Kabul Gurdwara Attack : దాడి చేసింది మేమే : ISIS ప్రకటన..

ABN , First Publish Date - 2022-06-19T18:42:52+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ గురుద్వారా(Gurdwara)పై దాడికి బాధ్యత వహిస్తూ ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటన విడుదల చేసింది.

Kabul Gurdwara Attack : దాడి చేసింది మేమే : ISIS ప్రకటన..

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ గురుద్వారా(Gurdwara)పై దాడికి బాధ్యత వహిస్తూ ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటన విడుదల చేసింది. మహ్మద్ ప్రవక్తకు అవమానానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించింది. అల్లాకు మద్దతు చర్యగా హిందువులు, సిక్కులు, వారికి వంతపాడుతున్న మతభ్రష్టులే లక్ష్యంగా దాడి చేశామని వ్యాఖ్యానించింది. ‘‘ హిందు, సిక్కుల బహుదైవారాధన ఆలయంలోకి మా యోధులు చొరబడ్డారు. గార్డును అంతమొందించి లోపలికి ప్రవేశించారు. మెషిన్ గన్, హ్యాండ్ గ్రెనేడ్‌తో లోపలున్నవారిపై దాడి చేశారు’’ అని ఐఎస్ఐఎస్ ప్రచార వార్తా సంస్థ ‘అమాఖ్ న్యూస్ ఏజెన్సీ’ వెబ్‌సైట్‌పై ఐఎస్ఐఎస్ ప్రకటన చేసింది. మహ్మద్ ప్రవక్త(Prophet Muhammed)పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ(Nupur sharma) వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా శనివారం ఉదయం జరిగిన కాబూల్ గురుద్వారాపై దాడి ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు సిక్కు వ్యక్తి ఉన్నారు. ఏడుగురు గాయపడ్డారు. బాంబులతో గురుద్వారా వైపు వస్తున్న వాహనాన్ని అఫ్ఘనిస్తాన్ సెక్యూరిటీ దళాలు నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. లేదంటే తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేది.


దుండగులు హతం..

గురుద్వారాపై దాడి ఘటనపై అఫ్ఘాన్ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రతినిధి అబ్దుల్ నిఫీ టకోర్ మాట్లాడారు. దాడికి పాల్పడ్డ దుండగులను అంతమొందించినట్టు గురుద్వారాలోకి ప్రవేశించే సమయంలో గ్రెనేడ్స్ విసిరారు. దీంతో మంటలు అంటుకున్నాయని తెలిపారు. దాడికి పాల్పడ్డ దుండగులు ఇద్దరినీ మట్టుబెట్టామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు శనివారం పొద్దుపోయాక ప్రకటన విడుదల చేశారు.  మానవీయ కోణంలో సహకారంపై అఫ్ఘనిస్తాన్‌తో చర్చల నిమిత్తం భారత అధికారుల బ‌ృందం అక్కడ పర్యటించిన అనంతరం ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. తాలిబన్లు అధికారం చేపట్టాక అఫ్ఘనిస్తాన్‌లో బాంబు దాడుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మైనారిటీలే లక్ష్యంగా అక్కడ వెలుగుచూస్తున్న కొన్ని ఘటనలు కలవరపరస్తున్నాయి. ఇందులో అత్యధికం ఐఎస్ఐఎస్ చేసినవే కావడం గమనార్హం.

Updated Date - 2022-06-19T18:42:52+05:30 IST