Bihar Gunda వ్యాఖ్యలు బాధాకరం: తేజస్వీ యాదవ్

ABN , First Publish Date - 2021-07-31T00:33:11+05:30 IST

భారతీయ జనతా పార్టీ ఎంపీ నిశికాంత్ దూబే ‘బిహార్ గూండా’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా వ్యాఖ్యానించారంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు.

Bihar Gunda వ్యాఖ్యలు బాధాకరం: తేజస్వీ యాదవ్

పాట్నా: భారతీయ జనతా పార్టీ ఎంపీ నిశికాంత్ దూబే ‘బిహార్ గూండా’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా వ్యాఖ్యానించారంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఆ వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా బాధాకరమే. ఏదైనా వ్యాఖ్య చేసే ముందు ఏం మాట్లాడుతున్నామో ఓసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యల్ని నేను ఎప్పటికీ ఖండిస్తాను’’ అని శుక్రవారం మీడియాతో తేజస్వీ అన్నారు. ‘‘ప్రజాస్వామ్యానికి బిహార్ తల్లిలాంటిది. బిహార్ చరిత్ర కూడా గొప్పది. అసమానమైన వ్యాఖ్యలు తగవు. అయితే ఇవి పూర్తిగా వ్యక్తిగతమైన వ్యాఖ్యలు. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు తగవు’’ అని ఆయన అన్నారు.


గురువారం లోక్‌సభలో నిశికాంత్ దూబే మాట్లాడుతూ ‘‘సభలో ఉన్న సభ్యులందరినీ ఓసారి నావైపుకు తిప్పుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే 13 ఏళ్లుగా ఎంపీగా ఉన్నాను. కానీ ఎప్పుడూ ఇలాంటిది ఎదుర్కోలేదు. పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక మహిళ నన్ను ‘బిహార్ గూండా’ అంటూ తిట్టారు. ఆమె త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. నన్ను అలా ఎందుకు తిట్టారో అర్థం కాలేదు. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడమే మా తప్పా కూలీల్లాగా పని చేయడమే మా తప్పా? హిందీ మాట్లాడే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల వారు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు. ఎందుకంటే మేము రాముడి నుంచి పాఠాలు నేర్చుకున్నవాళ్లం’’ అని అన్నారు.


కాగా, ఈ విషయమై మహువా మోయిత్రా స్పందిస్తూ.. ‘‘సమావేశానికి రాని వారిని నేనెట్లా తిడతాను? ఇదేం విచిత్రం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు అసలు ఆ సమావేశానికే హాజరు కాలేదు. కావాల్సి ఉంటే అటెండెన్స్ షీట్ ఓసారి చెక్ చేయండి’’ అని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

Updated Date - 2021-07-31T00:33:11+05:30 IST