ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2021-07-23T06:03:59+05:30 IST

నగర పాలక సంస్థ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కీలకమైనది. ఇళ్లు, వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ఈ విభాగం అనుమతి తప్పనిసరి.

ఇష్టారాజ్యం

  1. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు 
  2. పార్కింగ్‌ సెల్లార్లలో వ్యాపారాలు
  3. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అక్రమాలు
  4. విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు


కర్నూలు(అర్బన్‌), జూలై 22: నగర పాలక సంస్థ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కీలకమైనది. ఇళ్లు, వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ఈ విభాగం అనుమతి తప్పనిసరి. కానీ వీరి పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో 10 నెలల క్రితం 132 వార్డు సచివాలయాల పరిధిలో ప్లానింగ్‌ కార్యదర్శుల ద్వారా సర్వే చేయించారు. నగరంలో 1.40 లక్షల భవనాలు ఉండగా, వీటిలో అనుమతి లేకుండా నిర్మించినవి 1,920 ఉన్నట్లు తేలింది. ఇలాంటి భవన యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఫిర్యాదులు వెళ్లాయి. వారు స్పందించి, రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాల వివరాలు ఇవ్వాలని కోరారు. 


భారీగా వసూళ్లు..?


నోటీసులు అందుకున్న కొందరు భవన యజమానులు టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులను సంప్రదించి మామూళ్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే కొందరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ప్లానింగ్‌ సెక్రటరీలు కుమ్మక్కై అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం మానేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏడాదిలో భారీగా మాముళ్ల రూపంలో వసూలు చేశారని ఆ విభాగంలో చర్చ సాగుతోంది. నగరంలోని చౌరస్తా, సుంకేసుల రోడ్డులోని అపార్ట్‌మెంట్ల యజమానులు, ఓ నర్సింగ్‌ హోమ్‌ నిర్మాణదారులు, మరి కొంతమంది నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు సమాచారం. మామూళ్లు తీసుకోవడానికి ఇష్టపడని ఓ టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగిని మరో విభాగానికి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. 


అనుమతి లేని భవనాలు


 షరాఫ్‌ బజార్‌లో బిల్డింగ్‌ నెంబర్‌ వన్‌లో అనుమతి తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. అందులో ఏకంగా 28 దుకాణాలు నిర్మించారు. బిల్డింగ్‌ నెంబర్‌ 6లో జీప్లస్‌ 3 నిర్మాణం చేపట్టారు. అందులో అనుమతులు లేకుండా 45 షాపులు నడుపుతున్నారు. ఇలా 32 కాంప్లెక్స్‌లను అనుమతి లేకుండానే నిర్మించారు. 


 సోమప్ప కాలనీలోని ఓ సర్వే నెంబర్‌లో ఇంటి నిర్మాణంతో పాటు గ్రౌండ్‌ ఫ్లోర్‌కు అనుమతి లేదు.


 అబ్బాస్‌ నగర్‌ ఎండోమెంట్‌ కాలనీలోని ఓ సర్వే నెంబర్‌లో అనుమతి లేని నిర్మాణాలు ఉన్నాయి.


 సోమిశెట్టి నగర్‌ మదర్‌ ల్యాండ్‌లోని రెండు సర్వే నెంబర్లలో నాలుగు అంతస్తుల అనుమతి లేని భవనం నిర్మించారు. ఓ విల్లాస్‌లో కూడా అనుమతి లేకుండా మొదటి అంతస్తు నిర్మించారు.


 చిదంబరావు వీధీలోని ఓ సర్వే నెంబర్‌లో 30లో అనుమతి లేకుండా గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తులో వాణిజ్య భవనాలు నిర్మించారు. 


 సంతోష్‌నగర్‌ నుంచి కొట్టాలకు వెళ్లె రస్తాలో రోడ్డును అక్రమించుకుని ఇంటి నిర్మాణాలు చేపట్టారు. 


 రాంప్రియ నగర్‌లోని ఓ లే అవుట్‌లో సుమారు 1.04 ఎకరాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించగా, మొత్తం అక్రమ నిర్మాణాలు చేపట్టారు.


సెల్లార్లపై ఏదీ పర్యవేక్షణ..?


నగరాలు, పట్టణాల్లో అక్రమ సెల్లార్లు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న సెల్లార్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వీటిలో అత్యధిక భాగం వాణిజ్య సముదాయాలకు సంబంధించినవే. అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలలో యజమానులు అత్యధిక శాతం సెల్లార్ల నిర్మాణానికి మొగ్గుచూపుతున్నారు. నగరపాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ విభాగం అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా నగరంలో ఎక్కడెక్కడ సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నదీ తెలుసుకోలేని పరిస్థితి ఉంది. సెల్లార్లను పార్కింగ్‌ స్థలంగా నమోదు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 


ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం


వాహనాల పార్కింగ్‌ కోసం కేటాయించిన సెల్లార్‌లలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, నర్సింగ్‌ హోమ్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాలను రోడ్లపై పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. రోడ్లపై నిలిపిన వాహనాల కారణంగా ట్రాఫిక్‌ సమస్య తీవ్రమౌతోంది. ఉదయం, సాయంత్రం, ఇతర రద్దీ సమయాలలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.  వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 


అడుగడుగునా నిర్లక్ష్యం


నగరంలో అక్రమ కట్టడాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల రికార్డుల ప్రకారం కేవలం 40 లోపు సెల్లార్‌లకు మాత్రమే అనుమతి ఉన్నట్లు సమాచారం. అనధికార లెక్కల ప్రకారం నగరంలో 100కు పైగా అనుమతి లేని సెల్లార్లు ఉంటాయని అంటున్నారు. నగరంలోని బళ్లారి చౌరస్తా, కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌, అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్‌, గాయత్రీ ఎస్టేట్‌, ప్రకాశ్‌నగర్‌, గాంధీనగర్‌, ఎన్‌ఆర్‌ పేట, మద్దూర్‌నగర్‌, నంద్యాల రోడ్డు, క్రిష్ణానగర్‌, వెంకటరమణకాలనీ, అశోక్‌నగర్‌ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలలో అక్రమ సెల్లార్‌లు నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 


హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు


అపార్టుమెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌ హాళ్లకు తప్పనిసరిగా పార్కింగ్‌ స్థలాలు ఉండాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. పార్కింగ్‌ స్థలాలలో వ్యాపారాలు చేపడితే వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. కానీ నగరంలో కోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదు. 


నోటీసులు ఇస్తున్నాం..

అక్రమ నిర్మాణాలను దశల వారీగా కూల్చి వేస్తాం. ఎవరినీ ఉపేక్షించం. అక్రమ భవనాల జాబితాను సిబ్బంది సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నాం. 

- డీకే బాలాజీ, కమిషనర్‌, కేఎంసీ

Updated Date - 2021-07-23T06:03:59+05:30 IST