ఈ పండగలకూ పప్పు, తీపి లేనట్లే..!

ABN , First Publish Date - 2022-09-24T06:48:21+05:30 IST

రేషన్‌ సరుకుల కేటాయింపులు ఐదు నెలలుగా సవ్యంగా సాగడం లేదు. బియ్యం మాత్రమే నెలనెలా యథావిధిగా కార్డుదారులకు పంపిణీ జరుగుతోంది.

ఈ పండగలకూ పప్పు, తీపి లేనట్లే..!

డీలర్లు డీడీ తీస్తామన్నా సరుకుల్లేవ్‌ 

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 23: రేషన్‌ సరుకుల కేటాయింపులు ఐదు నెలలుగా సవ్యంగా సాగడం లేదు. బియ్యం మాత్రమే నెలనెలా యథావిధిగా కార్డుదారులకు పంపిణీ జరుగుతోంది. కందిపప్పు, పంచదార పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వస్థాయిలోనే రేషన్‌ పంపిణీ విధివిధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి.  అక్టోబరు నెలలో సైతం దసరా, మిలాడినబీ, దీపావళి పండుగలు వస్తున్నాయి. కానీ సరుకులే లేవు. ప్రస్తుతానికి జిల్లాలో వంద టన్నుల కందిపప్పు, 50 టన్నుల పంచదార మాత్రమే నిల్వ ఉంది. 5.31 లక్షల బియ్యం కార్డులుంటే... నిల్వవున్న సరుకు దాదాపు లక్ష కార్డుదారులకే అందించేందుకు అవకాశం ఉంది. మరి మిగిలిన 4.31 లక్షల కార్డుదారుల మాటేంటి? డీడీలు కట్టేందుకు డీలర్లు ముందుకు వస్తున్నా సరుకు లేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో అందుబాటులో ఉన్నంతవరకు బియ్యంతో కలిపి అక్టోబరు నెల కోటాగా కందిపప్పు, పంచదార పంపిణీ చేసి అధికారులు చేతులెత్తేస్తున్నారు. సరుకులు లేనందువల్ల డీడీలు చెల్లించవద్దని డీలర్లకు సలహాలిస్తున్నారు. అక్టోబరునెలలో ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి. కార్డుదారులందరికీ కందిపప్పు, పంచధార పంపిణీ చేయాల్సివుండగా.. ఆ మేర ప్రణాళిక రూపొందించలేదు. గత టీడీపీ హయాంలో పండుగలప్పుడు అదనపు కోటా పంపిణీ చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో అదనపు కోటా సంగతి అటుంచితే... ఉన్న కోటాను సైతం పంపిణీ చేయలేకపోతోంది. నగదు రేషన్‌ కింద జిల్లాలో 5,31,158 రేషన్‌ కార్డులున్నాయి. వీరికి కేజి కందిపప్పు రూ.67, అరకిలో పంచదార రూ.17కు అందించాలి. ఇందుకోసం 550 టన్నుల కందిపప్పు, 270 టన్నుల పంచధార అవసరం. అయితే ప్రస్తుతం జిల్లాలో వంద టన్నుల కందిపప్పు, 50 టన్నుల పంచదార మాత్రమే నిల్వవుంది. సెప్టెంబరు నెలలో సైతం 175 టన్నుల కందిపప్పు, 137 టన్నుల పంచదార కార్డుదారులకు పంచారు. పంచదార, కందిపప్పు సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ను పిలవలేదని సమాచారం. ప్రొక్యూర్‌మెంట్‌ జరగకపోగా గతంలో సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు లక్షల రూపాయిలు  బిల్లుల బకాయిలు నెలల తరబడిగా పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రొక్యూర్‌మెంట్‌కు ఎవ్వరూ ముందుకురావడంలేదని తెలిసింది. 

ఉచితం కొనసాగిస్తారా.. లేదా? 

పేదలకు అందించే ఉచిత రేషన్‌ పంపిణీ ఈనెల 20వ తేదీతో ముగిసింది. దీనిని ఈ నెలతోనే కేంద్రం ముగుస్తుందా లేదా కొనసాగిస్తుందా అన్న సందిగ్ధం నెలకొంది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన కింద ఉచిత బియ్యం పంపిణీని 2020 మార్చి నెలలో అమల్లోకి తెచ్చింది. ఇందులో నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ) కింద 4,99,620 మంది కార్డుదారులకు ఉచితంగా 8వేల టన్నుల నాన్‌ సార్టెక్స్‌ బియ్యం అందించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూపన్ల ద్వారా ఒక్కో వ్యక్తికి 5కేజీల వంతున బియ్యం పంపిణీ జరిగింది. ఈ ఉచిత బియ్యం రాష్ట్రం ఇచ్చే నగదు రేషన్‌ కోటాకు అదనం. ఈ ఉచిత బియ్యం పంపిణీ సెప్టెంబరుతో ముగిసింది. దీనిని పొడిగిస్తే చాలా కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరి, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. 


Updated Date - 2022-09-24T06:48:21+05:30 IST