పొత్తుల పేరుతో పార్టీలను దెబ్బతీయడం బీజేపీ నైజం: ఎన్‌సీపీ

ABN , First Publish Date - 2022-01-24T18:30:02+05:30 IST

జాతీయస్థాయిలో ఉండాలనుకున్న బీజేపీ లక్ష్యానికి తాము సహకరిస్తే ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని..

పొత్తుల పేరుతో పార్టీలను దెబ్బతీయడం బీజేపీ నైజం: ఎన్‌సీపీ

న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో ఉండాలనుకున్న బీజేపీ లక్ష్యానికి తాము సహకరిస్తే ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యాలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ నవాబ్ మాలిక్ సమర్ధించారు. ఇది పచ్చి నిజమని చెప్పారు. బీజేపీతో ఏ పార్టీలైతే పొత్తు పెట్టుకున్నాయో ఆ పార్టీలను బీజేపీనే క్రమంగా ధ్వంసం చేస్తూ వచ్చిందని ఆయన చెప్పారు. ఎవరి మతం వారికి గర్వకారణమని, అంతమాత్రాన ఇతర మతాలను ద్వేషించడం సరైనది కాదని బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని అధికార మహాకూటమిలో శివసేనతో ఎన్‌సీపీ, కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.


కాగా, దీనికి ముందు, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే 96వ జయంతి సందర్భంగా ఆదివారంనాడు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, హిందుత్వానికి అధికారం అందిచేందుకు బీజేపీతో తాము జతకట్టామని, అధికారం కోసం హిందుత్వాన్ని తాము ఎప్పుడూ వాడుకోలేదని అన్నారు. బీజేపీనే తమకు వెన్నుపోటు పొడిచిందని, ఆ పార్టీ కూటమిలో శివసేన పాతికేళ్ల కాలాన్ని వృథా చేసుకుందని చెప్పారు. మునుముందు జాతీయ స్థాయిలో శివసేన కీలక పాత్ర పోషించి తీరుతుందని అన్నారు.

Updated Date - 2022-01-24T18:30:02+05:30 IST