వాక్సిన్ వితరణ నిష్ఫలమేనా?

ABN , First Publish Date - 2021-04-21T05:51:50+05:30 IST

కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. ఆ విపత్తు నియంత్రణ చర్యల దిశగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలను...

వాక్సిన్ వితరణ నిష్ఫలమేనా?

కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. ఆ విపత్తు నియంత్రణ చర్యల దిశగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలను అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. ప్రపంచంలో కెల్లా ఎక్కువగా వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న మనదేశంలో ఇప్పుడు ఎక్కడా లేని విధంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. 


‘ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత’ అన్న చందంగా ఉంది మోదీ సర్కార్ వాక్సిన్ విధానం. దేశీయంగా మహమ్మారి నిర్మూలన చర్యలను విస్మరించి వాక్సిన్ మైత్రి పేర వివిధ దేశాలకు ఆ సంజీవనిని సరఫరా చేశారు. అదే సమయంలో దేశంలో ప్రజలందరికీ వాక్సిన్ ఇవ్వడం కోసం టీకా ఉత్సవాలు అంటూ మోదీ సర్కార్ ఆర్భాటం చేసింది. ఇప్పుడు ఈ రెండు చర్యలను ఇంటా బయటా అపహసిస్తున్నారు. 


ఇరుగుపొరుగు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలకు వాక్సిన్ సరఫరా చేసామని నరేంద్ర మోదీ ప్రభుత్వం సగర్వంగా చాటుకున్నది. అయితే ఇంతలోనే స్వంతగడ్డపై వాక్సిన్ కొరత కారణంగా మౌనంగా తలదించుకోవల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. దేశీయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిగ్గా పరిగణనలోకి తీసుకోకుండా, కరోనా సద్దుమణుగుతోందని విశ్వసించినందునే దేశపాలకులు నానా ఆర్భాట ప్రకటనలు చేశారు. 


ప్రపంచంలోకెల్లా అత్యధికంగా వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా, సమస్త మానవాళి ఆరోగ్య భద్రతకు ఆ సంజీవనిని అందించడానికి భారత్ కృషి చేస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో భారత ప్రతినిధి అయిన తెలుగు దౌత్యవేత్త కె. నాగరాజునాయుడు సగర్వంగా ప్రకటించారు. ఆయన ప్రకటనను నిఖిల ప్రపంచం స్వాగతించింది. ఐదు ఖండాలలోని అనేక దేశాల వారు భారత్ వైపు ఆశగా చూశారు. ధనిక గల్ఫ్‌దేశాలతో పాటు పేద ఆఫ్రికాదేశాలు కూడా న్యూఢిల్లీని ఒక ఆశా జ్యోతిగా చూశాయి. తమకు భారీ పరిమాణంలో వాక్సిన్లు సరఫరా చేయాలని సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశంలోని భారతీయ రాయబారి ఔసాఫ్ సయీద్ (ఈయనా తెలుగువాడే)కు విజ్ఞప్తి చేసింది. ఇలాగే అన్ని అరబ్ దేశాలూ భారత్‌ను కరోనా వాక్సిన్ కోసం అభ్యర్థించాయి.


మోదీ సర్కార్ వాక్సిన్ దౌత్యనీతి గురించి ప్రభుత్వపెద్దలు గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఒక్కసారిగా పెరిగిపోయిన కరోనా కేసుల కారణంగా దేశీయ డిమాండ్ పెరగడంతో విదేశాలకు వాక్సిన్ ఎగుమతిని నిషేధించారు. బ్రిటన్ సొత్తు అయిన ఆస్ట్రాజెనికా వాక్సిన్ భారతదేశంలో కోవిషీల్డ్‌గా ప్రాచుర్యంలో ఉంది. ఒప్పందం ప్రకారం తమకు కోవిషీల్డ్ సరఫరా చేయడం లేదని బ్రిటన్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. భారత్‌లో ఆ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థకు ఏకంగా నోటీస్ జారీ చేసింది. త్వరలో ఆన్‌లైన్ విధానంలో జరుగనున్న బ్రిటన్, భారత ప్రధానమంత్రుల భేటీ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని భారత విదేశాంగశాఖ ప్రయత్నిస్తోంది. వాక్సిన్ ఎగుమతి విషయమై బ్రిటన్ ఆక్షేపణ కారణంగా భారత్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మసకబారుతుందని మన విదేశాంగ శాఖ సకాలంలో గ్రహించింది. దౌత్యాధికారుల సూచన మేరకు బ్రిటిష్, ఇతర అంతర్జాతీయ సంస్థల వాక్సిన్లను ఉత్పత్తి చేసే పుణేలోని సీరం సంస్థకు ప్రభుత్వం 3000 కోట్ల రూపాయల సహాయాన్ని అందించేందుకు పూనుకున్నది. టీకా ఉత్పత్తి పెరుగుదలతో స్థానిక అవసరాలు తీరడంతో పాటు విదేశాలకు సరఫరా మెరుగుపడనున్నది.


ప్రపంచ దేశాధినేతలు తన రాజనీతిజ్ఞతను, పాలనాసమర్థతను ప్రశంసించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢంగా అభిలషిస్తారని చెబుతారు. అయినా కరోనా వైరస్ కట్టడిలో ఆయన ప్రభుత్వ తీరుతెన్నులు అంతర్జాతీయంగా ప్రశస్తి పొందలేకపోతున్నాయి. కరోనాను పూర్తిగా నియంత్రించడంతో పాటు అందుకు అవసరమైన వాక్సిన్‌ను విరివిగా ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచానికి నరేంద్ర మోదీ నాయకత్వం ఆదర్శప్రాయంగా నిలిచిందని అధికార పక్షం నాయకులు అదే పనిగా పొగడ్తలు కురిపించారు. మరి ఇప్పుడు కరోనా రోగులకు ఆక్సిజన్ అందకపోవడమే కాక కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలకు దహన సంస్కారాలు సకాలంలో చేయలేని దుస్థితి నెలకొని ఉంది కదా. ఈ వైపరీత్యం గురించి పాలకపక్షం వారు ఏం చెబుతారు? 

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-04-21T05:51:50+05:30 IST