ఈ గండం గడిస్తే చాలు..

ABN , First Publish Date - 2022-07-14T07:04:17+05:30 IST

ఈ గండం గడిస్తే చాలు..

ఈ గండం గడిస్తే చాలు..
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిని పరిశీలిస్తున్న రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ అనుదీప్‌

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

భద్రాద్రి వద్ద చివరి ప్రమాద హెచ్చరికను దాటిన ప్రవాహం

వరద భయంతో ఏజెన్సీ వాసుల బిక్కుబిక్కు

ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిన రాకపోకలు 

తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా హెలికాప్టర్‌ 

భద్రాచలం, జూలై 13: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద వస్తుండటంతో ఈ గండం గడిస్తే చాలు భగవంతుడా అంటూ గోదావరి పరివాహక ప్రాంత వాసులు వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 50.8అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతూ మధ్యాహ్నం 3.30గంటలకు 53అడుగులకు చేరడంతో  తుది భద్రాద్రి ఇనచార్జ్‌ సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తుది ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి 11గంటలకు  55.9 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తోంది. ఎగువనుంచి 21లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నందున గురువారం భద్రాచలం వద్ద 64అడుగుల వరకు ఉండే అవకాశం ఉందని అఽధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని నారచీరల ప్రాంతం ఐదు రోజులుగా నీట మునిగింది. భద్రాచలం ఏజెన్సీలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ అనుదీప్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు తదితరులు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్‌ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉండగా పునరావాస కేంద్రాల్లో 4,200 మంది ఆశ్రయం పొందుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చర్ల మండలంలోని వీరాపురం, దండుపేట, కొత్తపల్లి, తేగడ, మేడువాయి కాలనీ,  చీమలపాడు, పెద్దిపల్లి, దేవరపల్లి మొత్తం ఎనిమిది గ్రామాలను ఖాళీ చేయించారు. వీరికి రాళ్లగూడెం జూనియర్‌ కాలేజీ, తేగడ, జీపీపల్లి,  చీమలపాడు, సత్యనారాయణ పురం దేవరపల్లిలో  ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా, 156 కుటుంబాలు తలదాచుకున్నాయి. ఇక బూర్గంపాడు మండల పరిధిలో వరద బాధితుల కోసం ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా వంద కుటుంబాలను తరలించారు. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, కేజీబీవీ, నాగినేనిప్రోలు ప్రభుత్వ పాఠశాల, సారపాక బీపీఎల్‌ స్కూల్‌, సెయింట్‌ థెరిస్సా పాఠశాల, మోతెపట్టీనగర్‌ ప్రభుత్వ పాఠశాల, ఇరవెండి జడ్పీఎ్‌సఎ్‌సలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దుమ్ముగూడెంలో తూరుబాక, మంగవాయిబాడువ, కె.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల, ఈతానగరం, దుమ్ముగూడెం పునరావాస కేంద్రాలకు 778మంది నిర్వాసితులను తరలించారు. ముంపు మండలాల నుంచి 1530 పశువులు, 4280 మేకలు, గొర్రెలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 


తెలుగురాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిన రాకపోకలు 

గోదావరి తుదిప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి నెల్లిపాకవెళ్లే మార్గం లో పురుషోత్తపట్నం వద్ద వాహనాలను వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులపై వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా ఏపీ, తెలంగాణ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో వాహనాలు విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై నెల్లిపాక వద్ద సుమా రు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అలాగే దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు అధిక ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


ఆర్టీసీకి భారీ నష్టం

భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి భారీ నష్టమే వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇరుజిల్లాల్లో ఎనిమిది డిపోలు ఉండగా ప్రధానంగా భద్రాచలం డిపోపై వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా పడిందని ఆర్టీసీ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. భద్రాచలం డిపోలో సుమారు 28సర్వీసులను ఐదు రోజులుగా నిలిపేశారు. వెంకటాపురం మార్గంలో 20సర్వీసులు, కుంట రూట్లో మూడు, రాజమండ్రి రూట్లో నాలుగు, రేఖపల్లి రూట్లో ఒక సర్వీసు నిలిపివేశారు. 


భద్రాచలంలోనే ఉంటా : మంత్రి పువ్వాడ 

వరద ముప్పు పూర్తిగా తొలిగే వరకు తాను భద్రాచలంలోనే ఉండి వరద బాధితులకు అండగా ఉంటానని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. బుధవారం భద్రాచలం గోదావరి వారధిపై నుంచి ప్రవాహ ఉధృతిని పరిశీలించిన అనంతరం ఆయన సుభా్‌షనగర్‌ కాలనీలో వరద ముంపు బాధితులను పునరాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి ప్రజలకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి తీవ్రస్థాయిలో ఉంటే తక్షణ సహాయక చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచిందన్నారు. ఇందుకోసం ఐటీడీఏ, ఐటీసీల్లో హెలిప్యాడ్‌లను సిద్ధం చేశామన్నారు. సీఎంకేసీఆర్‌ సూచనల మేరకు పోలీసుయంత్రాంగంతో పాటు సీఆర్‌పీఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో అదనపు బలగాలను మోహరించామన్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వెంట ప్రభుత్వవిప్‌ రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డా.వినీత, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు. 


నష్టం అంచనాల్లో అధికారులు

భారీ వర్షాలతో పలుచోట్ల దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/కొత్తగూడెం,  : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన నష్టం అంచనాలను యంత్రాంగం సిద్ధం చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చడంతో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో జనజీవనం అతలాకుతలం కాగా.. కొన్ని గ్రామాల్లో వర్షానికి నానిన ఇళ్లుకూలుతున్నాయి. కారేపల్లి మండలం గుంపెళ్లగూడెంలో బానోతు దశరథ్‌ అనే వ్యక్తి ఇల్లుకూలిపోగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అలాగే ఇటీవల చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఓ పెంకుటిల్లు కూలింది. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అలాగే పలుచోట్ల పాతభవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ రహదారులు పలుచోట్ల దెబ్బతిన్నాయి. ఖమ్మం-సూర్యాపేట, ఖమ్మం-దేవరపల్లి, ఖమ్మం-ఇల్లెందు, ఖమ్మం-బోనకల్‌వైపు ఆర్‌అండ్‌బీ రహదారుల పలుచోట్ల గుంతలు పడ్డాయి. అప్రోచరోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లాడ మండలంలో దేవరపల్లి రహదారిపై భారీ గుంతలు పడ్డాయి. మరోవైపు గొల్లగూడెం-మంగాపురం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోయింది. ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు మాత్రమే దారి ఉంది. కూసుమంచి మండలంలో పోచారం-చింతలపాడు మధ్యకల్వర్టు దెబ్బతిన్నది. చాలాగ్రామాల్లో అంతర్గత రోడ్లు చిత్తడిగా మారి ప్రజల రాకపోకలకు అవరోధంగా మారాయి. ఖమ్మంకార్పొరేషనతో పాటు సత్తుపల్లి వైరా, మధిర మునిసిపాలిటీల్లోకూడా సిమెంట్‌ రోడ్లు, ఇతర బీటీరోడ్లు దెబ్బతిన్నాయి. మధిర మండలం మాటూరు వద్ద అప్రోచరోడ్డు కొట్టుకుపోయింది. రోడ్ల తక్షణ మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, మునిసిపల్‌ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇక జిల్లాలో ఇప్పటికే లక్షా55వేల ఎకరాలపైగా పత్తి వేయగా.. నల్లరేగడి, , లోతట్టు భూముల్లో వేసిన పత్తి ఎర్రబడుతోంది. ప్రస్తుతం పాక్షిక నష్టమే అయినా ఇదే తీరున వర్షాలు పడితే పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. వరినారుమళ్లను కూడా వాన నీరు చుట్టేయడంతో నారు కుళ్లిపోతోంది. జిల్లాలో 44,706 ఎకరాల్లో నారు పోయగా.. సుమారు వెయ్యి ఎకరాలమేర వరినారు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. ఇప్పటికే 525 ఎకరాల్లో వరినాట్లు వేయగా వర్షం రాకతో కొన్నిచోట్ల అవి నీటమునిగింది. కంది మిశ్రమసాగులో 339 ఎకరాలు, మొక్కజొన్న 387 ఎకరాల్లో, పెసర 2377 ఎకరాల్లో వేశారు. అయితే వర్షాలకు అక్కడక్కడ స్వల్పంగా నీరు నిలిచి పంటలు ఎర్రబారుతున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత పంటనష్టంపై వ్యవసాయశాఖ పూర్తిఅంచనాలు సిద్ధం చేయనుంది.  











Updated Date - 2022-07-14T07:04:17+05:30 IST