రాజ్యాంగ ద్రోహం దేశద్రోహం కాదా?

Jul 22 2021 @ 03:06AM

వలసవాద చట్టం రాజద్రోహం ఇంకెన్నాళ్లు అనే ప్రశ్నను సర్వోన్నత న్యాయస్థానం అడిగింది. అది గతించిన కాలానికి చిహ్నం అనే ధ్వని అందులో ఉంది. వలసవాదం ఒకప్పుడు బలమైన, విస్తృతమైన అధికార రూపం. అది జాతీయోద్యమానికి ప్రేరణ ఇచ్చిందనడం ఎంత నిజమో, దాని పునాదులు జాత్యహంకారంలో ఉన్నాయనేది అంతే నిజం. ఇవాళ వలసవాద చట్టం వద్దనే వారందరు, అంతర్గత అసమ్మతిని అణచడానికి దేశద్రోహ చట్టం ఇచ్చే నియంతృత్వ అధికారాన్ని ఇంకో రూపంలో కావాలంటే? పళ్లూడగొట్టుకో డానికి ఏ రాయి అయితేనేం? కాబట్టి వలసవాద చట్టమా లేక జాతీయ చట్టమా అనేది కాదు అసలు సమస్య. సహజ న్యాయ సూత్రాలకు అతీతమైన నియంతృత్వ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వలస ప్రభుత్వాలకు ఎంత దుర్బుద్ధి ఉందో అంతకంటే ఎక్కువే జాతీయ ప్రభుత్వాలకు ఉందనేది చరిత్ర చెబుతున్న సత్యం. దానికి ప్రధాన కారణం వలస కాలం నాటి కంటే వర్తమానంలో ప్రజల్లో చైతన్యం, అక్షరాస్యత, చర్చించుకునే మాధ్యమాలు పెరగడం. అమాత్యులకు అర్జీలు ఇచ్చుకోవడానికి ఎదురు చూసే రోజులు పోయి ప్రజలు బహిరంగంగా ప్రభుత్వాల అసమర్థతను ఎత్తిచూపే రోజులు వచ్చాయి. ప్రజలు సంఘటితం కావడానికి ఆధునిక సామాజిక మాధ్యమాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. అంతర్జాల మాధ్యమాల మీద ప్రభుత్వాలు పట్టు బిగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఈ సందర్భంలోనే అర్ధం చేసుకోవాలి. న్యాయస్థానాలు కొట్టేసిన చట్టాలను మరల, మరల ఉపయోగించి అసమ్మతి స్వరాలను నొక్కడానికి జరుగుతున్న ప్రయత్నాలు చేస్తున్నవి జాతీయ ప్రభుత్వాలే కానీ వలస ప్రభుత్వం కాదు కదా? 


ఎంత విస్తృతమైన అధికారం చెలాయించాలంటే అంత అమూర్తమైన పదబంధంపై ముందు పట్టు సంపాదించాలి. కొద్దిగా ఆలోచిస్తే చాలు, ప్రభుత్వ వ్యతేరేకత, రాజద్రోహం, రాజ్యద్రోహం, దేశద్రోహం, రాజ్యాంగద్రోహం, ప్రజా నైతికతకు ముప్పు అన్న భావనలు భిన్నమైన, కొంత వ్యతిరేకమైన చిత్రాలను మన ముందు ఆవిష్కరిస్తాయి. ‘రాచరికాలు లేని రోజుల్లో రాజద్రోహాలు ఏమిటి’ అని విశ్వనాథ సత్యనారాయణ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవాళ్లు తమను తాము రాజులు అనుకుంటే తప్ప ఈ పదప్రయోగానికి అర్థమేముంది? సంక్లిష్టమైన రాజ్య వ్యవస్థను కూలదోయాలంటే రాజ్యం లోపలి ఆనుపానులు తెలిసిన వారికే ఎక్కువ సాధ్యం అని సామాన్యులకు అనిపిస్తే తప్పు ఎవరిది? ప్రభుత్వ వ్యతిరేకత అనేది రాజ్యద్రోహానికి, దేశద్రోహానికి సమానార్థకం అవుతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగమే అన్నిటికంటే ఉన్నతమైన చట్టం అనుకుంటే, దాని సారాంశాన్ని పరిమార్చి, నియంతృత్వ అధికారానికి అనుగుణంగా మార్చుకుంటే, అది రాజ్యాంగ ద్రోహం కాదా? అంతకంటే పెద్ద నేరాలకు పాల్పడే అవకాశం ప్రజలకు ఉంటుందా? రాజ్యాంగానికి అతీతంగా అధికారాన్ని చెలాయించే వాళ్ళు రాజ్యాంగద్రోహులుగా ప్రజలు ఎందుకు అనుకోకూడదు? 


భారతీయ శిక్షా స్మృతిలోని రాజద్రోహం సెక్షన్ ను తీవ్ర జాత్యహంకారి మెకాలే 1836 నాటికే రూపొందించినప్పటికీ అది 1870 వరకు చట్టబద్ధం కాలేదు. ఆ తర్వాత 1898లో దాన్ని సవరించి కఠినతరం చేశారు. సందర్భాన్ని గమనించండి. అప్పటికే భారతీయ పత్రికా రంగం పెరుగుతూ ఉంది. దాని అణిచివేతకు 1878లో వెర్నాక్యులర్ ప్రెస్ చట్టాన్ని తీసుకు వచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడి వ్యవస్థీకృత రాజకీయ చైతన్యం పెరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో జాతీయోద్యమ పోకడలు కనిపిస్తున్నాయి. బలమైన భారత విద్యాధిక వర్గం వలస ప్రభుత్వం ప్రాపకంలో ఉన్నప్పటికీ సామాన్యులు గళమెత్తే పోకడలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిధేయతను పెంచడానికి పెద్దగా శ్రమించనవసరం లేదు. ఈ అసమ్మతిని తుంచడానికి దేశద్రోహ చట్టాన్ని తీసుకొచ్చారు. సెక్షన్ 124- ఏ ప్రజల అసమ్మతిని అవిశ్వాసంగా, అవిధేయంగా తద్వారా శత్రుత్వంగా పరిగణిస్తుంది. వాక్ స్వాతంత్రం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలను వలస ప్రభుత్వం సహజంగానే శత్రువుగా పరిగణిస్తుంది. సారాంశంలో రాజద్రోహ నేర భావన వలసాధిపత్యాన్ని, అధికారాన్ని ప్రశ్నించడానికి వీలు లేదనే వైఖరి నుండి పుట్టింది. దీన్ని, ఆధిపత్య పునాదిగా ఏర్పడిన దేశద్రోహ భావనగా సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తారు. ఆ తర్వాత ఈ భావన రూపంలో మారుతూ వచ్చింది.


రాజద్రోహం భావన అథారిటేరియన్ చట్రంలో ఉన్నంతవరకు అది భావ వ్యక్తీకరణకు ప్రమాదకారిగా సమాజాలు భావించాయి. కానీ సమాజంలో హింసను అడ్డుకొనే పేరుమీద రాజద్రోహం భావన సాధికారత సంపాదించుకోవడం మొదలుపెట్టింది. 1942లో భారతీయ ఫెడరల్ కోర్ట్ ఒక కేసులో దేశద్రోహం భావనను కొత్తమలుపు తిప్పింది. ‘ప్రభుత్వాల గాయపడ్డ అహాన్ని సంతృప్తి పరచడానికి కాదు రాజద్రోహ చట్టం చేసింది. ప్రభుత్వం పట్ల విధేయత, గౌరవం ప్రజలలో లేకపోతే మిగిలేది అరాచకమే. అంటే చట్టబద్ధ పాలన, పబ్లిక్ ఆర్డర్ అసాధ్యమవుతుంది. అంటే వ్యవస్థ కుప్ప కూలకుండా ఉండాలంటే ఈ చట్టం అవసర ’ ఆ కోర్టు అభిప్రాయపడింది. హింసకు దారి తీయకుండా వ్యవస్థను నడిపించడమే వలస పాలనా లక్ష్యం అనే ఈ విశ్లేషణ, వలస సందర్భం మారిన తర్వాత కూడా న్యాయ బద్ధత సంపాదించుకుంది. హింస లేకుండా పబ్లిక్ ఆర్డర్ ఉండాలనే లక్ష్యంలో తప్పేముంది అనే ప్రశ్నను సందర్భానికి అతీతంగా అడిగితే, మొదట న్యాయబద్ధంగానే తోస్తుంది. కానీ వలసవాదం పోయి, ప్రజాతంత్ర వ్యవస్థ వచ్చింది అని ప్రకటించుకున్న తర్వాత కూడా ప్రభుత్వాలకు అసమ్మతి లేకుండా, అవిధేయత లేకుండా వ్యవస్థను నడిపించడానికి రాజద్రోహ చట్టం అవసరం అంటే అది న్యాయబద్ధం అవుతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నవారు అసమ్మతి వద్దనరు. కానీ హింసకు దారి తీస్తుంది అనే పేరు మీద అసమ్మతిని అణచడానికి ప్రయత్నం చేస్తారు. ఇది రాజద్రోహం అనే ఆధిపత్య నేరాన్ని దొడ్డిదారిలో కొనసాగించడానికి ఇరుసుగా పనికి వచ్చింది. బహిరంగంగా రాజద్రోహం చుట్టూ జరిగే చర్చలో ఈ లోతట్టు తర్కం స్పష్టంగా కనిపించదు. 


హింసకు దారి తీసే వ్యక్తీకరణలు మాత్రమే రాజద్రోహం చట్టం పరిధిలోకి వస్తాయనే విశ్లేషణ ద్వారా వలస చట్టానికి సాధికారాన్ని సంపాదించి పెట్టిన పాపం మాత్రం సుప్రీమ్ న్యాయస్థానానిదే. కేదార్ నాథ్ సింగ్ వెర్సెస్ స్టేట్ అఫ్ బిహార్ (1962) తీర్పుతో వలస పాలనలో మాత్రమే పనికి వచ్చే ఈ చట్టానికి అంగీకారం తెలిపింది. ఆ తీర్పును తిరగదోడకుండా వలస చట్టం ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించి లాభం లేదు. వర్తమానం విషయానికి వస్తే రాజ్యానికి, దేశ సమగ్రతకు, పబ్లిక్ ఆర్డర్ కు, ప్రజా నైతికతకు ముప్పు అనే పద ప్రయోగాలు చాలా అమూర్తమైనవి. వాటితో అధికారంలో ఉన్నవారు ఏ నాట్యమైనా చేయించగలరు. మెజారిటీ కేసులలో ‘భారత వ్యతిరేక’, ‘జాతి వ్యతిరేక’, ‘సెంటిమెంట్ వ్యతిరేక’ వ్యాఖ్యలు చేశారన్న పేరుమీద రాజద్రోహ ఫిర్యాదులు చేసిన వారంతా ప్రైవేటు వ్యక్తులే. రైటిస్టు భావజాలం మాయలో ఉన్నవారు ఆవేశానికి లోనయి ఈ పనికి పూనుకుంటున్నారనుకుంటే అది సమస్యను తక్కువ అంచనా వేయడమే. చాలా పకడ్బందీగా సమన్వయంతో ప్రభుత్వాలను విమర్శించే వారి మీదనే ఈ కేసులు పెడుతున్నారు. రాజద్రోహం కేసుల్లోనే కాదు, కఠినమైన చట్టాలు అన్నింటిలో నేరాలు రుజువు చెయ్యాలనే సంకల్పం ఈనాడే కాదు ఏనాడూ లేదు. వాటి ఉద్దేశమే అది కాదు. న్యాయ ప్రక్రియ క్రమాన్నే ఒక శిక్షగా ఈ చట్టాలు మార్చేశాయి. నేరం రుజువు కానంత వరకు పౌరులందరూ నిర్దోషులే అనే సహజ న్యాయ సూత్రం కాక, నిర్దోషిగా రుజువు కానంతవరకు పౌరులందరూ దోషులే అన్న ప్రతిపాదనే ఈ కఠిన చట్టాలకు పునాది. ఇలాంటి ప్రాతిపదికతో ఉన్న చట్టాలు ప్రస్తుతం దేశంలో 40 వరకు ఉన్నాయి. వాటి పరిధి, విస్తృతి సామాన్య నేరాల వరకు ఆచరణలోనూ, సూత్ర రీత్యా పెరుగుతున్నాయి. అయితే ఈ మొత్తం ప్రయోగం ఫలితమేమిటి? ప్రజల్లో భయాన్ని సృష్టించి, బహిరంగంగా జరిగే సామాజిక చర్చ స్వభావాన్ని మార్చడం. ఒకే భావజాలానికి చెందిన చర్చ మాత్రమే సమాజంలో అనుమతించబడుతుంది అనే సందేశాన్ని పంపడం. దానికి భిన్నమైన చర్చనంతా ప్రజలు ఇళ్లల్లో గుసగుస మాట్లాడుకోవాలి. ఈ రాజకీయ ప్రయోగాలను అన్ని భావజాలాలకు చెందిన నియంతృత్వాలు చేశాయి. కొన్ని చట్టాన్ని అడ్డుపెట్టుకుని చేస్తే, కొన్ని తాయిలాలు చూపి, భయపెట్టి చేస్తాయి. అంతే తేడా. వలసవాద చట్టం స్థానంలో జాతీయవాదం పేరుతో ఇంకో నియంతృత్వ చట్టం రాకుండా అడ్డుకునే బాధ్యత పౌర సమాజానిదే. లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 

కె. మురళి

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.