ఈ రాష్ట్రం జగన్‌ జాగీరా?

ABN , First Publish Date - 2021-10-21T06:17:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక, విధ్వంసపాలన హద్దులు దాటి ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది. జగన్ పాలనలో చట్టాలు, లా-అండ్ ఆర్డర్ పూర్తిగా విఫల మయ్యాయి....

ఈ రాష్ట్రం జగన్‌ జాగీరా?

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక, విధ్వంసపాలన హద్దులు దాటి ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది. జగన్ పాలనలో చట్టాలు, లా-అండ్ ఆర్డర్ పూర్తిగా విఫల మయ్యాయి. ‘నేను చేసిందే చట్టం, నేను చేసిందే ప్రజాస్వామ్యం’ అన్న రీతిలో  ఆయన  నిరంకుశంగా ఉన్మాదపాలన సాగిస్తున్నారు. అధికారంలో  ఉన్నాం ఏదైనా చేయవచ్చని వైసిపి నాయకులు అనుకుంటున్నారు. సొంత ఎజెండాతో రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేశారు. మీడియా అయినా, ప్రతిపక్షాలయినా, ప్రజలయినా తమ వెనక నడవాల్సిందేనని, తమకు నచ్చిన విధంగా వ్యవహరించకపోయినా, తమను విమర్శించినా సహించేది లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏ రాచరికంలోనూ, ఏ నియంత పాలనలోనూ కనిపించని దౌర్జన్యకాండ  ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నవారు 21వ శతాబ్దంలో ఉన్నామా? లేక ఆటవిక, అరాచక, కిరాతక పాలనలో ఉన్నామా అని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.


జగన్ పాలన నవ్యాంధ్రను నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది. పోలీసుల వత్తాసుతో వైసిపి మూకలు, నాయకులు విచ్చలవిడి తనంతో వ్యవహరిస్తున్నారు. విచక్షణాజ్ఞానం కోల్పోవడం రెండు సందర్భాల్లో మాత్రమే జరుగుతుంటుంది. ఒకటి- ఎదుటి వారిని ఏదోవిధంగా దెబ్బతీసి తాము ప్రయోజనం పొందాలనుకొన్నప్పుడు;  రెండు-  పాలనలో విఫలమైన పాలకులు ఆత్మరక్షణలో పడినప్పుడు.   ఇటువంటి పరిస్థితుల్లోనే పాలకులకు వినాశకర ఆలోచనలు  వస్తాయి. జగన్ ప్రభుత్వం, పోలీసులు కలసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు, నాయకులకు కార్యకర్తలకు రక్షణ లేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన విధ్వంసకాండ జగన్ అరాచక పాలనకు పరాకాష్ఠ. టిడిపి కార్యాలయాల పైనే దాడి చేస్తే తమను ఎవరూ ప్రశ్నించజాలరన్న అహంభావంతోనే ఇంత నీచానికి దిగజారారు.  ప్రభుత్వం పోలీసులతో కుమ్మక్కయి శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది. ఇటువంటి దుష్పరిణామాన్ని దేశంలో ఎన్నడూ చూడలేదు. మొత్తం పోలీసు వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు. ఏపీలో వైసిపి సాగిస్తున్న అరాచక పాలనపై తక్షణమే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.


ఆంధ్రప్రదేశ్‌ను గూండారాజ్‌గా మార్చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం. రాష్ట్రప్రభుత్వమే ఈ వైఫల్యానికి పూనుకొన్నది కనుక ఆర్టికల్ 356 వినియోగం మినహా మరో మార్గం లేదు. ముందస్తు పథకం ప్రకారమే పోలీసులు, ప్రభుత్వం, వైసిపి నాయకులు  కుమ్మక్కయి ఈ విధ్వంసకాండకు దిగారు. రాష్ట్రంలో మంగళగిరి, విశాఖ, హిందూపూర్, నెల్లూరు, రేణిగుంట, కర్నూల్ మొదలైన నగరాలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసిపి ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. కార్యాలయాల అద్దాలను, ఫర్నిచర్ను, 15 కార్లను, ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉద్యోగులపైన కర్రలతో, సుత్తులతో దాడి చేసి సిబ్బందిని గాయపరిచారు. సుత్తితో ఒక వ్యక్తి తల పగలగొట్టడం కన్నా సైకో చర్యలు ఏముంటాయి? సమస్యలపై పోరాటం చేయడానికి, పార్టీ కార్యక్రమాలకు ముఖ్య వేదిక కేంద్ర కార్యాలయం. లక్షలాది కార్యకర్తలకు, నాయకులకు దేవాలయం వంటి కార్యాలయం‍పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం. రాక్షసులే నయం అనుకొనే విధంగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఏపీలో ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలకు రక్షణ లేదు. ప్రజా సమస్యలపై, ప్రజల ఆస్తులు విక్రయించడంపై ప్రశ్నించడం నేరమా? రాష్ట్రంలో యువతను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలు హెరాయిన్, గంజాయి సరఫరాపై నిలదీయడం తప్పా? ఇసుక, గనులు, మద్యం, మాఫియా ఆగడాలపై ప్రశ్నించడం అనుచితమా? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, దివాళా తీయిస్తే ప్రశ్నించడం నేరమా? ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులు చేస్తారా? వారి ఇష్టానుసారం చేయడానికి రాష్ట్రం వారి జాగీరు కాదు కదా?


తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి   పట్టాభి ఇంటిపై ఇప్పటికి మూడుసార్లు దాడి చేశారు. 2019 అక్టోబర్ 21న; 2021 ఫిబ్రవరి 2న,  2021 అక్టోబర్ 19న ఈ దాడులు జరిగాయి. మంగళవారం నాటి దాడిలో పట్టాభి ఇంటిని దారుణంగా ధ్వంసం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటిపై  2021 సెప్టెంబర్ 18న సాక్షాత్తు వైసిపి ఎమ్మెల్యే తన గ్యాంగ్‌తో వెళ్లి రాళ్లదాడి చేశారు. పట్టాభి చేసిన ఒక్క విమర్శను తట్టుకోలేక దాడులకు దిగుతున్న వైసిపి మూకలు ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ లోపల, బయట నీచాతినీచంగా చంద్రబాబును అసభ్యకరంగా తిడుతూ నానా దుర్భాషలాడినందుకు ఏం  సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబును తిట్టిన తిట్లను విని ప్రజలు చెవులు మూసుకున్నారు. రాయడానికి కూడా ఇబ్బందిగా ఉన్న భాషతో తిట్టిపోసిన పెద్ద మనుషులు ఈ రోజు పట్టాభి ఒక్క విమర్శ చేసినందుకే ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం సహజం. అంతమాత్రాన బరితెగించి పార్టీ ఆఫీసుల పైన, ప్రశ్నించిన వారి ఇళ్ల పైన దాడులు చేస్తారా? జగన్ అరాచక పాలనకు ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? ఫ్యాక్షనిజం తలకెక్కించుకున్న పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మానవీయ విలువలు మంటకలిసి పోయాయి. అధికారంలో ఉన్నాం ఏదైనా చెయ్యవచ్చు అనుకుంటున్నారు. రాష్ట్ర డిజిపి ఆఫీస్ పక్కనే ఉన్న తెలుగుదేశం కార్యాలయాన్ని వైసిపి నాయకులు విధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. సమతూకం పాటించాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీని రక్షించడానికి ఆత్రుత చూపిస్తోంది. ఆ మధ్య రాజధాని ప్రాంత రైతులను కలిసేందుకు చంద్రబాబు అమరావతి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా అడ్డు తగిలి వైసిపి నాయకులు చెప్పులు, కర్రలు విసిరినా పోలీసులు ప్రేక్షకపాత్రే వహించారు.


దాడికి గురైన పార్టీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు వస్తున్న వందలాది నాయకులను హౌస్అరెస్ట్ చేస్తారా? రెండున్నరేళ్ల పాలనలో పూర్తి వైఫల్యం చెంది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కొన్ని సర్వేల్లో తేలడంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు ఈ విధమైన విధ్వంసకాండకు తెరతీశారు. ఇది కేవలం తెలుగుదేశం కార్యాలయం పైనే  కాదు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి కూడా.


ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించి, నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ప్రశ్నించే, విమర్శించే వారిపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం వంటి చర్యలతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాల రాస్తున్నారు. హింసకు తావులేకుండా ప్రజలు వారి హక్కును వినియోగించుకునేలా పోలీసులు తోడ్పడాల్సి ఉంది. కానీ ప్రజలకు దన్నుగా నిలుస్తున్నవారిపై పోలీసులు దమనకాండ సాగించడం ఏమిటి? గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా నిరంకుశంగా, అప్రజాస్వామిక రీతిలో పరిపాలించలేదు. పోలీసుల నడవడికపై న్యాయవ్యవస్థ ఇటీవల కాలంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలి. ప్రజల హక్కులను, స్వేచ్ఛను కాపాడటానికి పోలీసులు ఉన్నారు తప్ప పొలిటికల్ బాస్‌లు చెప్పినట్లు వ్యవహరించడానికి కాదని, పోలీసు అధికారులను నియంత్రించలేకపోతే డిజిపి రాజీనామా చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతోందా అని కూడా పదే పదే ప్రశ్నించిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో పాటించవలసిన కనీస సూత్రాలను, రాజ్యాంగబద్ధ పాలనను విస్మరించి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ అపురూపంగా చూసుకోవాల్సిన విలువలను, వ్యవస్థలను, పౌరహక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసి రాష్ట్రంలో అరాచకానికి, అశాంతికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే.

యనమల రామకృష్ణుడు

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు


Updated Date - 2021-10-21T06:17:54+05:30 IST