ఒక్కరు మరణించినా మీదే బాధ్యత!

ABN , First Publish Date - 2021-06-23T08:11:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరీక్షల కారణంగా ఒక్కరు మరణించినా రాష్ట్రప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేస్తామని హెచ్చరించింది

ఒక్కరు మరణించినా మీదే బాధ్యత!

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలపై రాష్ట్రానికి సుప్రీం హెచ్చరిక

జూలైలో టెన్త్‌ పరీక్షలు పెట్టలేకపోతే పరిస్థితేంటి?

ఇతర రాష్ట్రాల్లా ఇప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకోలేరు?

చివరి నిమిషంలో రద్దు తగదు

నిర్ణయంలో జాప్యం చేయొద్దు

పిల్లల్ని అనిశ్చితికి గురిచేయొద్దు

రెండ్రోజుల్లో అఫిడవిట్‌ వేయండి

సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం

సుప్రీం నిర్ణయం అమలుకు సిద్ధం: సురేశ్‌


  • జూలైలో పరీక్షలు నిర్వహించలేకపోతే పరిస్థితి ఏంటి..? ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇప్పుడే నిర్ణయం ఎందుకు తీసుకోలేరు..?
  • చివరి నిమిషంలో పరీక్షల రద్దు ఉండకూడదు. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయకూడదు. విద్యార్థులను అనిశ్చితికి గురిచేయొద్దు.

- సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరీక్షల కారణంగా ఒక్కరు మరణించినా రాష్ట్రప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేస్తామని హెచ్చరించింది. సీబీఎ్‌సఈతో పాటు పలు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయంపై ఆరా తీసింది. పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిశ్చయించిందని.. అయితే ఎప్పుడు జరపాలన్న విషయమై నిర్ణయాన్ని జూలై మొదటివారానికి వాయిదా వేసిందని ప్రభుత్వ న్యాయవాది మహ్‌ఫూజ్‌ నజ్కీ తెలిపారు.


కరోనా ప్రొటొకాల్స్‌ను పాటిస్తూ పరీక్షలపై ముందుకెళ్తామని చెప్పారు. పదో తరగతి పరీక్షలు గ్రేడ్‌ల ఆధారంగా ఉన్నందున వాటి మార్కులను మదింపు చేయలేమని, అందుకే జూలైలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘జూలైలో పరీక్షలు నిర్వహించకలేకపోతే పరిస్థితి ఏంటి? ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇప్పుడే నిర్ణయం ఎందుకు తీసుకోలేరు’ అని ప్రశ్నించింది. రాష్ట్రంలో విద్యార్థులెందరున్నారని అడిగింది. దాదాపు 5 లక్షల మంది ఉన్నారని.. పరీక్షల సందర్భంగా గరిష్ఠంగా 15-20 మందికి ఓ ఎగ్జామ్‌ హాల్‌ కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోందని నజ్కీ వివరించారు. ‘పరీక్షల నిర్వహణపై మీకు ఎక్కువ పట్టుదల ఉంటే మీ కారణాలు కూడా చెప్పండి’ అని ధర్మాసనం సూచించింది. పరీక్షలపై నిర్ణయం తీసుకుని రెండ్రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.  విచారణను గురువారానికి(24వ తేదీ) వాయిదా వేసింది.


సుప్రీం నిర్ణయం అమలుకు సిద్ధం: మంత్రి సురేశ్‌

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఏ నిర్ణ యం తీసుకున్నా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వి ద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ విషయమై సుప్రీంకోర్టు రాష్ట్రం మీద ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని ఓ వీడియో సం దేశంలో తెలిపారు. సుప్రీంకోర్టులో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై మంగళవారం వాదనలు జరిగాయని, పరీక్షలు ఎందుకు నిర్వహించదలిచారో చెప్పాలని కోర్టు అడిగిందని.. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఎలా జరిపేదీ తాము తెలియజేశామని చెప్పారు.  



Updated Date - 2021-06-23T08:11:52+05:30 IST