చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడితే అంతకుమించినది ఇంకేముంటుంది: దినేశ్ కార్తీక్

ABN , First Publish Date - 2022-02-08T00:53:36+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే అవకాశం దక్కితే అంతకుమించినది ఏముంటుందని

చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడితే అంతకుమించినది ఇంకేముంటుంది: దినేశ్ కార్తీక్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరపున ఆడే అవకాశం దక్కితే అంతకుమించినది ఏముంటుందని టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ప్రస్తుతం తాను ఐపీఎల్ వేలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. 


2018 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం ఆడుతున్న కార్తీక్.. తన ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఏ జట్టూ తనను తీసుకోదని, కానీ ఒకవేళ తాను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడితే మాత్రం అది చాలా గొప్ప విషయమని అన్నాడు. కార్తీక్ ఇప్పటి వరకు ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కేకు మాత్రం ఆడలేదు. 


కార్తీక్ ప్రస్తుతం తన స్నేహితుడు, మెంటార్ అయిన అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ముంబై మైదానంలో చమటోడ్చుతున్నాడు. సాధారణంగా భారత వికెట్ కీపర్లకు మంచి డిమాండే ఉంది. 2019 ప్రపంచకప్ తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించని కార్తీక్ తమిళనాడు కోసం దేశవాళీ టోర్నమెంట్లపై దృష్టిసారించాడు.


అంతేకాదు, ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కార్తీక్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కార్తీక్ ఇప్పటి వరకు 213 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 4,046 పరుగులు చేశాడు. ఇందులో 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

భారత జట్టులో ప్రస్తుతం మిడిలార్డర్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో కార్తీక్‌కు ఇంకా అవకాశాలు మిగిలే ఉన్నాయి. అయితే, వయసు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. దీనిపై కార్తీక్ మాట్లాడుతూ.. ధవన్‌కు కూడా 36 సంవత్సరాలేనని, పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్, ఇటీవల రిటైరైన మహమ్మద్ హఫీజ్ వయసు దాదాపు 40 ఏళ్లని గుర్తు చేశాడు. కాబట్టి సెలక్షన్‌కు వయసు అడ్డంకి కాబోదని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-02-08T00:53:36+05:30 IST