Plan 2047: పీఎఫ్ఐ అసలు లక్ష్యం బయటపడింది : మహారాష్ట్ర ఏటీఎస్

ABN , First Publish Date - 2022-09-24T17:59:50+05:30 IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India -పీఎఫ్ఐ)పై

Plan 2047: పీఎఫ్ఐ అసలు లక్ష్యం బయటపడింది : మహారాష్ట్ర ఏటీఎస్

ముంబై : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India -పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇటీవల నిర్వహించిన దాడుల్లో కీలక సమాచారం బయటపడింది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) చేతికి ‘ప్లాన్ 2047’ అనే పుస్తకం చిక్కింది. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్ళు పూర్తయ్యే సరికి దేశంలో ఇస్లామిక్ రాజ్యం (Islamic nation)ను స్థాపించాలని, షరియా చట్టం (Sharia law)ను అమలు చేయాలని ఈ పుస్తకంలో ఉంది. 


మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Maharashtra Anti-Terrorism Squad) వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా పీఎఫ్ఐపై జరిపిన దాడుల్లో ఆ సంస్థ నిర్వహిస్తున్న జాతి వ్యతిరేక కార్యకలాపాల గురించి ఎన్ఐఏ తెలుసుకుంది. ముంబైలోని ఓ పీఎఫ్ఐ కార్యకర్త వద్ద నుంచి ‘ప్లాన్ 2047’ అనే పుస్తకాన్ని ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. 


పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, కేడర్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎన్ఐఏ సోదాల్లో వెల్లడైంది. ముస్లిం యువతను రెచ్చగొట్టి, రాడికలైజ్ చేసి, ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) వంటి ఉగ్రవాద సంస్థలలో చేరే విధంగా ప్రోత్సహిస్తున్నారని బయటపడింది. ఉగ్రవాదులకు నిధుల అందజేత, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాల నిర్వహణ, ప్రజలను రాడికలైజ్ చేయడం వంటి నేరాలకు పీఎఫ్ఐ పాల్పడుతున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ ఐదు కేసులను నమోదు చేసింది. ఈ కేసులపై దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలను నిర్వహించింది. 15 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ (Operation Octopus) పేరుతో జరిగిన ఈ సోదాల్లో సుమారు 100 మందిని అరెస్టు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఎన్ఐఏ నిర్వహించిన ఈ సోదాల్లో పీఎఫ్ఐ సభ్యులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. 


మతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే లక్ష్యంతో ముస్లిం యువతకు శిక్షణ శిబిరాలను పీఎఫ్ఐ నిర్వహిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. మహారాష్ట్ర ఏటీఎస్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, పీఎఫ్ఐ సభ్యుని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ప్లాన్ 2047 పుస్తకంలో అత్యంత కీలక సమాచారం ఉంది. కుర్లాలో నివసిస్తున్న మజహర్ ఖాన్ అనే పీఎఫ్ఐ సభ్యుడి ఇంటి నుంచి ఈ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2047 నాటికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ళు అవుతుంది, అంటే మరో పాతికేళ్ళలో దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయాలని, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని ఈ పుస్తకంలో ఉంది. 


ప్లాన్ 2047 పుస్తకం అనేక వాల్యూమ్స్‌లో ఉందని, వాటిలో ఒక వాల్యూమ్ ఇతని వద్ద దొరికిందని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. మజహర్ ఖాన్‌కు ఐదేళ్ళ క్రితం పక్షవాతం వచ్చిందని, ఆయన కార్యకలాపాలు కొనసాగించడం కోసం పీఎఫ్ఐ ఆయనకు నెలకు రూ.10,000 చొప్పున చెల్లిస్తోందని తెలిపాయి. 


Updated Date - 2022-09-24T17:59:50+05:30 IST