నాలుగు నెలలైనా ఇక్కట్లే

ABN , First Publish Date - 2022-08-15T08:49:41+05:30 IST

నాలుగు నెలలైనా ఇక్కట్లే

నాలుగు నెలలైనా ఇక్కట్లే

కొత్త జిల్లా కేంద్రాల్లో అరకొర వసతులే!

ఆర్భాటంగా ఏర్పాటైన కొత్త జిల్లాల కేంద్రంగా పాలన మొదలై నాలుగు నెలలు గడిచిపోయింది. అయితే ఇప్పటికీ ఏ ఒక్క జిల్లాలోనూ ప్రభుత్వ విభాగాల కార్యాలయాల ఏర్పాటు సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఒకే భవనంలో పదుల సంఖ్యలో కార్యాలయాలు... ఒకే గదిలో పదుల సంఖ్యలో ఉద్యోగులు సర్దుకుపోవాల్సిన పరస్థితి. చాలా జిల్లాల్లో ప్రజలకు ఇప్పటికీ ఏ కార్యాలయం ఎక్కడుందో కూడా తెలియని అవస్థ నెలకొంది. చాలాచోట్ల కొత్త జిల్లా కేంద్రంలో ఏదోక గదికి సంబంధిత శాఖ బోర్డు పెట్టి వదిలేసి... పాత జిల్లా కేంద్రంలోనే అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌


బందరులో వైరింగ్‌ పెండింగ్‌

పాత కృష్ణా జిల్లాలో మచిలీపట్నమే జిల్లా కేంద్రం. ఆ మచిలీపట్నమే ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడింది. అయినా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రహసనంగానే మారింది. 1962లో నిర్మించిన పురాతన బీడీ వర్తక సంఘం భవనంలో ఉద్యానవన శాఖ, స్పోర్ట్‌ కార్యాలయం, యూత్‌ సర్వీసెస్‌, ఇతర  శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేద్దామనుకున్నారు. ఇందుకోసం మరమ్మతులు చేపట్టి నాలుగు నెలలయినా ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొన్ని కార్యాలయాలు కలెక్టరేట్‌లో, మరికొన్ని అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.


వసతులు లేక వదిలేశారు!

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం కోసం కేటాయించిన ఉన్నత పాఠశాలలోని ఓ భవనం ఇది. సదుపాయాలు లేక దీనిని వినియోగించడం లేదు. ఐటీడీఏ కార్యాలయానికి సమీపంలో వున్న ఏజెన్సీ డీఈవో కార్యాలయంలోనే జిల్లా విద్యాశాఖాధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ చాలా కార్యాలయాలకు కనీసం బెంచీ, కుర్చీ వంటివి కూడా ఏర్పాటు చేయలేదు. ఇక రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, జిల్లా ఆడిట్‌ కార్యాలయం, పన్నుల శాఖ ఏసీ కార్యాలయం, దేవదాయ శాఖ ఏసీ కార్యాలయం కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమయ్యాయి.


పల్నాడులో ఇరుకిరుకే...!

పల్నాడు జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌ కార్యాలయం ఉన్న ఎస్సీ వసతి గృహం ఇది. నరసరావుపేటలోని కార్యాలయాల్లో వసతులు లేక ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకే పనులు పరిమితం అయ్యాయి. ఇతర కార్యాలయాలకు  నేటికీ కనీసం ఫర్నీచర్‌ కూడా సరఫరా చేయలేదు. ఇక, 10/10 అడుగుల వైశాల్యం కలిగిన గదిలో 14 మంది సిబ్బంది ఉండే  ఐ అండ్‌ పీఆర్‌ విభాగం సర్దుకుపోతోంది. జిల్లా కేంద్రంలో ఏ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారో సమాచారం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 


బాపట్లలో అందరూ పరాయి పంచనే...!

బాపట్ల జిల్లాలో చాలా కార్యాలయాలు ఇంకా పరాయి పంచనే ఉంటున్నాయి. సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ చాంబర్‌ పనులు ఇదిగో ఇలా (ఫొటో) సా...గుతునే ఉన్నాయి. స్థానిక  కళాశాల భవన సముదాయాల్లో, బాల సదనంలో, బాలికల వసతిగృహంలో తాత్కా లిక కార్యాలయాలతో పాలన నెట్టుకొ స్తున్నారు. ఏ ఒక్క కార్యాలయంలోనూ నిబంధనల మేరకు ఉండాల్సిన నిష్పత్తిలో సిబ్బంది లేకపోవడం ఇక్కడ మరో ప్రత్యేకత.


అసౌకర్యాల నడుమ అవస్థలు

ఇది పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడిన సత్యసాయు జిల్లాలోని దీనజనోద్ధరణ భవనం. ఇందులో మొత్తం 26 జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ చిన్నపాటి ఇరుకు గదులు. ఈ పరిసరాల్లో తాగునీరు, టీ, కాఫీ, భోజనం, టిఫిన్‌.. ఏవీ దొరకవు. పుట్టపర్తిలోని ఓ మూలకు ఉండే ఈ ప్రాంతానికి ఆటోలు కూడా తిరగవు. పుట్టపర్తి బస్టాండు నుంచి ఇక్కడకు అటోలో రావాలంటే రూ.వంద నుంచి రూ.150 అడుగుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ జిల్లాలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు తప్పిస్తే అన్ని ఆఫీసుల్లో అరకొర వసతులే. 


సా.....గుతున్న కొత్త భవనాల పనులు

నంద్యాలలోని ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాంగణంలో నిర్మిస్తున్న డీఆర్వో, కలెక్టరేట్‌ భవనాల పనులు సాగుతూనే ఉన్నాయి. గత వారం ఈ  భవనం పనులు పూర్తి కాకుండానే ప్రారంభించారు. పనులు పెండింగ్‌ ఉండటంతో ఉద్యోగుల తరలింపు పూర్తి స్థాయిలో జరగలేదు. జిల్లా ఏర్పడి నాలుగు నెలలు గడిచినా ఇంకా భవన నిర్మాణం, ఉద్యోగుల తరలింపు కొనసాగుతూనే ఉంది. మిగతా శాఖలన్నీ తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి.


అన్నమయ్య జిల్లాలో ఇదీ దుస్థితి

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని రాజంపేట మార్గంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ కార్యాలయాల మధ్యలో మురికినీరు ప్రవహిస్తోంది. ఇక్కడ 11 ప్రభుత్వ విభాగాల కార్యాలయాలున్నాయి. ఇదే ప్రాంగణంలో గిరిజన బాలుర వసతి గృహం కూడా ఉంది. ఈ వసతిగృహం నుంచి వచ్చే మురికినీరు కార్యాలయాల మధ్యలో వెళుతోంది. దీంతో ఈ దుర్గంధాన్ని భరించలేకున్నామని సిబ్బంది వాపోతున్నారు. 

Updated Date - 2022-08-15T08:49:41+05:30 IST