ముఖ్యమంత్రిగా ఓ మహిళ ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు సిగ్గు చేటు : టీఎంసీ ఎంపీ

ABN , First Publish Date - 2022-04-14T23:13:31+05:30 IST

మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై

ముఖ్యమంత్రిగా ఓ మహిళ ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు సిగ్గు చేటు : టీఎంసీ ఎంపీ

కోల్‌కతా : ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు జరగడం సిగ్గుచేటు అని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. మహిళలపై నేరాలు జరుగుతుండటం పట్ల అందరికీ ఆవేదన ఉందని చెప్పారు. దీనికి కారణం మీడియా అని తాను చెప్పలేనన్నారు. మహిళలపై నేరాలను మనం ఎంత మాత్రం సహించకూడదని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 


ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై నేరం జరిగితే, మనందరికీ సిగ్గుచేటేనని చెప్పారు. ఈ యథార్థాన్ని పోలీసులు, అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నాదియా జిల్లా, హన్స్‌ఖలీలో పద్నాలుగేళ్ళ మైనర్ బాలికపై ఈ నెల 4న  సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సౌగత రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అనే విషయం తెలిసిందే. 


మమత బెనర్జీ ఏప్రిల్ 11న మాట్లాడుతూ, ‘‘అత్యాచారం జరిగినందువల్ల ఓ మైనర్ బాలిక మరణించిందని వాళ్లు చూపిస్తున్నారు. దానిని అత్యాచారం అంటారా? ఆమె గర్భవతా? లేదంటే ప్రేమ వ్యవహారమా? వాళ్ళు విచారణ జరిపారా? నేను పోలీసులను అడిగాను. వాళ్ళు అరెస్టులు చేశారు. ఆ అబ్బాయితో ఆమెకు అఫైర్ ఉందని చెప్పారు. ఇది ప్రేమ వ్యవహారమని, ఆ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలుసునని చెప్పారు. ఓ జంట బాంధవ్యంలో ఉంటే, నేను ఆపగలనా? ఇది ఉత్తర ప్రదేశ్ కాదు. మనం లవ్ జీహాద్ చేయబోం. ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. అయితే ఏమైనా తప్పులు జరిగితే, పోలీసులు దోషులను అరెస్టు చేస్తారు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు’’ అని తెలిపారు. 


తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఏప్రిల్ నాలుగున బ్రజగోపాల్ గయలి పుట్టిన రోజు పార్టీకి హాజరైనపుడు సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ మర్నాడు ఆమె తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతదేహానికి తమ అనుమతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారని ఆరోపించారు. ఏప్రిల్ 10న బ్రజ్‌గోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఓ టీఎంసీ నేత కుమారుడు. ఈ దారుణంపై నిజనిర్ధరణ కోసం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. 


Updated Date - 2022-04-14T23:13:31+05:30 IST