ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-06-23T06:03:28+05:30 IST

వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని శాంతియుత ఉద్యమనేత, జిల్లా పాడి రైతు నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు పేర్కొన్నారు.

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
బంగారుపాళ్యంలో రైతులకు మద్దతు తెలుపుతున్న వెంకటాచలం నాయుడు

ఈదల వెంకటాచలం నాయుడు


చిత్తూరు సిటీ/బంగారుపాళ్యం, జూన్‌ 22: వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని శాంతియుత ఉద్యమనేత, జిల్లా పాడి రైతు నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు పేర్కొన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్న తనను పోలీసులు బలవంతంగా విరమింపజేశారని ఆరోపించారు. తోతాపురి మామిడికి కనీస మద్దతు ధర టన్నుకు రూ.20వేలు నిర్ణయించాలని నెల రోజులుగా పోరాడుతున్నామని తెలిపారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఇకనైనా సీఎం జగన్‌ స్పందించి రైతులను ఆదుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కాగా.. బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో గిట్టుబాటు ధర కోసం రైతులు చేపట్టన రిలే దీక్షలో ఈదల పాల్గొన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించకుంటే ఆమరణ నిరాహరణ దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న మార్కెట్‌ కమిటీ కార్యదర్శి గంగయ్య దీక్షా శిబిరం వద్దకొచ్చారు. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో కలెక్టర్‌ మాట్లాడారని, రెండ్రోజుల్లో న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో రైతులు దీక్ష విరమించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ సుశీలకు అందించారు. రైతులు కోదండయాదవ్‌, బూసా నాగరాజుగౌడ్‌, రమేష్‌, ఆవుల శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T06:03:28+05:30 IST