వైఎస్సార్‌ వారసత్వ పాలనంటే ఇదేనా...?

ABN , First Publish Date - 2021-12-06T06:29:48+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా నని పాదయాత్రలో చెప్పిన సీఎం జగన్మోహనరెడ్డి ఆ మా ట మరిచి లక్షలాది ఉద్యోగుల కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

వైఎస్సార్‌ వారసత్వ పాలనంటే ఇదేనా...?
మాట్లాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన బొప్పరాజు వెంకటేశ్వర్లు

సీపీఎస్‌ రద్దు ఊసేలేదు

పీఆర్‌సీ అమలు నివేదికను బహిర్గతం చేయండి

పెండింగ్‌ డీఏలన్నింటినీ ఇవ్వాలి

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన బొప్పరాజు వెంకటేశ్వర్లు  

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు5: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా నని పాదయాత్రలో చెప్పిన సీఎం జగన్మోహనరెడ్డి ఆ మా ట మరిచి లక్షలాది ఉద్యోగుల కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇదేనా వైఎస్సార్‌ వారసత్వ పాలనంటే...? అని ప్రశ్నించారు. ఆదివారం ఎన్జీఓ హోంలో నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఉద్యమ కార్యచరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన సీఎం ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా రద్దు చేయకపోవడం బాధాకరమన్నారు. పీఆర్సీ  నివేదిక ఏమయ్యిందో అర్థం కావ డం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో రిటైర్‌ అ యిన ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కారుణ్య నియామకాలు చేపట్టకుండా ఆయా కుటుంబాలకు వేదన కలిగిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఏడు డీఏలు, 2022 జనవరిలో వచ్చే మరో డీఏపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదకపోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వపరం చేసినా వారికి  పీఆర్సీలు అమలు విషయంపై నిర్లక్ష్య వైఖరి వహించడం సరికాదన్నారు. కరోనా సమయంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిప డ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇంత వరకూ ఆ ఉద్యోగులకు జీతభత్యాలు కూడా పెంచలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వముండటం బాధాకరమన్నారు. విద్య, వైద్యశాఖల్లో యాప్‌ల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీలు అమలు, ఫిట్‌మెంట్‌, పేస్కేలు, డీఏ, హెచఆర్‌ఏ, టీఏ, మెడికల్‌ లీవులు, ఎల్‌ టీసీ, పెన్షనర్ల బెనిఫిట్స్‌లతో పాటు 16 రకాల అలవెన్సులకు సంబంధించి ప్రతిఒక్క సమస్యను పరిష్కరించాలన్నారు. అందుకు రేపటి వరకూ డెడ్‌లైన విధిస్తున్నామన్నారు.  ప్రభుత్వం స్పందించని పక్షంలో జిల్లాల వారీగా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో  ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అతావుల్లా, ఏపీ జేఏసీ కార్యదర్శి హృదయ రాజు, ఏపీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్‌, క్లాస్‌-4 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి చెన్నప్ప, ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌ రెడ్డి, జేఏసీ జిల్లా చైర్మన ఆర్‌ఎన దివాకర్‌, ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు నబీరసూల్‌, ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ రీజినల్‌ సెక్రటరీ షబ్బీర్‌, నీలకంఠారెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా కార్యదర్శి శీలా జయరామప్ప, ఏపీఎన్జీఓ జిల్లా నాయకులు వేణుగోపాల్‌, రవికుమార్‌, లక్ష్మయ్య, ఏపీఎన్జీఓ నగర కార్యదర్శి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T06:29:48+05:30 IST