ISRO: ఇస్రో చిన్నోడి అంతరిక్ష యానం రేపే

ABN , First Publish Date - 2022-08-07T01:08:40+05:30 IST

ఇస్రో తొలి ఎస్‌ఎస్‌ఎల్వీ (SSLV) అంతరిక్ష యానానికి వేళయ్యింది. తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీహరికోట సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని

ISRO: ఇస్రో చిన్నోడి అంతరిక్ష యానం రేపే

శ్రీహరికోట: ఇస్రో తొలి ఎస్‌ఎస్‌ఎల్వీ (SSLV) అంతరిక్ష యానానికి వేళయ్యింది. తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీహరికోట సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని ప్రథమ ప్రయోగవేదికపై నింగిలోకి ఎక్కుబెట్టిన బాణంలా ఈ రాకెట్‌ సిద్ధంగా ఉంది. ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు షార్‌లో శనివారం ఉదయం 11 గంటలకు వాహన సంసిద్ధత సమావేశం (ఎంఆర్‌ఆర్‌) నిర్వహించారు. తిరువనంతపురం వీఎస్‌ఎస్‌సీ సెంటర్‌ శాస్త్రవేత్త ఈఎస్‌ పద్మకుమార్‌ అధ్యక్షతన సమావేశమైన శాస్త్రవేత్తలు ప్రయోగ రిహార్సల్స్‌లో నమోదైన రాకెట్‌ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాకెట్‌ (Rocket) ప్రయోగానికి సిద్దంగా ఉందని వెల్లడించారు. అనంతరం సాయంత్రం షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 7 గంటల పాటు కౌంట్‌డౌన్‌ నిర్వహించారని నిర్ణయించారు.


ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కౌంట్‌డౌన్‌ ఆదివారం ఉదయం 9.18 గంటలకు ముగిసిన వెంటనే ఈ రాకెట్‌ ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్‌-2ఎతోపాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్‌ కిడ్జి ఇండియా సంస్థ తయారు చేయించిన ఆజాది శాట్‌తో రోదసిలోకి దూసుకుపోనుంది. ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఇస్రో వైపు తిప్పేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని ప్రజలు వీక్షించేందుకు ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.

Updated Date - 2022-08-07T01:08:40+05:30 IST