గింజలు ఇంటిలో ఉంటున్నాయి. చక్కెర, కంది పప్పు, చింతపండు సరుకులన్నీ చౌక ధరకు లభిస్తుంటే నెలకు ఒక్క వెయ్యిరూపాయలతో కాలం గడుస్తూ ఉంది.’’ 


గ్రామాల్లో మోతుబరి రైతులూ, సోమరులూ అరుగుల మీద కూర్చుని మాట్లాడే మాటలు ఇలాంటివి! నెలకి రెండు వేలు వస్తే అవే సరిపో తాయా? పెన్షన్‌ వచ్చేవాళ్ళు పని చేయడం లేదా? ఆ పెన్షన్‌తోనే జీవితం తెల్లారిపోతుందా? నిజానికి అవి ఏ అవసరానికీ, ఏ మూలకీ చాలవనే విషయం అందరికీ తెలుసు. పెన్షన్‌ వచ్చేవాళ్ళు పల్లెలో ఎవరూ వూరికే కూర్చోరు. ఎంత ముసలి దళిత స్త్రీలయినా పదోపరకో పనికి వెళ్ళి తెచ్చుకోవా లనే చూస్తారు. 


వీళ్ళిద్దరూ సోమరులే కాదు, తిరుగుబోతులు కూడా! రచయిత మాటల్లో: ‘‘ఎప్పుడన్నా ఎవడన్నా మరీ వెంటబడుతుంటే బిచ్చగాడికి ఇంత బిచ్చం వేసినట్లు, ఊ కొట్టి వాడి కక్కుర్తి తీర్చి వీళ్ళ కుతి తీర్చుకునే వాళ్ళు. వాళ్ళిద్దరికీ వాళ్ళ జాగ్ర త్తలు తెలిసివచ్చాయి. కడుపో, కాలో రాకుండా ఉండాలంటే ఏం చేయాలో వాళ్ళకు అర్థమ యింది. ...రోగం రొచ్చూ వస్తాయన్న భయం వాళ్ళకు లేదు. తగిన ఏర్పాట్లు చేసుకోవటంలో ఆరితేరిపోయారు. ...అప్పుడప్పుడు ఆ మగాడు మేలు, ఈ మగాడు కీడు అని గుర్తించటం వల్ల మేలయిన మగాణ్ణి ఎన్నుకోవడంలో వాళ్ళు చాకచక్యంగా ప్రవర్తించేవాళ్ళు. పెళ్ళయితే ఒక్క మొగుడితోనే సంసారం. మొగుడు తుక్కోడయినా, దూగరోడయినా చచ్చినట్లు సంసారం చేయాలి. వీళ్ళకున్న వెసులుబాటు సంసారస్త్రీలకు లేదు.’’ -దళిత స్త్రీల ‘వృద్ధి’ ఇదీ రచయిత దృష్టిలో!


ఈ కథలోనే చింతయ్య తాత అనే ముసలి పాత్ర ఉంటుంది. ఆ తాత వీళ్ళని పెళ్ళి చేసుకోం డని పోరుతుంటాడు. తాత మాటలు చూడండి: ‘‘పిల్లల్ని కనకపోతే ఆడమనిషి జీవించడం దుబారా! నువ్వు పనిచేసే శక్తివి మాత్రమే కాదు, పిల్లల్ని ఉత్పత్తి చేసే ప్రాణయంత్రానివి కూడా. కృషి లేక, ఉత్పత్తీ లేక బ్రతికేమీ? చచ్చేమీ?’’ - ఇవీ తాత డైలాగులు!


తల్లీ, కూతురు నిరుపేద దళిత స్త్రీలు అనే విషయం సుస్పష్టం. ఆ పేదల దయనీయ జీవిత చిత్రణ కానీ, వాస్తవికత కానీ, సహజత్వం కానీ మచ్చుకి కూడా లేని కథ. అంతా కృత్రిమత్వం, అసహజత్వం. వాస్తవానికి దూరమైన కల్పన. 


దళితుల చైతన్యాన్నీ, శ్రమసంస్కృతినీ, ఆత్మాభి మానాన్నీ, ఆత్మగౌరవాన్నీ అవమానించే కథ ‘వృద్ధి’. ఇది ‘వృద్ధి’ కాదు. వృద్ధికి నూటికి నూరు శాతం వ్యతిరేకం. ‘‘పల్లెల జీవన శైలిలో వచ్చిన మార్పుల్ని నిస్సంకోచంగా బయటపెట్టిన కథ’’! కథ ముందుమాటలో ఒక సంపాదకుని మాట ఇది. ఏ పల్లెలోనైనా ఇలాంటి మార్పులు వచ్చాయా? ఏం మార్పులు ఇవీ? పని చేయని సోమరి తనమా? తిరుగుబోతుతనమా? ‘కథ 2019’ సంపాదకుల దృష్టిలో ఇది ఉత్తమ కథ. ఇందులో ఉత్తమం ఏమిటో వాళ్ళకే తెలియాలి మరి!

మొలకలపల్లి కోటేశ్వరరావు

9989 224280


Updated Date - 2021-02-15T05:58:31+05:30 IST