దుల్హన్‌ పథకాన్ని నిలిపివేయడం సిగ్గు చేటు

ABN , First Publish Date - 2022-06-25T05:53:13+05:30 IST

దుల్హన్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం సిగ్గు చేటు అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి అత్తార్‌జాహిద్‌హుస్సేన్‌ అన్నారు.

దుల్హన్‌ పథకాన్ని నిలిపివేయడం సిగ్గు చేటు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూన్‌ 24: దుల్హన్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం సిగ్గు చేటు అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి అత్తార్‌జాహిద్‌హుస్సేన్‌ అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దుల్హన్‌ పథకం కింద పేద ముస్లిం అమ్మాయిలు పెళ్ళిళ్లు చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో రూ.50 వేలు ఇచ్చే వారన్నారు. అయితే ఈ పథకం రూ.లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన వైఎస్‌ జగన్‌ అధికారంలో వచ్చాక రద్దు చేయడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ముస్లింలకు వ్యాపార రుణాలు, ఏటా మసీదుల మరమ్మతులకు కోసం ప్రతి జిల్లాకు రూ.2.5 కోట్ల నిధులు, విదేశాల్లో విద్యను అభ్యసించడానికి రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేవారని గుర్తుచేశారు. కొన్ని మసీదుల్లో పనిచేసే ఇమాం, మౌజమ్‌లకే పెంచిన జీతాలు ఇచ్చి వివక్షత చూపుతున్నారని విమర్శించారు. రంజాన్‌ తోఫా ఇవ్వడం లేదన్నారు. మైనార్టీలను మోసం చేసినందున మైనార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ముస్లిం మైనార్టీ నాయకులు  బనగానపల్లె పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, పూలకలాం, అల్తాఫ్‌ హుస్సేన్‌,  ఖాశీంబాబు, ఖైరాత్‌వలి, గౌండాబాబు, షబ్బీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:53:13+05:30 IST