‘మద్దతు’ రద్దే రైతుకు మేలు

Dec 7 2021 @ 00:38AM

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట దిగుబడులకు సరైన గిట్టుబాటు ధర ఖాయంగా లభించినప్పుడు మాత్రమే తమకు అధిక ఆదాయం సమకూరుతుందని వాళ్లు భావిస్తున్నారు. అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఉంటే ఉత్పత్తులు పెరిగిపోయి ఆర్థికవ్యవస్థకు భారమై పోవడమే కాకుండా రైతులతో సహా అందరి ఆదాయాలు తగ్గిపోతాయని ప్రభుత్వం వాదిస్తోంది. మిగులు వ్యావసాయక ఉత్పత్తులను తక్కువ ధరకే ఎగుమతి చేయడం అనివార్యమవుతుందని, దీనివల్ల ఎవరికీ ప్రయోజనముండదు కనుక ఎంఎస్‌పి వ్యవస్థను రద్దు చేయడం సహేతుకమేనని పాలకులు సమర్థించుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమెలా? 


కనీస మద్దతు ధర లభిస్తున్న వరి, గోధుమకు బదులుగా అధిక విలువ గల ప్రత్యామ్నాయ పంటల సాగుకు మళ్లేలా రైతులను ప్రోత్సహించడం ఎంఎస్‌పి సమస్యకు తొలి పరిష్కారం. మన రైతులు కేరళలో మిరియాలు; కర్ణాటకలో గంధం, పోక వృక్షాలు; మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మామిడి, ఆంధ్రలో మిరప, బిహార్‌లో తమలపాకులు మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఇవన్నీ మంచి ధర లభించే వ్యవసాయక ఉత్పత్తులు. వీటిని సాగు చేసే రైతులు సాధారణంగా కనీస మద్దతు ధరకు ఆరాటపడరు, ఆందోళన చేయరు. ప్రపంచవ్యాప్తంగా అధిక విలువ ఉన్న పంటల సాగుతో ఉన్న సౌలభ్యమిది. టునీసియాలో ఆలివ్‌లను, ఫ్రాన్స్‌లో ద్రాక్షను, నెదర్లాండ్స్‌లో తులిప్ పువ్వులను, అమెరికాలో అక్రోట్‌లను, సౌదీ అరేబియాలో ఖర్జూరాలను విరివిగా సాగు చేస్తారు. వీటన్నిటికీ అంతర్జాతీయ విపణిలో మంచి ధర లభిస్తుంది. వాటి సాగుదారులు ఎవరూ ఆదాయం విషయంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. నెదర్లాండ్స్‌లో తులిప్ పువ్వుల సాగులో వ్యవసాయ కూలీకి రోజుకు పదివేల రూపాయల ఆదాయం లభిస్తుంది. మనమూ తులిప్ పువ్వుల సాగును విరివిగా చేస్తే రైతు కూలీలకు పదివేల రూపాయల దినసరి ఆదాయం సమకూర్చడం సాధ్యమవుతుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే విభిన్న పంటలసాగు విషయంలో మనకు ఒక సహజసిద్ధమైన అనుకూలత ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శీతోష్ణ పరిస్థితులలో వైవిధ్యముంది. తులిప్ పువ్వులను దక్షిణాదిన శీతాకాలంలోనూ, ఉత్తరాదిన వేసవిలోనూ సాగు చేయవచ్చు. ఏడాది పొడుగునా వివిధ వ్యవసాయక ఉత్పత్తులను అధిక ధరకు అంతర్జాతీయ విపణిలో విక్రయించుకోగల సౌలభ్యం మనకు మాత్రమే ఉంది. ఫ్రాన్స్‌కు గానీ, నెదర్లాండ్స్‌కు గానీ ఇటువంటి అనుకూలత లేదు. 


కనీస మద్దతు ధర మూలంగా నెలకొన్న విషమ పరిస్థితికి రెండో పరిష్కారం ఇప్పటికే అమలుపరుస్తున్న నగదు బదిలీ మొత్తాలను మరింతగా పెంపొందించడం. మనదేశంలో మూడుకోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయని అంచనా. ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి 1 లక్ష రూపాయలు నగదు రూపేణా బదిలీ చేయడం ద్వారా ఆ కుటుంబాలకు మౌలిక లేదా ఆవశ్యక కనీస ఆదాయాన్ని సమకూర్చాలి.


ఇలా కనీస ఆదాయాన్ని కల్పించడం ద్వారా కనీస మద్దతు ధరల విధానాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విద్యుత్తు, నీరు, ఆహారధాన్యాలు, ఎగుమతులపై ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా రద్దు చేయాలి. ఇది జరిగినప్పుడు మార్కెట్‌లో వరి, గోధమ ధరలు తగ్గుతాయి. దీంతో రైతులు అనివార్యంగా మామిడి, తమలపాకులు మొదలైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించనప్పుడు ఆ విషయమై రైతులు ఆందోళన చెందవలసిన అవసరముండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయవలసిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే ప్రభుత్వం యావత్ రైతు కుటుంబాలకు లక్ష రూపాయల నగదును బదిలీ చేయడం ద్వారా కనీస ఆదాయాన్ని సమకూరుస్తుంది కదా. కనీస మద్దతు ధరను, సకల సబ్సిడీలను ఉపసంహరించుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 6 లక్షల కోట్లు ఆదా అవుతాయని అంచనా. ఇందులో రూ. 3 లక్షల కోట్లను ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేయవచ్చు. తమకు కనీస ఆదాయం సమకూరుతున్నందున పంట దిగుబడులకు మంచి ధర లభించకపోతే ఆందోళన చెందవలసిన అవసరం రైతులకు ఉండదు.


ఈ పరిష్కారాలను అమలుపరచడంలో తొలి అవరోధం వ్యవసాయ పరిశోధకుల నుంచే రావడం ఒక వైపరీత్యం. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధనా వ్యవస్థల అధికారులు, నిపుణులు (రీసెర్చ్ బ్యూరాక్రసీ) వ్యవసాయాభివృద్ధికి దోహదం చేసే పరిశోధనలను వినూత్న రీతుల్లో చేపట్టే విషయంలో అంతగా ఆసక్తి చూపడం లేదు. వారికి సంతృప్తికరమైన వేతనభత్యాలతో పాటు ఉద్యోగ భద్రత ఉంది. ప్రయోజనకరమైన పరిశోధన చేసినా చేయకపోయినా వారి వేతనం వారికి లభిస్తుంది. ప్రామాణికం కాని పరిశోధనా పత్రాలను అప్రమాణిక జర్నల్స్‌లో ప్రచురించడం ద్వారా తమ వృత్తి సామర్థ్యాన్ని ప్రకటించుకునే పరిశోధకులే అధికంగా ఉన్నారనేది ఒక నిష్ఠుర సత్యం. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఈ రీసెర్చ్ బ్యూరాక్రసీని పూర్తిగా ఉపసంహరించుకుని, పరిశోధనా ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధనా సంస్థలకు కాంట్రాక్ట్ పద్ధతిన ఇవ్వాలి. పరిశోధనలు అన్నీ లక్ష్య ప్రాతిపదికన జరగాలి. వివిధ పంటల సాగు తక్కువ వ్యయంతో జరిగి, రైతులకు అధిక ఆదాయం సమకూరేందుకు పరిశోధనలు దోహదం చేయాలి. అప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల రైతులకు మంచి ఆదాయం సమకూరుతుంది. 


ప్రతిపాదిత పరిష్కారాల అమలులో ఎదురయ్యే రెండో అవరోధం భారత ఆహార సంస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ. రైతులు ఉత్పత్తి చేసే ఆహారధాన్యాల కొనుగోలు, నిల్వ, రవాణా, విక్రయం మొదలైన ఆవశ్యక కార్యకలాపాల వల్లే అవి వర్థిల్లుతున్నాయి. కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఉపసంహరించుకుంటే వాటి ఉద్యోగులకు ఆదాయం కొరవడుతుంది. కనుక ప్రతిపాదిత పరిష్కారాలను రాజకీయవేత్తలు అమలుపరచకుండా వారు అడ్డుకుంటున్నారు. నిర్దిష్ట పంటల సాగు విషయంలో రైతుల డోలాయమానం ఈ పరిష్కారాల అమలుకు ఒక సమస్యను కల్పిస్తోంది. వరి, గోధుమ దిగుబడులు ఒక సంవత్సరం చాలా హెచ్చుస్థాయిలో మరుసటి సంవత్సరం చాలా తక్కువగా ఉండవచ్చు. దీని వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (భారత ఆహార సంస్థ)ను ‘పుడ్ ట్రేడింగ్ కార్పొరేషన్’గా మార్చివేయడమే పరిష్కారం. ధరలను నిలకడగా ఉంచేందుకు వివిధ పంట ఉత్పత్తుల సేకరణకు ముందుగా కాంట్రాక్టులు కుదుర్చుకోవడం ఈ సంస్థ బాధ్యతగా ఉండాలి. పరిస్థితులను బట్టి పంట ఉత్పత్తుల ఎగుమతి లేదా దిగుమతి చేసుకోవడం కూడా ఈ సంస్థ బాధ్యతగా ఉండాలి. ఇలా, సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆహారధాన్యాలను పుష్కలంగా సమకూర్చుకోవడం సాధ్యమవుతుంది.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.