కశ్మీరుపై తాలిబన్ల వైఖరి ఇదేనా?

ABN , First Publish Date - 2021-08-18T02:06:55+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు

కశ్మీరుపై తాలిబన్ల వైఖరి ఇదేనా?

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు జమ్మూ-కశ్మీరు అంశంపై ఓ వివరణ ఇచ్చినట్లు కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ట్విటర్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం కశ్మీరు అంశం ‘ద్వైపాక్షిక, అంతర్గత వ్యవహారం’ అని తాలిబన్లు చెప్పినట్లు తెలుస్తోంది.


విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, తాలిబన్లు కశ్మీరుపై దృష్టి పెట్టే అవకాశాలు లేవు. కశ్మీరు లోయలో భద్రతను పెంచడంతో, పాకిస్థాన్ నుంచి వచ్చిన సంస్థలకు ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలను ఉపయోగించుకునే సామర్థ్యం లేదు. అమెరికన్లు సరఫరా చేసిన, ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన ఆయుధాలన్నీ తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్ళడంతో, ఇస్లామిక్ ఉగ్రవాదానికి మొదటి కేంద్రంగా ఆఫ్ఘనిస్థాన్ మారుతుందనే ఆందోళన ఉంది.  పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరే తొయిబా, లష్కరే ఝాంగ్వి  ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నాయి. ఈ సంస్థలు కొన్ని గ్రామాల్లో చెక్ పాయింట్లను తాలిబన్ల సహకారంతో ఏర్పాటు చేశాయి. 


జమ్మూ-కశ్మీరులో మనం జాగ్రత్తగా ఉండాలని ఆ వర్గాలు చెప్పినట్లు ఈ వార్తా సంస్థ పేర్కొంది. తాలిబన్లు బలహీనంగా ఉన్నపుడు మాత్రమే వారిపై ఐఎస్ఐ ప్రభావం ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో  ఆ ప్రభావం ఉండే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపింది. 


Updated Date - 2021-08-18T02:06:55+05:30 IST