అక్కడ కట్నంగా విషపూరిత పాములు ఇవ్వాలట.. తర్వాత పెళ్లికొడుకు వాటితో చేసే పనులు చూస్తే.. షాక్ అవుతారు..

ABN , First Publish Date - 2021-11-22T02:03:37+05:30 IST

ఎక్కడా లేని విధంగా మధ్యప్రదేశ్‌లో పెళ్లిళ్ల సమయంలో అల్లుడికి అత్యంత విషపూరితమైన సర్పాలను కట్నంగా ఇస్తారట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం.. వివరాల్లోకి వెళితే..

అక్కడ కట్నంగా విషపూరిత పాములు ఇవ్వాలట.. తర్వాత పెళ్లికొడుకు వాటితో చేసే పనులు చూస్తే.. షాక్ అవుతారు..

మామూలుగా పెళ్లికి ముందు ఆడపిల్ల తల్లిదండ్రులు నగదు, నగలు లేదా భూముల రూపంలో కట్నాలు ఇస్తుంటారు. ఇది నేరమని తెలిసినా లోలోపల సాధారణంగా జరిగే తంతుగా మారిపోయింది. కట్నం విషయంలో తేడాలొచ్చి ఒక్కోసారి పెళ్లిళ్లే ఆగిపోతుంటాయి. కట్నం ఎక్కువ తీసుకున్న సందర్భాల్లో.. బంధువుల ముందు గొప్పలకు పోవడం చూస్తుంటాం. సంప్రదాయాలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. అయితే ఎక్కడా లేని విధంగా మధ్యప్రదేశ్‌లో పెళ్లిళ్ల సమయంలో అల్లుడికి అత్యంత విషపూరితమైన సర్పాలను కట్నంగా ఇస్తారట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం.. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌‌లో గౌరియా అనే వర్గానికి చెందిన ప్రజల్లో వింత ఆచారం ఉంది. ఆడపిల్లలకు వివాహాలు చేసే సందర్భాల్లో డబ్బులు గానీ, బంగారం కానీ ఇవ్వరు. అత్తింటి వారు కూడా ఈ విషయంలో ఎలాంటి నింబంధనలూ పెట్టరట. అయితే ఆడపిల్ల వారు మాత్రం కాదనకుండా 21 అత్యంత విషపూరితమైన పాములను పట్టిస్తారు. తరతరాలుగా అది వాళ్లకు సంప్రదాయంగా వస్తోందట. వాటిని అక్కడ.. నగలు, నగదు ఇవ్వడం కంటే ఇంకా గొప్పగా భావిస్తారట. అలా పాములను ఇవ్వకపోతే కూతురు సంసారం నాశనమవుతుందని నమ్ముతారు. కూతురి పెళ్లి నిశ్చయమైన వెంటనే యువతి తండ్రి.. పాములు పట్టే పనిలో ఉంటాడట. గోధుమ రంగు పాములను ఇచ్చేవారు.. బంధువుల ముందు గొప్పగా చెప్పుకొంటారట.


పెళ్లి తర్వాత అదే పాములను ఆడించుకుంటూ డబ్బులు సంపాదించి.. కుటుంబాలను పోషిస్తారట. ఇక్కడ మరో సంప్రదాయం కూడా ఉంది. అత్తగారు ఇచ్చిన పాముల్లో ఏదైనా పొరపాటున చనిపోతే.. ఆ కుటుంబం మొత్తం గుండు కొట్టించుకోవాలట. తర్వాత ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టించాలని నియమం పెట్టుకున్నారు. అక్కడి పిల్లలకు కూడా పాములంటే అసలు భయం ఉండదట. సాటి పిల్లలతో ఆడుకున్నట్లు.. రోజూ వాటితో ఆడుకుంటూ ఉంటారట.

Updated Date - 2021-11-22T02:03:37+05:30 IST