ఇస్సపల్లి రణరంగం

ABN , First Publish Date - 2022-01-26T08:32:00+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇస్సపల్లి రణరంగం

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల పరస్పర దాడులు

ఎంపీ అర్వింద్‌ వాహనం ధ్వంసం.. 

బీజేపీ కార్యకర్తలకు గాయాలు 


నిజామాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఆర్మూర్‌టౌన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎంపీని అడ్డుకోవడం, అక్కడికి బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇది దాడులు చేసుకునే వరకు వెళ్లింది. నందిపేట మండలంలోని నూత్‌పల్లి, చిన్నయానం, అన్నారం గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్‌లోని తన ఇంటి నుంచి మంగళవారం బయలుదేరారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘాలకు చెందిన కార్యకర్తలు, రైతులు.. పసుపు బోర్డుపై ఎంపీని నిలదీసేందుకు ఆర్మూర్‌ మండలం దేగాం, ఆలూరులో రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. ఈ రెండు గ్రామాలతో పాటు ఎంపీ వెళ్లే ఇతర గ్రామాల్లో కూడా రైతులు ఎంపీని నిలదీసేందుకు సిద్ధం కావడంతో.. పోలీసులు ఆ మార్గంలో వెళ్లొద్దని అర్వింద్‌కు సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ.. ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద 2 గంటలు ధర్నా చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్‌ మీదుగా ఇస్సపల్లికి చేరుకున్నారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో.. ఇరు పార్టీల వారు తోపులాటకు దిగారు. ఎంపీ సమక్షంలోనే పరస్పర దాడులకు పాల్పడ్డారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు భారీగా తరలిరావడంతో వారి నుంచి తప్పించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు పొలాల వెంట పరుగెత్తారు. వారిని టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెంటపడి తరిమి.. చితకబాదాయి. ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎంపీ వాహనంతో పాటు పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో భారీ బందోబస్తు మధ్య పోలీసులు అర్వింద్‌ను పంపించారు. 


టీఆర్‌ఎస్‌ నేతలకు పోలీసుల సహకారం: అర్వింద్‌

తనతో పాటు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కుట్ర పన్నారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. ఇందులో భాగంగానే రాళ్లు, రాడ్లతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తాను నందిపేట పర్యటనకు వెళ్తుంటే టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి.. ఆయుధాలతో దాడులు చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు ముం దుగానే చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. దాడులకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్వింద్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ వినిత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2022-01-26T08:32:00+05:30 IST