ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీలు

ABN , First Publish Date - 2021-12-28T04:15:20+05:30 IST

ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు రోజుకో రీతిలో నూతన పంధా అవలంబిస్తూ అక్రమార్జనకు తెరలేపుతున్నారు.

ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీలు
తయారీకి సిద్ధంగా ఉన్న మట్టి

నిబంధనలకు తూట్లు!

పట్టించుకోని అధికారులు

వరికుంటపాడు, డిసెంబరు 27: ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు రోజుకో రీతిలో నూతన పంధా అవలంబిస్తూ అక్రమార్జనకు తెరలేపుతున్నారు. వీరికి అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకు గ్రామ శివారు ప్రాంతాల్లో రహస్యంగా సాగిస్తున్న ఇటుక బట్టీలే ప్రత్యక్ష నిదర్శనం. గోరంత అనుమతులు పొంది కొండంత వ్యాపారం సాగిస్తూ తమ ఇష్టానుసారంగా బట్టీలు ఏర్పాటు చేసి రేయింబవళ్లు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. కొందరు అధికారులు వ్యాపారులతో చేతులు కలపడంతోనే సమీప చెరువుల్లోని సారవంతమైన మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలించి బట్టీలు ఏర్పాటు చేసకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కళ్లేదుటే చెరువులు నాశనమవుతున్నప్పటికీ పట్టించుకొనే నాథులే కరువయ్యారు. వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, కొండాపురం, మర్రిపాడు, వింజమూరు, కలిగిరి తదితర మండలాల్లో ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఈ ప్రాంతంలో తయారయ్యే ఇటుకకు అధిక డిమాండ్‌ ఉండడంతో ఇతర జిల్లాలకు సైతం తరలించి జేబులు నింపుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఒకప్పుడు రూపాయి ఉండే ఇటుక ప్రస్తుతం రూ.ఐదు పైబడి పలుకుతుండడం గమనార్హం. కాస్త దూర ప్రాంతాలకు తరలిస్తే సుమారు రూ.పది చెల్లించాల్సి వస్తోంది.  క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే అనుమతులు ఇస్తున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇదిలా ఉండగా పలుచోట్ల ప్రధాన రహదారులకు ఆనుకొనే బట్టీలు ఉండడంతో ప్రజలు, వాహనదారులు వాటి నుంచి వచ్చే పొగకు తట్టుకోలేక రోగాలపాలు కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నిబంధనలు తూచ్‌ : రోడ్డుకు వంద మీటర్ల దూరంపైనే బట్టీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా అలాంటి నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు. రవాణాకు అనుకూలంగా ఉంటుందని నివాసాలను సైతం లెక్క చేయకుండా రహదారులకు ఇరువైపులే అధికశాతం బట్టీలు దర్శనమిస్తున్నాయి. అడిగే వారు లేరులే అన్న ధీమాతో ప్రభుత్వ, అసైన్డ్‌, పట్టా భూముల్లో వ్యాపారాలు సాగుతున్నాయి. మైనింగ్‌, రెవెన్యూ, వైద్య తదితర శాఖల అనుమతులతో పాటు పంచాయతీల ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. కానీ కొంతమంది అధికారుల చేతివాటం పుణ్యమాని స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడుతోంది. వీటికితోడు పలు చోట్ల వ్యవసాయానికి వినియోగించాల్సి విద్యుత్‌ను వ్యాపారానికి వాడుకొంటున్నారు. 

మట్టి పేరుతో వసూళ్లు : కాగా ఇటుకకు ప్రధాన వనరైన మట్టి తరలింపు కొందరు నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. స్థానిక నాయకులతో పాటు గ్రామస్థులను లోబర్చుకున్న వ్యాపారులు కొంత నగదు చెల్లించి ఇష్టానుసారంగా చెరువుల నుంచి మట్టిని తరలించుకొని పోతున్నారు. దీంతో చెరువు కట్టలు బలహీన పడడంతో పాటు లోతైన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇటీవల కనియంపాడు చెరువు నుంచి మట్టి తరలిస్తుండంతో కొంతమంది గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సాతువారిపల్లి చెరువు మట్టి తరలింపులోను భారీ స్థాయిలోనే నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఉంచి నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు చేపట్టి ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 




Updated Date - 2021-12-28T04:15:20+05:30 IST