వానొస్తోంది..విత్తనమేదీ?

ABN , First Publish Date - 2022-06-29T08:37:59+05:30 IST

వానొస్తోంది..విత్తనమేదీ?

వానొస్తోంది..విత్తనమేదీ?

ఖరీఫ్‌ సీజన్‌లో పూర్తిగా జరగని పంపిణీ 

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. అయితే, రాష్ట్రంలో సగం మందికి కూడా రాయితీ విత్తనాలు అందలేదు. కాలువల కింద వరి పండించే ప్రాంతాల్లోనూ పూర్తి కాలేదు. ఈ-సీడ్‌ పోర్టల్‌ సమాచారం ప్రకారం 8.10 లక్షల మంది రైతులకు వివిధ రకాల విత్తనాలు 4.37 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. మంగళవారం సాయంత్రానికి 4.25 లక్షల మందికి 2.55 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే పంపిణీ చేశారు.



(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ఆలస్యమవుతోంది. కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడం, రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో రాయితీ విత్తనాలు అందకపోవడం దీనికి కారణాలు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటం, మరో వారంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో చాలా మండలాల్లో పూర్తి స్థాయిలో విత్తన పంపిణీ జరగడం లేదని రైతులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో అనకాపల్లి మండలంలో 1,200 క్వింటాళ్లకు పైగా వరి వంగడాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఇద్దరు రైతులకు మాత్రమే ఐదు బస్తాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి అన్ని జిల్లాల్లో నెలకొంది. సాంకేతిక, రవాణా సమస్యల వల్ల కొన్ని మండలాలకు విత్తన సరఫరాలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతులు విత్తనాల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ-సీడ్‌ పోర్టల్‌ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8.10 లక్షల మంది రైతులకు వివిధ రకాల విత్తనాలు 4.37 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. మంగళవారం సాయంత్రం వరకు 4.25 లక్షల మంది రైతులకు 2.55 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందించారు. విత్తనాలు అవసరమైన రైతుల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు డీ క్రిషి యాప్‌ ద్వారా నమోదు చేసి, ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో లేదా నగదు రూపంలో సొమ్ము వసూలు చేస్తున్నారు. రాయితీ, రాయితీయేతర విత్తనాలు ఏవైనా సర్టిఫై చేశాక ఏపీ సీడ్స్‌ ద్వారా ఆర్బీకేల్లో సరఫరా చేస్తున్నారు. అయితే అత్యధిక ఆర్బీకేల్లో నిల్వ సౌకర్యం లేకపోవడం వల్ల ఏ రోజు నమోదు చేసుకున్న రైతులకు ఆ రోజు విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు. యాప్‌లో నమోదైన రైతుల ఇండెంట్‌ ప్రకారం ఏపీ సీడ్స్‌ నుంచి విత్తనాలు పంపుతున్నారు. దీంతో కనీసం మూడురోజుల సమయం పడుతోందని అంటున్నారు. పైగా యాప్‌లో నమోదు చేసుకున్న రైతులు ఆర్బీకేల నుంచి ఫోన్‌ మెసేజ్‌ వచ్చే దాకా వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో అతృత ఉన్న రైతులు ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్బీకేల పరిధిలో ఏయే పంటలు ఎక్కువగా సాగు చేస్తారో వాటి విత్తనాలనే ఇస్తున్నారు.  


బయట మార్కెట్‌లో కొనుగోళ్లు.. 

ఆర్బీకేల్లో ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే విత్తనాలు అమ్ముతున్నా.. అదనంగా విత్తనాలు అవసరమయ్యే రైతులు అధిక ధర వెచ్చించి బయట మార్కెట్‌లో కొనుగోలు చేయక తప్పడం లేదు. రైతులు కోరినంత పత్తి, మిర్చి విత్తనాలు ఆర్బీకేల్లో ఇవ్వకపోవడంతో  బహిరంగ మార్కెట్‌లో అధిక ధర చెల్లించి తీసుకోవాల్సి వస్తోంది. పలు జిల్లాల్లో పచ్చిరొట్ట విత్తనాలు.. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృ ష్ణా జిల్లాల్లో వరి, పచ్చిరొట్ట విత్తనాలు ఇస్తున్నారు. మినీకిట్స్‌, లోకల్‌ వెరైటీలు, వ్యవసాయ వర్సిటీ సిఫా ర్సు చేసిన వరి, వేరుశనగ, పచ్చి రొట్ట పైర్లకు అవసరమైన పిల్లిపెసర, జీలుగ వంటి విత్తనాలు ఇస్తున్నారు. 


14 జిల్లాల్లో తక్కువ వర్షాలు 

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటి వరకు 87.4 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 94.7 మి.మీ. కురిసింది. అయితే, నైరుతి రుతుపవనాల విస్తరణలో జాప్యంతో 14 జిల్లాల్లో తక్కువ వర్షాలు పడ్డాయి. మన్యం, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వానలోటు నెలకొంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షం పడింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూ ర్పు, పశ్చిమగోదావరి, అనంతపురం, అన్నమయ్య, చి త్తూరు జిల్లాల్లో సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షం కురిసింది. కాకినాడ, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు ఆల స్యం కావడం, తక్కువగా కురవడం వల్ల ఇప్పటికీ దుక్కులు దున్నడం పూర్తి కాలేదు. 


ఈసారి సాగు ఆలస్యం

రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 40.75 లక్షల ఎకరాల్లో సార్వా వరి సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 30 వేల ఎకరాలు, తిరుపతి జిల్లాలో 25 వేల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చినట్లు చెబుతోంది. కానీ ప్రధానంగా వరి పండించే తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూ రు జిల్లాల్లో కొద్దిగా నారుమళ్లు పోశారు. ఇక కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నామమాత్రంగా కూడా నారుమళ్లు పోయలేదు. దీంతో సార్వా సాగు 3 శాతం కూడా దాటలేదు. వేసవిలో దుక్కులు సిద్ధం చేసి, తొలకరి జల్లులు పడ్డ మెట్ట ప్రాంతాల్లో నువ్వు, జనుము, పిల్లిపెసర, జీలుగ వంటి విత్తనాలు వేస్తున్నారు. రాయలసీమలో వేరుశనగ, కో స్తాలో అపరాల పంటలు నామమాత్రంగా వేశారు. రా ష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు లక్ష్యం 96.42 లక్షల ఎకరా లు కాగా.. ఇప్పటి వరకు 4 శాతం విస్తీర్ణంలో కూడా విత్తనం పడలేదు. మరో వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉంది.

Updated Date - 2022-06-29T08:37:59+05:30 IST