హిందూ పాలన గురించి రాహుల్ మాట్లాడటం మంచిదే : శివసేన

ABN , First Publish Date - 2021-12-14T22:20:34+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూ పాలన గురించి మాట్లాడటం

హిందూ పాలన గురించి రాహుల్ మాట్లాడటం మంచిదే : శివసేన

ముంబై : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూ పాలన గురించి మాట్లాడటం మంచిదేనని శివసేన మంగళవారం పేర్కొంది. శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో రాహుల్ గాంధీ ఇటీవల రాజస్థాన్‌లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘ఈ దేశం హిందువులది, హిందుత్వవాదులది కాదు’’ అని రాహుల్ చెప్పడాన్ని స్వాగతించింది. 


‘‘మహాత్మా గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాది అని రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. హిందూ అంటే సత్యం, హిందుత్వం అంటే అధికారం అని కూడా ఆయన చెప్పారు. ఈ దేశం హిందువులదనే అంశాన్ని ఆయన నొక్కివక్కాణించడం ఇక్కడ ముఖ్యమైన విషయం’’ అని ఈ సంపాదకీయం పేర్కొంది. కాంగ్రెస్ చాలా కాలం లౌకికవాదంలో చిక్కుకుందని, దీనికి నూతన మార్గాన్ని చూపించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం హిందూ సంస్క‌‌‌ృతిని అర్థం చేసుకోవడం లేదని పేర్కొంది. 


రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం కాంగ్రెస్ ఓ బహిరంగ సభను నిర్వహించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, హిందూ, హిందుత్వ మధ్య తేడాను వివరించారు. తాను హిందువునని, హిందుత్వవాదిని కానని చెప్పారు. ‘‘మీరందరూ హిందువులు. మహాత్మా గాంధీ ఓ హిందువు, కానీ నాథూరాం గాడ్సే హిందుత్వవాది’’ అని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. 


Updated Date - 2021-12-14T22:20:34+05:30 IST