వ్యవసాయంలో ఇక విప్లవమే

ABN , First Publish Date - 2020-09-22T06:46:39+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్షకులకు బాసటగా నిలిచేలా, వారి ప్రయోజనాలకు...

వ్యవసాయంలో ఇక విప్లవమే

కనీస మద్దతు ధరను రద్దు చేయడానికే ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ చట్టాల్లో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. రైతులకు ఎంతో మేలుచేసే, ఈ ముఖ్యమైన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త చట్టాలు కనీస మద్దతు ధరను ఏమాత్రం ప్రభావితం చేయవని పార్లమెంట్‌లోనూ, వెలుపలా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ధరల వ్యవస్థ అసలు మార్పు ఉండదు. అదనంగా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనేక ఇతర ఎంపికలను కలిగి ఉంటారు. వాస్తవానికి కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు పెంచింది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్షకులకు బాసటగా నిలిచేలా, వారి ప్రయోజనాలకు కట్టుబడి వివిధ పథకాలకు రూపకల్పన చేసింది. గత పాలకుల మాదిరిగా ప్రధాని మోదీ రైతులను ప్రలోభపెట్టే ప్రకటనలు ఏమాత్రం చేయకుండా వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేయడం, రైతులను శక్తివంతం చేయడంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్నం పెట్టే రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశలో వ్యవసాయ ఉత్పత్తి, నిర్మాణం, మార్కెటింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన మూడు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు అన్యాయమైన, అహేతుకమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికి ఈ మూడు బిల్లుల్లో రెండు బిల్లులు ఉభయసభల ఆమోదం పొందాయి. వ్యవసాయ ఉత్పత్తి, వ్యాపారం వాణిజ్యం (ప్రచారం, సరళీకరణ), రైతులకు సంబంధించి (సాధికారత, రక్షణ) మద్దతు ధరపై భరోసా కల్పించే ఈ రెండు బిల్లులు రైతాంగానికి ఆర్థిక బలాన్ని సమకూర్చటమే కాకుండా, వ్యవసాయరంగ అభివృద్ధిని నిర్ధారించనున్నాయి. 

ఇందులో మొదటి బిల్లు, దళారుల బారి నుంచి దేశంలోని అన్నదాతలకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తుంది. అదే సమయంలో రైతాంగం తమ ఉత్పత్తులను కావలసిన ధరకు అమ్మే స్వేచ్ఛను కూడా వారికి కల్పిస్తుంది. ఈ బిల్లు తీసుకురావడానికి ముందు రైతులు ప్రధానంగా నాలుగు పరిమితులను ఎదుర్కోవలసి వచ్చేది. వారు పండించే పంటలు కేవలం స్థానిక మార్కెట్‌కు మాత్రమే పరిమితం అయ్యేవి. కొనుగోలుదారులు సైతం పరిమితంగా ఉండేవారు. మౌలిక సదుపాయాల కొరత చాలా ఎక్కువగా ఉండడంతో పాటు, వారి పంటకు లభించే ధర విషయంలో ఎలాంటి పారదర్శకత లేదు. ఇలాంటి అవరోధాల కారణంగా, గిట్టుబాటు ధర లభించడం కోసం రైతులు తమ పంటను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. మార్కెట్లలో పొడవైన క్యూల్లో నిలబడి ఎదురుచూడాల్సి వచ్చేది. పంట వేలంలో ఆలస్యం, జరిగేది స్థానిక మాఫియా ఆగడాలను ఎదుర్కోవలసి వచ్చేది. 

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఈ బిల్లు చట్టంగా రూపాంతరం చెందిన తరువాత, రైతులకు కొత్త బిల్లు నాలుగు సవాళ్ళ నుంచి విముక్తి లభిస్తుంది. తద్వారా జాతీయ స్థాయిలో తమ పంట అమ్ముకోవడానికి రైతాంగానికి అవకాశాలు లభిస్తాయి. ఇన్నేళ్ళుగా దళారుల చేతిలో నలిగిపోయిన వారికి ఇకపై ఆ సంకెళ్ళు వీడనున్నాయి. రైతులు ఇకమీదట తమ వ్యవసాయక్షేత్రం వద్దే పంటను విక్రయించుకోవడం ద్వారా ఇప్పటివరకూ అనవసరంగా మోస్తున్న రవాణా ఖర్చుల భారం నుంచి విముక్తి పొందుతారు. తమ ఉత్పత్తులను నిల్వ చేసుకొని సరైన సమయంలో విక్రయించుకోగలిగే అవకాశాన్ని వారికి ఈ వ్యవసాయ బిల్లులు కల్పించబోతున్నాయి. ఇప్పుడు ‘ఒక దేశం ఒక మార్కెట్’ అనే మనందరి కల సాకారం కానుంది. 

ఇక రెండో బిల్లు విత్తన స్థాయిలోనే మార్కెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇకపై పంట ఉత్పత్తి సమయంలో ఎదురయ్యే సమస్యలతోపాటు, పంటకు లభించే ధరతో ముడిపడిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులే ప్రారంభించుకోవచ్చు. ఇందులో భాగంగా వారు వ్యవసాయ వాణిజ్య సంస్థలు, టోకు వ్యాపారులు, పెద్ద చిల్లర వ్యాపారులు, ఎగుమతిదారులతో కాంట్రాక్ట్ వ్యవసాయం చేయగలుగుతారు. రుణ సదుపాయాలు, సాంకేతిక సహాయం, విత్తనాల లభ్యత, పంట బీమా కాంట్రాక్టు రైతులకు అందుబాటులో ఉండనున్నాయి. వాస్తవానికి, వ్యవసాయరంగంలో తగినంతగా పెట్టుబడులు వచ్చే వరకు దేశీయ రైతుల ప్రయోజనాలను పూర్తిగా నిర్ధారించలేని పరిస్థితి ఉంటుంది. 

ఇప్పటి వరకు అమలులో ఉన్న చట్టపరమైన ఆంక్షలు ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అడ్డుకట్ట వేశాయి. ఇప్పుడీ కొత్త చట్టాల ద్వారా ఆ అవరోధాలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యవసాయరంగంలో ప్రైవేటు పెట్టుబడులు పంటల నిల్వ, రవాణా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తాయి. దీనివల్ల దేశంలోని రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ఫలితంగా వాణిజ్య పంటలు వేయటం ద్వారా వ్యవసాయ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాగుచేయడం ద్వారా ఆదాయాన్ని అనేక రెట్లు పెంచుకోగలుగుతారు. ఈ రెండు బిల్లులు వ్యవసాయరంగాన్ని, రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ అన్ని విధాలుగా లాభం చేకూర్చేలా ఉన్నాయని, ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయనేది సుస్పష్టం. రైతుల యాజమాన్య హక్కులను, వ్యవసాయ హక్కును సవాలు చేయకుండా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయని విషయాన్ని గమనించడం చాలా ముఖ్యం. 

దశాబ్దాలుగా రైతాంగం ఓట్లు దండుకున్న ప్రతిపక్షాలు వారిని అంధకారంలోనే ఉంచి పేదరికంలో మగ్గేలా చేశాయి. అందుకే ఈ రోజు ఈ మార్పు వారికి నచ్చడం లేదు. ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పును గల్లీ నుంచి పార్లమెంటు వరకు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లులు ఆమోదించినప్పుడు రాజ్యసభలో వారి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ మర్యాదకు భంగం కలిగించింది. అది వారి వక్రదృష్టిని బహిర్గతం చేసింది.

ప్రభుత్వం కనీస మద్దతు ధరను రద్దు చేయడానికే ఈ బిల్లులు తెచ్చిందని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ చట్టాల్లో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. ఈ రకమైన గందరగోళాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడం ద్వారా, రైతులకు ఎంతో మేలుచేసే, ఈ ముఖ్యమైన నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్లను రెచ్చగొట్టాలనుకుంటున్నారు. బిల్లులు కనీస మద్దతు ధరను ఏమాత్రం ప్రభావితం చేయవని సభలోనూ, సభ వెలుపల ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ధరల వ్యవస్థ అసలు మారదు. అదనంగా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనేక ఇతర ఎంపికలను కలిగి ఉంటారు. వాస్తవానికి మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచే పనిని ప్రభుత్వం చేసింది. దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న పార్టీలు–2006 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచిన స్వామినాథన్ కమిషన్ సిఫారసులను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ ధరను పొందుతున్నారని మర్చిపోతున్నాయి. 2013-–14లో క్వింటాల్‌కు రూ.1310, రూ.1400 ఎంఎస్‌పి అందుకున్న వరి, గోధుమ రైతులు ఈ రోజు రూ.1868, రూ.1925 అందుకుంటున్నారు.

రైతాంగ సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, లాభం పొందుతూ ఇన్నాళ్లుగా రాజకీయాలు చేసిన ఇలాంటి పార్టీలు ప్రతిపక్షంలో చాలా ఉన్నాయి. వాటికి రైతుల ఓట్లు కావాలి కానీ అవి వారి ప్రయోజనాల కోసం ఎన్నడూ సమర్థమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి ఇచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదాన్ని అనుసరించి, గత ఆరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. మోదీ ప్రధాని అయ్యాక దేశ వ్యవసాయ బడ్జెట్ 35.6శాతం పెరగడంతో పాటు, 16.38 కోట్లమంది రైతులకు ఆరోగ్య కార్డులు లభించాయి. మైక్రో ఇరిగేషన్ 39.4శాతం, వ్యవసాయ యాంత్రీకరణ బడ్జెట్ 1248 రెట్లు పెరిగాయి. వ్యవసాయ రుణాల్లో 57శాతం పెరుగుదల ఉంది. అంతేగాక వ్యవసాయ రుణ మాఫీ 150శాతం పెరిగింది. దాంతో ప్రస్తుత ప్రభుత్వహయాంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 7.29శాతం, హార్టికల్చర్ 12.4శాతం, పప్పుధాన్యాలు 20.65శాతం పెరిగాయి.

ఇవే కాకుండా పంటల బీమా వంటి పథకంతో మోదీ సర్కార్‌ రైతులు పండించిన పంటలకు రక్షణ కల్పించింది. బీమా చేసిన రైతుల సంఖ్య 6.66 కోట్ల నుంచి 13.26 కోట్లకు పెరిగింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, రైతులకు రక్షణ కల్పించడమే కాకుండా, వారికి ప్రత్యక్ష సహాయం అందించడానికి మోదీ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజనలే దీనికి ప్రధాన ఉదాహరణలు. అనేక ప్రయోజనాల రూపంలో ఇప్పటివరకు 93 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. లాక్‌డౌన్‌ కాలంలో రైతులకు సహాయం చేయడానికి సుమారు 22వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇప్పటికి 19.9 లక్షల మంది రైతులు పింఛను పథకం కింద నమోదు చేసుకున్నారు. 

ఈ నిర్ణయాలకు అదనంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిలో భాగంగా లక్ష కోట్ల రూపాయలతో కొత్తగా జాతీయ ఫైనాన్సింగ్ పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం రైతులు, పారిశ్రామికవేత్తలకు; ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలు, రైతు ఉత్పత్తి సంస్థలకు ఎంతగానో ఉపకరిస్తుంది. వ్యవసాయరంగ ఆస్తులను పరిపుష్ఠం చేయడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి దోహద పడుతుంది. వ్యవసాయరంగంపై మన ప్రధానికి ఉన్న దూరదృష్టిని, జాతీయ సమగ్రతను కాపాడే విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

‘ఈ భూమిపై రొమ్ము విరుచుకొని నడిచే హక్కు ఎవరికైనా ఉందంటే అది కేవలం హలం పట్టి పొలం దున్ని దేశ ప్రజల క్షుద్బాధను తీర్చి, దేశ సంపదను సృష్టించే రైతన్నకే ఉంటుంది’ అని సర్దార్ పటేల్ చెప్పేవారు. ఈ హక్కును రైతులకు కల్పించే దిశలో ప్రధాని మోదీ పయనించడాన్ని, అందులో భాగంగా రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుండడాన్ని నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. రైతుల సంక్షేమం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నాకు పూర్తి నమ్మకం ఉంది. వీటి ఫలితాలు త్వరలోనే కనుల ముందు నిలువనున్నాయి. దేశం ఆత్మనిర్భర్‌ దిశలో పయనిస్తున్న ఈ తరుణంలో దేశ రైతాంగాన్ని అన్ని విధాలుగా సాధికారపరచడంలో మేము ఖచ్చితంగా విజయాన్ని సాధించి దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతామనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను.


అమిత్‌ షా

(కేంద్ర హోం మంత్రి)

Updated Date - 2020-09-22T06:46:39+05:30 IST