ఏడాదిలో 1.50 లక్షల ఐటీ కొలువులు!

ABN , First Publish Date - 2022-06-02T09:53:02+05:30 IST

హైదరాబాద్‌/సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం ఉన్నప్పటికీ గత ఏడాది ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 2021-22 ఆర్థిక

ఏడాదిలో 1.50 లక్షల ఐటీ కొలువులు!

దేశవ్యాప్తంగా కొత్త ఉద్యోగాల్లో మూడో వంతు హైదరాబాద్‌లోనే

- 2021-22లో రూ.1.83 లక్షల కోట్ల ఎగుమతులు

- దేశంలో ఐటీ వృద్ధి 17 శాతం 

- తెలంగాణలో మాత్రం 26.14 శాతం: కేటీఆర్‌

-       2021-22 వార్షిక నివేదిక విడుదల

హైదరాబాద్‌/సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం ఉన్నప్పటికీ గత ఏడాది ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, అనుబంధ రంగాల ఎగుమతులు రూ.1,83,569 కోట్లకు చేరాయని తెలిపారు. 2021లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తే.. అందులో మూడో వంతు (1.5 లక్షల) ఉద్యోగాలు ఒక్క హైదరాబాద్‌లోనే వచ్చాయని వివరించారు. హైటెక్‌సిటీలోని మహీంద్ర లెర్నిం గ్‌ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోల్‌ రెఫ్‌మెన్‌, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్టీపీఐ) తెలంగాణ డైరెక్టర్‌ రాంప్రసాద్‌, టీఎ్‌సఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఏడాదికాలంలో ఐటీ శాఖ సాధించిన ప్రగతిని కేటీఆర్‌ వివరించారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధి 17ు ఉండగా.. కరోనా సమస్య ఉన్నప్పటికీ తెలంగాణలో 26.14ు వృద్ధి రేటు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే 2020-21లో ఐటీ, అనుబంధ రంగా ల్లో మొత్తం ఉద్యోగాలు 6,28,615 ఉండగా, 2021-22లో ఆ సంఖ్య 7,78,121కి చేరిందని చెప్పారు. ఏడాదిలో 23.78ు వృద్ధిరేటుతో ఐటీలో కొత్తగా 1,49,506 ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీఐఆర్‌ అంచనా ప్రకారం రాష్ట్రం 2035 నాటికి 2.09 లక్షల కోట్ల ఎగుమతులు సాధిస్తుందని పేర్కొనగా.. ఐటీఐఆర్‌ లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఇదే వృద్ధిరేటును నమోదు చేస్తే 2025 నాటికే 2.09 లక్షల కోట్లను సాధిస్తుందని చెప్పారు. ప్రభు త్వ కార్యాలయాలతో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించేందుకు ఉద్దేశించిన టి-ఫైబర్‌ పథకం ఈ ఏడాదిలో పూర్తవుతుందని ఆయన తెలిపారు.  

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ.. 

వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే టెక్‌ మహీంద్రా, సాఫ్ట్‌పాత్‌, క్వాడ్రంట్‌ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించగా.. వరంగల్‌లో త్వరలో జెన్‌ప్యాక్ట్‌, మైండ్‌                                                ట్రీ సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌లో 50 వేల చదరపు అడుగుల్లో, మహబూబ్‌నగర్‌లో 60 వేల చదరపు అడుగుల్లో, సిద్దిపేటలో 1.21 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు కల్లా వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నైపుణ్యాబివృద్ధి శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది మొత్తం 1.07 లక్షల విద్యార్థులకు శిక్షణ అందించినట్లు వివరించారు. 129 జాబ్‌మేళాల ద్వారా 6213 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.

పాక్‌తో కాదు.. అమెరికాతో పోటీ పెట్టుకోవాలి: కేటీఆర్‌

అభివృద్ధిలో అమెరికా, చైనాతో పోటీపడాలి కానీ పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌తో కాదని కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికైనా హలాల్‌, హిజాబ్‌ లాంటి వివాదాలు కాకుం డా ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణలో గడిచిన 8 ఏళ్లలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. బుధవారం ఆయన గచ్చిబౌలిలో ఆటోమొబైల్‌ డిజైనింగ్‌ సంస్థ జెడ్‌ఎఫ్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ సంస్థల ఏర్పాటు, అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు, నిపుణులైన మానవ వనరులు, ప్రశాంత వాతావరణం అంతర్జాతీయ ఐటీ సంస్థలను ఆకర్షిస్తున్నాయని ఆయన చెప్పారు. జడ్‌ఎఫ్‌ ఇండియా హెడ్‌ కేవీ సురేశ్‌ మాట్లాడుతూ.. 2007లో ప్రారంభించిన తమ సంస్థలో ప్రస్తుతం 2900 మంది ఉద్యోగులున్నారని, రెండేళ్లలో మరో 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు.  

సంవత్సరం ఎగుమతులు ఉద్యోగాలు 

2013-14 57258 323396

2014-15 66276 371774

2015-16 75070 407385

2016-17 85470 431891

2017-18 93442 475308

2018-19 109219 543033

2019-20 128807 582126

2020-21 145522 628615

2021-22 183569 778121

Updated Date - 2022-06-02T09:53:02+05:30 IST