Gaza పై మరోసారి దాడికి దిగిన ఇజ్రాయెల్

ABN , First Publish Date - 2021-06-17T02:24:49+05:30 IST

గాజాలోని హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య 11 రోజుల పాటు జరిగిన యుద్ధానికి మే 20న తెరపడింది. అమెరికా, ఈజిప్ట్‌ దౌత్యంతో ఇరువర్గాలు దిగివచ్చాయి. ఇజ్రాయెల్‌ మంత్రివర్గం కాల్పుల విరమణకు అంగీకరించింది. హమాస్‌ తరఫున దీనిపై

Gaza పై మరోసారి దాడికి దిగిన ఇజ్రాయెల్

జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రభుత్వానికి హమాస్ ఉగ్రవాద సంస్థకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా గడవకముందే బుధవారం తెల్లవారుజామున పేలుళ్లతో గాజా దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెట్ ప్రకటించింది. గాజా స్ట్రిప్ నుంచి మంటలు పుట్టించే బెలూన్లు తమ భూభాగంలోకి రావడంతో తాము ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది. కాగా, ఈ దాడుల్లో ఎవరైనా మరణించినట్లు గానీ గాయపడ్డట్లు గాని తెలిపే వివరాలు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడి కాలేదు. హమాస్‌ ప్రధాన నేతలు నివాసం ఉంటున్నారని భావిస్తున్న గాజా స్ట్రిప్‌లోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసింది. ఎఫ్‌-16 యుద్ద విమానాలు గాజాపై బాంబులవర్షం కురిపించాయి. దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.


గాజాలోని హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య 11 రోజుల పాటు జరిగిన యుద్ధానికి మే 20న తెరపడింది. అమెరికా, ఈజిప్ట్‌ దౌత్యంతో ఇరువర్గాలు దిగివచ్చాయి. ఇజ్రాయెల్‌ మంత్రివర్గం కాల్పుల విరమణకు అంగీకరించింది. హమాస్‌ తరఫున దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. కాల్పుల విరమణను నిర్ధారించాయి. 11 రోజులుగా జరిగిన హింసలో.. 65 మంది చిన్నారులు సహా.. 232 మంది పాలస్తీనీయులు చనిపోయారు. హమాస్‌ రాకెట్‌ లాంచర్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 12 మంది మృతిచెందారు. వీరిలో భారత్‌లోని కేరళకు చెందిన సౌమ్యా సంతోష్‌ అనే 30 ఏళ్ల కేర్‌ టేకర్‌ కూడా ఉన్నారు. హమాస్‌ ఉగ్రవాదులు కొన్ని వందల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారని ఇజ్రాయెల్‌ చెబుతుండగా.. గాజాలోని భారీ భవనాలను టార్గెట్‌గా చేసుకున్న ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడిందని పాలస్తీనీ వర్గాలు పేర్కొన్నాయి.


ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో వందల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి వచ్చింది. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా కూడా హింస తగ్గేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతాన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. అటు ఈజిప్ట్‌ కూడా గాజా మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ మధ్య దౌత్యం నెరిపింది. ఫలితంగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాగా.. ఈ 11 రోజుల సమరంలో విజయం తమదంటే తమదేనని ఇజ్రాయెల్‌, హమాస్‌ వర్గాలు ప్రకటించుకుంటున్నాయి.

Updated Date - 2021-06-17T02:24:49+05:30 IST