కాలు తీసేస్తానని బెదిరించి పనులు చేయించడం నా వల్లకాదు

ABN , First Publish Date - 2022-06-27T06:42:47+05:30 IST

‘చిత్తూరులో ఎమ్మెల్యేగా పనిచేసిన సీకేబాబు ఏ పని చేయాలన్నా కాలు తీసేస్తా.. చెయ్యి తీసేస్తానని బెదిరించి పనులు చేయించేవాడు. అది నావల్ల కాదు’ అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు.

కాలు తీసేస్తానని బెదిరించి పనులు చేయించడం నా వల్లకాదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

చిత్తూరు, జూన్‌ 26: ‘చిత్తూరులో ఎమ్మెల్యేగా పనిచేసిన సీకేబాబు ఏ పని చేయాలన్నా కాలు తీసేస్తా.. చెయ్యి తీసేస్తానని బెదిరించి పనులు చేయించేవాడు. అది నావల్ల కాదు’ అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. చిత్తూరులోని ఓ  కళాశాలలో ఆదివారం బలిజ అభ్యుదయ సేవా సమితి(బాస్‌) ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్‌ పాలరామమూర్తి మాట్లాడుతూ.. గతంలో సీకేబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనుల కోసం ఎవరైనా  వెళితే అధికారులను ఆదేశించే వాడని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తాను అధికారులను బెదిరించి పనులు చేయించలేనని, వారితో స్నేహంగానే ఉండి 40 సంవత్సరాలుగా పనులు చేయిస్తున్నానని తెలిపారు. బలిజలంతా కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత ఎన్నికల్లో 46వేల ఓట్లు వచ్చాయని, మరో 7 బాక్సులను ఎంచకుండా వదిలేశారన్నారు. బలిజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని తెలిపారు. అనంతరం  ఆత్మీయ సమావేశానికి వచ్చిన అతిథులను సన్మానించారు. ఈ సమావేశంలో బాస్‌ అధ్యక్షులడ  రవినాయుడు, ప్రతినిధులు పురుషోత్తం, పాలరామమూర్తి, వినాయక బాలాజీ, నందగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-27T06:42:47+05:30 IST