లాక్డౌన్‌లో ఉద్యోగాలు పోవ‌డంతో నాలాల క్లీనింగ్‌కు దిగిన విద్యావంతులు

ABN , First Publish Date - 2021-06-13T15:47:13+05:30 IST

ఏడాది కాలంగా దేశంలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తూ...

లాక్డౌన్‌లో ఉద్యోగాలు పోవ‌డంతో నాలాల క్లీనింగ్‌కు దిగిన విద్యావంతులు

ముంబై: ఏడాది కాలంగా దేశంలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తూ, ప్ర‌జ‌ల‌ను ఆర్ధికంగా, ఆరోగ్యప‌రంగా దెబ్బ‌తీసింది. క‌రోనా కార‌ణంగా ఉద్యోగాల‌ను కోల్పోయిన  వారి ప‌రిస్థితి దారుణంగా త‌యార‌య్యింది. ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు సంపాద‌న కోసం నాలాల‌ను శుభ్రం చేయవలసిన దుస్థితికి చేరుకున్నారు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన నిరుద్యోగులు వర్షాకాలంలో మహారాష్ట్రలోని మంబ్రా ప్రాంతంలో  నాలాలు శుభ్రం చేస్తూ క‌నిపిస్తున్నారు. త‌మ దుస్థితి గురించి వారు మీడియాతో మాట్లాడుతూ తాము నాలాల‌ను శుభ్రం చేయ‌డం ద్వారా వ‌చ్చే ఆదాయంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నామ‌న్నారు. 


మహారాష్ట్రలో డ్రెయిన్‌ల‌ను శుభ్రం చేసేప‌నిని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక‌ ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించింది. ఈ ప‌నుల్లో చాలా మంది విద్యావంతులు పాల్గొంటున్నారు. వారిలో ఒక‌రైన సమీర్ మాట్లాడుతూ తాను డబుల్ గ్రాడ్యుయేట్‌న‌ని, గత మూడు నెలలుగా ఈ కాంట్రాక్టర్ దగ్గ‌ర ప‌నిచేస్తున్నాన‌ని తెలిపారు. తాను అనేక కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించాన‌ని, అయినా క‌రోనా కార‌ణంగా ఫ‌లితం లేక‌పోయింద‌ని వాపోయాడు. ఈ విధంగా డ్రెయిన్ల‌ను శుభ్రం చేసే వారిలో అనిల్ అనే ఒక యువ‌కుడు కూడా ఉన్నాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన తాను  ఈ ప‌నిచేయ‌డానికి  ఏమాత్రం సిగ్గుపడటం లేద‌ని అనిల్ చెప్పాడు. త‌మ‌ డిగ్రీలు ఇప్పుడు ఉప‌యోగ‌ప‌డ‌టం లేద‌ని, అందుకే సంపాద‌న కోసం ఏదోఒక ప‌ని చేయాల్సి వ‌స్తున్న‌ద‌ని అన్నారు.

Updated Date - 2021-06-13T15:47:13+05:30 IST