పండిట్ల ఊచకోత కంటే సినిమాలపై మాట్లాడటంపైనే మోదీకి మక్కువ: Rahul

ABN , First Publish Date - 2022-05-15T20:59:58+05:30 IST

కశ్మీర్ పండిట్ ప్రభుత్వ ఉద్యోగిని మిలిటెంట్లు కాల్చిచంపిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ...

పండిట్ల ఊచకోత కంటే సినిమాలపై మాట్లాడటంపైనే మోదీకి మక్కువ: Rahul

న్యూఢిల్లీ: కశ్మీర్ పండింట్ రాహుల్ భట్‌ను మిలిటెంట్లు కాల్చిచంపిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్ పండిట్ల ఊచకోతపై మాట్లాడటం కంటే ఒక సినిమా గురించి మాట్లాడడానికే మోదీ ప్రాధాన్యం ఇస్తారని అన్నారు.  ఇవాళ కశ్మీర్‌లో ఉగ్రవాదం పతాక స్థాయిలో ఉందని, భారతీయ జనతా పార్టీ విధానాలే ఇందుకు కారణమని ఆయన తప్పుపట్టారు. వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై మోదీ ఇటీవల మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ, కశ్మీర్ పండిట్ల ఊచకోతల కంటే సినిమాలపై మాట్లాడటానికే ఆయన ఇష్టపడతారని విమర్శించారు. కశ్మీర్‌లో శాంతి భద్రతలు నెలకొనేందుకు బాధ్యత తీసుకోవాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు.


కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌ను ఆయన కార్యాలయంలోనే ఉగ్రవాదులు ఇటీవల కాల్చిచంపారు. ప్రత్యేక ఎంప్లాయిమెంట్ ప్యాకేజీకి కింద 2010-11లో ఆయనను ప్రభుత్వ క్లర్క్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారు. కాగా, 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ఇటీవల మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, అందరూ ఈ సినిమా చూడాలన్నారు. 1990లో కశ్మీర్ పండిట్ల ఊచకోతతో కశ్మీర్ అట్టుడకడంతో అనేక మంది పండిట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లోయ విడిచిపెట్టిన ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని వివేక్ అగ్నిహోత్రి రూపొందిచారు. గత మార్చి 11న ఈ చిత్రం విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంది.

Updated Date - 2022-05-15T20:59:58+05:30 IST