ప్రధాని సత్కరించడం ఆనందమే కానీ..

ABN , First Publish Date - 2022-07-07T06:30:18+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుని వారసులుగా తగిన గౌరవం ఇచ్చిన ప్రధాని మోదీ తమ కుటుంబాలకు కూడు, గూడు కల్పించేలా చర్యలు చేపడితే తమ జన్మ ధన్యమవుతుందని అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడు గాం గంటందొర మనుమడు గాం బోడి దొర తెలిపారు.

ప్రధాని సత్కరించడం ఆనందమే కానీ..
భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బోడి దొర సత్కారం పొందుతున్నప్పటి చిత్రం (ఫైల్‌)

- మా కుటుంబాలకు కూడు, గూడు కల్పించాలి

- అల్లూరి ప్రధాన అనుచరుడు గాం గంటం దొర మనుమడు గాం బోడి దొర

కొయ్యూరు, జూలై 6: స్వాతంత్య్ర సమరయోధుని వారసులుగా తగిన గౌరవం ఇచ్చిన ప్రధాని మోదీ తమ కుటుంబాలకు కూడు, గూడు కల్పించేలా చర్యలు చేపడితే తమ జన్మ ధన్యమవుతుందని అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడు గాం గంటందొర మనుమడు గాం బోడి దొర తెలిపారు. ఈ నెల 4న భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా సత్కారం పొందిన ఆయన బుధవారం తన స్వగ్రామం బట్టపణుకుల పంచాయతీ లంకవీధిలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుని వారసునిగా తనను ప్రధాని మోదీ పిలిపించి మరీ సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. అయితే గంటం దొర వారసులుగా ఉన్న తమ 11 కుటుంబాలకు ఇప్పటికీ గూడు లేదని, తమ జీవనం పూరిళ్లకే పరిమితమైందన్నారు. ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని ప్రధాని ప్రకటించడం కొంత ఊరటనిచ్చిందని తెలిపారు. ప్రధాని ప్రకటనతోనైనా తమకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తమ కుటుంబాల్లోని పిల్లలను కష్టపడి చదివించామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపడితే స్వాతంత్య్ర సమరయోధులకు మరింత గౌరవం ఇచ్చినట్టు అవుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరులైన గాం గంటందొర, మల్లుదొరలకు అల్లూరికి ఇచ్చినంతగా గౌరవ మర్యాదలు దక్కలేదన్నారు. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేతలు, అభిమానులు గంటందొర, మల్లుదొరలను విస్మరిస్తున్నారని, ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించి అల్లూరితో పాటు వారికి సమాన గౌరవం ఇవ్వాలన్నారు. ఈ విషయాలన్నీ ప్రధానికి వివరించడానికి తగిన సమయం దొరకలేదని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-07-07T06:30:18+05:30 IST