ఆందోళనలపై ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం

ABN , First Publish Date - 2022-10-08T05:55:28+05:30 IST

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ వందలాది రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం దారుణమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు పెద్దాడ సోమినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆందోళనలపై ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న సోమినాయుడు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు పెద్దాడ సోమినాయుడు 

కూర్మన్నపాలెం, అక్టోబరు 7: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ వందలాది రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం దారుణమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు పెద్దాడ సోమినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్ర వారం నాటికి 603వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలకు విలువ లేకపోతే పాలకులు ప్రజా సంక్షేమాన్ని ఏమి పట్టించుకుంటారని విమర్శించారు. దేశ ప్రజల ఓట్లతో ప్రధాని అయిన నరేంద్ర మోదీ.. అదానీ, అంబానీలకు కొమ్ముకాస్తుండడం సమంజసం కాదన్నారు. కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీ కరణ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. నాయకుడు నమ్మి సింహాద్రి మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ప్రతీ కార్మికుడు దేశ సైనికుడిలా అవిశ్రాంత పోరాటాలు చేయాలన్నారు. ఐక్య పోరాటాలతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డు కుంటామన్నారు. నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలోని హామీలను కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని, సరైన సమయంలో కేంద్రానికి బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.పరంధామయ్య, జె.రామకృష్ణ, కేఎస్‌ఎన్‌ రావు, గంధం వెంకటరావు, మస్తానప్ప, శ్రీనివాసరావు, సతన్నారాయణ, కె.జగపతిరాజు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T05:55:28+05:30 IST