ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్లు మళ్లీ ట్రంప్ చేతుల్లోకి రాబోతున్నాయా..? ‘నిషేధం’ విధించిన తర్వాత ఏం జరుగుతోందంటే..

ABN , First Publish Date - 2021-05-06T11:31:01+05:30 IST

యూఎస్ కాపిటల్‌పై దుండగుల దాడి తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆయా సంస్థలు నిరవధిక నిషేధం విధించాయి. ఇప్పుడు ట్రంప్ అధికారంలో లేరు. ఈ క్రమంలో తాజాగా ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓవర్‌సైట్ బోర్డు ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అనే విషయంపై చర్చించాయి. జనవరిలో ఈ ఖాతాలను బ్యాన్ చేశారు.

ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్లు మళ్లీ ట్రంప్ చేతుల్లోకి రాబోతున్నాయా..? ‘నిషేధం’ విధించిన తర్వాత ఏం జరుగుతోందంటే..

యూఎస్ కాపిటల్‌పై దుండగుల దాడి తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆయా సంస్థలు నిరవధిక నిషేధం విధించాయి. ఇప్పుడు ట్రంప్ అధికారంలో లేరు. ఈ క్రమంలో తాజాగా ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓవర్‌సైట్ బోర్డు ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అనే విషయంపై చర్చించాయి. జనవరిలో ఈ ఖాతాలను బ్యాన్ చేశారు. శుక్రవారం సమావేశమైన ఫేస్‌బుక్ ఓవర్‌సైట్ బోర్డు.. ట్రంప్ ఖాతాల విషయంలో త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని తెలిపింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని, ఇప్పటికే 9వేలపైగా కామెంట్స్ తీసుకున్నామని చెప్పిన ఈ బోర్డు.. వీటన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన ట్రంప్ ఖాతాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.


వాషింగ్టన్‌లోని కాపిటల్ హిల్‌లోకి ట్రంప్ మద్దతుదారులు దూసుకొచ్చిన ఘటన అమెరికాలో కలకలం రేపింది. ఇక్కడ జరిగిన గొడవల్లో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన తర్వాతి రోజు ట్రంప్ ఖాతాలను ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది. కనీసం ఆయన పదవీకాలం ముగిసే వరకూ  ఈ నిషేధం కొనసాగుతుందని ఫేస్‌బుక్ చెప్పింది. జనవరి 20న ట్రంప్ పదవీకాలం ముగిసింది. అయితే దీనిపై ఫేస్‌బుక్ నిర్ణయం తీసుకోవడానికి ముందే ట్విట్టర్ కూడా ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసింది. ఈ నిషేధాన్ని సమర్థించుకుంటూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ ఒక పోస్టు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మా సేవలను వినియోగించుకునే అవకాశం అధ్యక్షుడి ఇవ్వడం చాలా రిస్క్ అని భావిస్తున్నాం. అందుకే ఆయన ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ ఖాతాలను నిరవధికంగా నిషేధిస్తున్నాం’’ అని జుకెర్‌బర్గ్ పోస్టు చేశారు.




ఇది జరిగిన కొన్ని రోజులకు హింసను రెచ్చగొట్టే కంటెంట్‌ను నియంత్రించడంలో  విఫలమైందంటూ ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ పార్లర్‌ను యాపిల్, అమెజాన్, గూగుల్ సంస్థలు సస్పెండ్ చేశాయి. ఈ యాప్ సంప్రదాయ అమెరికన్లలో బాగా పాపులర్. అయితే ఇలా ట్రంప్ ఖాతాలను సోషల్ మీడియా సంస్థలు బ్లాక్ చేయడం మరో వివాదానికి తెరతీసింది. కంటెంట్‌ను సెన్సార్ చేయడంలో ఈ టెక్ కంపెనీలకు ఉన్న శక్తిపై వాదనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ వ్యతిరేకులకు ఈ కంపెనీల నిర్ణయం సంతోషకరమే అయినా, మిగతా వారు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే ఈ కంపెనీల చేతుల్లో దేశంలోని ఎంత రాజకీయ శక్తి దాగుందో చెప్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.


సోషల్ మీడియాలో దేన్ని తొలగించాలి? దేన్ని వదిలేయాలి? అలా చేయడానికి కారణాలేంటి? అనే విషయాలను నిర్ణయించడానికి 2018లో ఓవర్‌సైట్ బోర్డును ఏర్పాటు చేయాలని ఫేస్‌బుక్‌లో ప్రతిపాదన వచ్చింది. మే 2020న ఈ బోర్డు తొలి సభ్యుల వివరాలను ప్రకటించారు. ఈ బోర్డుకు ఫేస్‌బుక్‌తో సంబంధం లేదు. ఇదో ప్రత్యేక వ్యవస్థ. దీనిలో లా, డిజిటల్ హక్కులు, టెక్నాలజీ వంటి రంగాలకు చెందిన పలువురు విద్యావేత్తలు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు. భావస్వేచ్ఛ, మానవ హక్కులను అనుసరిస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎటువంటి కంటెంట్‌ను తొలగించాలి అనే విషయాన్ని ఈ బోర్డు నిర్ణయిస్తుంది. గతేడాది ఏర్పాటు చేసిన ఈ బోర్డుకు ఎవరైనా అప్పీలు చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో తీసుకున్న కంటెంట్ నిర్ణయాలను యూజర్లు ఈ బోర్డులో సవాలు చేయవచ్చు. అయితే ఈ బోర్డు అన్ని అప్పీళ్లనూ పరిశీలించదు. సమస్య ప్రాముఖ్యత, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతుంది? వంటి అంశాలను పరిగణించిన తర్వాత ఏ సమస్యను చర్చించాలనే విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుంది. గతేడాది వచ్చిన 20వేల కేసుల్లో కేవలం ఆరింటిని మాత్రమే బోర్డు ఎంపిక చేసింది.




అయితే కొంతమంది మాత్రం ఈ బోర్డును ‘కార్పొరేట్ సూపర్ బోర్డు’ అంటూ విమర్శిస్తున్నారు. ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధాన్ని తొలగించాలా? వద్దా? అనే విషయంపై ఈ బోర్డు రానున్న 87 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ప్రజల నుంచి సేకరించిన 9వేలపైగా అభిప్రాయలను పరిశీలించిన తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఈ బోర్డు స్పష్టం చేసింది. అన్నీ కనుక అనుకున్నట్లు జరిగితే రానున్న రోజుల్లో మళ్లీ ట్రంప్‌ను సోషల్ మీడియాలో చూడొచ్చని ఆయన అభిమానులు అంటున్నారు. గతంలో ట్రంప్ చేసిన వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులను చూసిన వారు మాత్రం ట్రంప్‌ ఖాతాలపై నిషేధం తొలగించకపోవడమే మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై బ్యాన్ కనుక తొలగితే ఆయన మాత్రం ఫుల్ ఖుషీ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్యాన్ తర్వాత తాను సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం పెట్టుకుంటానని ప్రకటించిన ట్రంప్.. ఈ నిర్ణయం వచ్చే వరకూ ఆగుతారేమో చూడాలి.

Updated Date - 2021-05-06T11:31:01+05:30 IST