Fuel taxes : తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గకపోవడానికి ఇదే కారణమా?

ABN , First Publish Date - 2022-09-08T21:31:54+05:30 IST

పెట్రో ఉత్పత్తులపై పన్నులను తగ్గించని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం

Fuel taxes : తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గకపోవడానికి ఇదే కారణమా?

న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తులపై పన్నులను తగ్గించని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ధరల పెరుగుదల అంశాన్ని చక్కదిద్దడానికి కేంద్ర-రాష్ట్ర సహకార యంత్రాంగం ఏర్పాటును పరిశీలించాలని సలహా ఇచ్చారు. రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు, తదితర ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటానికి కారణం కేంద్రమేనని నిందించడాన్ని ఆమె పరోక్షంగా తప్పుబట్టారు. 


ఇటీవల రెండు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులను తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతుండటంతో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడంపై జరిగిన ICRIER సమావేశంలో నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, ధరల పెరుగుదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చాలా రాష్ట్రాలు ఎటువంటి ఉపశమనాన్ని కల్పించడం లేదన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ద్రవ్యోల్బణం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు విధాలుగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చునని, అయితే ఇంధనం ధరలను, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం జాతీయ ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా ఉందని తేటతెల్లమవుతోందన్నారు. ఈ విషయాన్ని తాను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, చాలా జాగ్రత్తగా చెప్తున్నానని తెలిపారు. 


‘‘అందరికీ తెలిసిన విషయాన్నే నేను చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. కానీ ఆహార ధాన్యాలు, ఆహార సంబంధిత వస్తువుల రవాణాపై ఈ ధరల ప్రభావం ఉంటుంది. ఈ ధరలు వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index -CPI)ని ప్రభావితం చేస్తాయి’’ అన్నారు. జీఎస్‌టీ విధానాన్ని అనుసరించినా, ఏక మార్కెట్‌ను సృష్టించినా, టోల్ ట్యాక్స్‌లను తొలగించినా, వస్తువుల రవాణాపై ఆంక్షలను తొలగించినా, ద్రవ్యోల్బణం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు విధాలుగా ఉంటోందని చెప్పారు. చాలా దేశాల్లో కన్నా మన దేశంలో ద్రవ్యోల్బణం విభిన్నంగా ఉండటానికి ఇదే కారణమని తెలిపారు. 


రాష్ట్రాలు, వాటి ద్రవ్యోల్బణాన్ని భారత ప్రభుత్వానికి ఆపాదించాలనుకుంటే, కేంద్ర, రాష్ట్రాల సహకారంతో ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలను నిర్వహించే ఓ విధానాన్ని రూపొందించుకోవాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు తాము అందిస్తున్నదానితో పోల్చితే తమకు దక్కుతున్న వాటా అన్యాయంగా ఉందని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. రాష్ట్రాలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తున్న తీరును మదింపు చేయడానికి కూడా ఇలాంటి వైఖరి అవసరమని తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వం మాత్రమే ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుందనడం సరికాదన్నారు. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోకపోతే, ద్రవ్యోల్బణం ఒత్తిడి నుంచి ఉపశమనం కొరవడి భారత దేశంలోని ఆ ప్రాంతం ఇబ్బందులు పడుతుందన్నారు. రాష్ట్రాలు తమ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నియంత్రించాలో ఓ అవగాహనకు రావాలనడాన్ని సమర్థించే అంశాలు అనేకం ఉన్నాయని చెప్పారు. 


అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగినపుడు సామాన్యునిపై ఆ భారం పడకుండా చూడాలని కోరారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు సాధ్యమైనంత వరకు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించిందని గుర్తు చేశారు. 


Updated Date - 2022-09-08T21:31:54+05:30 IST